ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నోరు పారేసుకుంటున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కోవర్టుల వల్లే పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని పవన్ విమర్శించిన సంగతి తెలిసిందే. విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్‌కల్యాణే అని తీవ్ర విమర్శ చేశారు. చిరంజీవికి అధికారం రాలేదని, ఆయన్ను పక్కన పెట్టింది కూడా తమ్ముడు పవన్‌కల్యాణే అని ఆరోపించారు. ప్రజారాజ్యానికి కేవలం 18 సీట్లే దక్కాయని అసలు పార్టీని విడిచిపెట్టి ఎక్కడికో పోయాడని తప్పు పట్టారు. ప్రజారాజ్యాన్ని విలీనం చేయొద్దని నాడు చిరంజీవికి పవన్ ఎందుకు చెప్పలేదని వెలంపల్లి నిలదీశారు.
ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణమే పవన్ కళ్యాణ్ అని, తాము పిలుస్తున్నా రావడం లేదని మెగా అభిమానుల మధ్య స్వయంగా నాగబాబు చెప్పారని వెలంపల్లి గుర్తు చేశారు. ఒక సినిమా ఫంక్షన్‌లో పవర్‌స్టార్ పవర్‌స్టార్ అంటూ అభిమానులు అరుస్తుంటే నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అతను తమ తమ్ముడని, ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదని, సత్తా వుంటే మీరెళ్లి పిలుచుకురావాలని అసహనంతో నాగబాబు అనడాన్ని వెలంపల్లి గుర్తు చేశారు.
ఆ రోజు చిరంజీవిని అవమానించింది పవన్ కాదా? అని మాజీ మంత్రి నిలదీశారు. నాడు మెగా, అల్లు కుటుంబాలకు సంబంధించిన సినిమా వేడుకల్లో ఎందుకని పవన్ పాల్గొనలేదని ప్రశ్నించారు. ఎందుకంటే అప్పుడు రాజకీయ అవసరం పవన్‌కు లేదన్నారు.
నేడు జనసేన పార్టీ పెట్టారు కాబట్టి, తన రాజకీయ అవసరాల కోసం ఊసరవెల్లిలా పవన్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. దత్త పుత్రుడు షూటింగ్ లేని సమయంలో బయటికి వచ్చి సంక్షేమ ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడున్నారని ఆయన ప్రశ్నించారు. అవసరం ఉన్నప్పుడు మాత్రం చిరంజీవిని తీసుకుంటాడని, లేదంటే పక్కన పెట్టడం పవన్ నైజమని ఆయన విమర్శించారు. పవన్‌కల్యాణ్ కంటే ఎక్కువ ప్రేమతో చిరంజీవిని జగన్ ఆదరిస్తారని ఆయన గుర్తు చేశారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో చిరంజీవిపై జగన్ ఎంతో ప్రేమ కనబరిచారన్నారు. జగన్, చిరంజీవి మధ్య గ్యాప్ పెంచడానికే పవన్ దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు డైరెక్షన్‌లో చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారని తేల్చి చెప్పారు. కనీసం కార్పొరేటర్‌గా కూడా పవన్ గెలవలేరని ఆయన అన్నారు. కేశినేని నాని ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు.