బిగ్‌బాస్ బ్యూటీ సోనాలి ఫోగట్ (43) సోమవారం రాత్రి ఆకస్మిక మృతి చెందారు. గోవాలో ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె రాజకీయాల్లో కూడా ఉన్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్-14లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 2006లో టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.
2008లో ఆమె బీజేపీలో చేరారు. టిక్ టాక్ ద్వారా ఆమె విశేష పాపులారిటీ పొందారు. ఆమెను బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా మార్చుకుంది. 2019 హర్యానా ఎన్నికల్లో ఆమె అదాంపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల కొంత మందితో కలిసి ఆమె గోవా వెళ్లారు. గత రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
దీంతో ఆమె అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్ స్టా ఖాతాలో ఆమె ఓ వీడియో షేర్ చేశారు. మొహమ్మద్ రఫీ పాట అయిన రుఖ్ సే జరా నికాబ్ తో హతా దే మేరే హజూర్ సాంగ్ పోస్ట్ చేయడం ఆమె అభిరుచిని తెలియజేస్తోంది.
సోనాలి ఫోగట్ భర్త 2016లో హిస్సార్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 2020లో ఓ అధికారిని చెప్పుతో కొట్టి ఆమె వివాదాస్పదమయ్యారు.