ఏపీలో రాజకీయ మాటల యుద్ధాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఏపీకి వారాంతాలలో వచ్చి చేసే పర్యటనలు అక్కడ ఆయన మాట్లాడే మాటలు అధికార వైసీపీనే టార్గెట్ గా సాగుతున్నాయి. అయితే పవన్ నోటి వెంట వచ్చిన మాటలకు దీటైన బదులు వైసీపీ నుంచి కూడా వస్తోంది.
పవన్ కామెంట్స్ ని తిప్పికొడుతూ మంత్రి గుడివాడ అమరనాధ్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ లో కొన్ని హైలెట్ అవుతున్నాయి. మేమంతా మెగాస్టార్ ఫ్యాన్స్. చిరంజీవి అంటే మాకు ఇష్టం. అలాంటి మా అభిమాన హీరో మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మేము చాలా బాధపడుతున్నామని మంత్రి గారు అంటున్నారు. చిరంజీవికి ఏదో అవమానం జరిగిందని పవన్ చెబుతూ చివరికి ఆయన పుట్టిన రోజున బాధపడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని గుడివాడ అన్నారు.
ఇంతకీ మీ ఇంటి పేరు ఏంటి పవన్ అని కూడా ప్రశ్నించారు. మిమ్మల్ని కొణిదెల పవన్ అనాలా లేక నారా నాదెండ్ల పవన్ అనాలా అని సెటైర్లు వేశారు. వైసీపీ విముక్త ఏపీ అంటున్నారు అంటే పవన్ కి బాబు తో డీల్ కుదిరినట్లే అని మంత్రి గారు తేల్చేశారు.
ఏపీలో వైసీపీ వారు బెదిరిస్తున్నారు అని పవన్ అంటున్నారని, అలా కనుక చేస్తే ఏపీలో ఆయన తిరగగలడా అని ప్రశ్నించారు. ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే లంచాలు బెదిరింపులు అంటూ పవన్ చేసిన విమర్శలు దారుణం అన్నారు. అలా ఏ ఒక్క పారిశ్రామికవేత్త అయినా అలా అన్నట్లు నిరూపించగలరా అని జనసేనానిని నిలదీశారు.
ఇక్కడ మంత్రి గారి విమర్శలలో కొత్త విషయం ఏంటి అంటే మెగాస్టార్ మావాడు మేము ఆయన అభిమానులమని చెప్పుకోవడం, అలాగే పవన్ చంద్రబాబు పక్షమని తీసి పక్కన పెట్టడం. మెగాస్టార్ పవన్ కి అన్న అయినా జనసేనాని ఆయన మీద చేస్తున్న కామెంట్స్ అసలు బాగోలేవని కూడా గుడివాడ ఒకటికి పదిసార్లు చెప్పడం. దీని మీద జనసేన నేతలు కూడా బదులిచ్చేందుకు రెడీ అవుతున్నారు.