సాధారణంగా రాజకీయాల్లో అనుబంధాలకు, ఆత్మీయతకు, ప్రేమకు తావుండదని అంటారు. ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఇలాంటి బంధాలకు చోటుండకూడదు. అలనాడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడు విల్లు, బాణాలు వదిలి తాను యుద్ధం చేయలేనని కృష్ణుడితో అన్నప్పుడు ఆయన చెప్పింది కూడా ఇదే. యుద్ధం చేయడం ధర్మం అన్నాడు.
యుద్ధాలు కావొచ్చు, ఎన్నికలు కావొచ్చు, సమస్యలు కావొచ్చు ధైర్యంగా ఎదుర్కొని వాటి అంతు చూడాలి. అంతే తప్ప యేవో రకరకాల సాకులు చెప్పి తప్పించుకోకూడదు. కానీ మునుగోడు ఉప ఎన్నిక విషయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న పని ఇదే. కర్ర విరగనివ్వడు…పాము చావనివ్వడు. కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికను ఎదుర్కోవడం కంటే వెంకటరెడ్డిని దారిలోకి తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది. పార్టీలో తనకు అవమానం జరిగిందనే సాకు చూపించి డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తున్నాడు.
ఉప ఎన్నికలో తాను ప్రచారం చేయనని కరాఖండీగా చెప్పేశాడు. దీన్నిబట్టి చూస్తే ఆయనకు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇన్నేళ్ళలో ఎప్పుడూ లేనిది సరిగా ఉప ఎన్నిక సమయంలోనే మొండికేయడానికి కారణం ఏమిటి? ఉప ఎన్నిక సమయంలో పార్టీకి సహకరించడానికి ఇష్టపడటంలేదుకానీ తాను పార్టీని విడిచి వెళ్లనంటాడు.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఓ వైపు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతలతో సమావేశం కాగా ఈ భేటీకి డుమ్మా కొట్టి హైదరాబాద్ వచ్చిన వెంకట్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. హైకమాండ్‌తో జరిగిన భేటీకి ఎందుకు హాజరుకాలేదనే అంశంపై సోనియాగాంధీకి లేఖ రాసిన ఈయన హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే కొత్త డిమాండ్‌ను తీసుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌కు అనుభవం లేదని.. ఆయన స్థానంలో కమల్‌నాథ్ వంటి సీనియర్ నేతను ఇంఛార్జ్‌గా నియమించాలని డిమాండ్ చేశాడు. అందరి అభిప్రాయాలు తీసుకుని టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డిని మార్చి ఆ స్థానంలో మరొకరిని నియమించాలని అధిష్టానానికి సూచించాడు. అలా చేయని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ బతికే అవకాశం లేదని అన్నాడు.
మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ పార్టీ కచ్చితంగా గెలవాలని పార్టీ నేతలకు సూచించేందుకు ఈ కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సఖ్యతను కుదిర్చే ప్రయత్నం కూడా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అందుకే ఈ భేటీకి హాజరుకావాలని ఆయనకు ముందస్తుగానే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ఈ భేటీ జరగడానికి కొద్ది గంటల ముందే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావడానికి ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆయన తీరు పట్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్‌గా ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే చర్చ మొదలైంది.
వాస్తవానికి తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వెంకట్ రెడ్డికి ఇష్టం లేదు. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి వెంకట్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు ఆడుతున్నారు. మరో పార్టీలో అయితే చెల్లుతుందా? రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం ఆయనకు ఇష్టం లేదు. దీనిపై ఆయన ఎప్పుడో ఫైట్ చేయాల్సింది. ఫైట్ చేసినా అధిష్టానం వినకపోతే వేరే పార్టీలో చేరాల్సింది. కానీ ఎన్నిక వచ్చిన సమయంలో తన కక్ష తీర్చుకుంటే ఎలా? ఏమైనా గొడవలుంటే ఉప ఎన్నిక తరువాత చూసుకోవాలి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేయడం, ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఇక మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేదని మొదట ప్రచారం జరగగా, ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆయనే నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు.
ఇక ఇదే సమయంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే తమ్ముడు మీద అన్ననే ఎన్నికల ప్రచారానికి బరిలోకి దింపాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా భావించారు. కానీ ఇప్పుడు వెంకట్ రెడ్డి ప్రచారం చేయనని మొండికేయడంతో అధిష్ఠానానికి దిక్కు తోచడంలేదు. వెంకట్ రెడ్డి వ్యవహారం ఏం మలుపులు తిరుగుతుందో.