నిన్న మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి..రామారావు..రామ్ చరణ్ కావచ్చు. కానీ ఇప్పుడు అది కాదు. రామోజీ, రామారావు, రాధాకృష్ణ, రామ్ చరణ్. ఇదే కేంద్ర మంత్రి, భాజపా నేత అమిత్ షా వ్యవహారశైలి.
ఆర్ఆర్ఆర్ అనే సినిమా వచ్చింది. బాగుంది. అమిత్ షా కు బాగా నచ్చింది. అప్పుడేం చేయాలి. సినిమాకు మూలమైన రాజమౌళిని అభినందించాలి. తమ పార్టీతో పొత్తు వున్న పవన్ కళ్యాణ్ అన్న కుమారుడు అనే లెక్క చూసుకుని అయినా రామ్ చరణ్ భుజం కూడా తట్టాలి. ఆపై ఎన్టీఆర్ సంగతి సరే సరి. కానీ అలా చేయకుండా ఎన్టీఆర్ ను మాత్రమే పిలిచి భుజం తట్టడం ఏమిటి?
అదలా వుంచుదాం. ఎవరినైనా అభినందించాలి అంటే ఏం చేస్తారు. తామే వెళ్లి అభినందిస్తారు. అంతే కానీ అభినందనులు అందుకునే వారే బొకేలు, శాలువలు పట్టుకుని వెళ్లి తమ అభిమానం తాము చాటుకోరు కదా? పోనీ అది కూడా వదిలేయండి. ఇంత జరిగిన తరువాత పార్టీ అంతా ఏకమాట మీద వుండాలి కదా? అంతే తప్ప, ఇదేం పెద్ద విషయం కాదు. పార్టీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు చేస్తూ వుంటుంది అని సింపుల్ గా తీసి పడేస్తే ఎన్టీఆర్ కు కానీ ఆయన ఫ్యాన్స్ కు కానీ ఎంత నామర్దా?
దీన్ని కూడా అలా వుంచుదాం. అసలే సోషల్ మీడియా లో సినిమా అభిమానులు, సినిమా హీరోల కులాభిమానులు రెండుగా చీలిపోయి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ గొప్ప అని ఒకరు, ఎన్టీఆర్ గొప్ప అని మరొకరు కొట్టుకుంటున్నారు. ఆ సంగతి దేశ వ్యవహారాలన్నీ ఔపాసన పట్టిన అమిత్ షా కు తెలియంది కాదు. కులాల ఈక్వెేషన్లు తెలియనవి కావు. అలా తెలిసి కూడా కేవలం ఎన్టీఆర్ ను మాత్రం పిలిపించుకుని అభినందించడం అంటే ఏమనుకోవాలి? ఎవరికో పొమ్మనలేక పొగపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా?
అసలే పవన్ కళ్యాణ్ కిందా మీదా పడి కమ్మ-కాపు కలిపే రాజకీయం చేయాలని అనుకుంటున్నారని వార్తలు వున్నాయి. ఇప్పుడు ఇలా చరణ్ ను పక్కన పెట్టి రామారావును అభినందిస్తే భాజపాతో కలిసి పవన్ ఏం చేయాలని భావిస్తున్నట్లు?
ఇవన్నీ ఇలా వుంచితే ఎన్టీఆర్ తాను తెలుగుదేశం పార్టీతో అంటీ ముట్టనట్లు వుండడానికి కారణం లోకేష్ అన్నది రాజకీయ వర్గాలు చెప్పుకునే రీజన్. చంద్రబాబు తన కొడుకును సిఎమ్ గా చూడాలనుకుంటున్నారు. చేయాలనుకుంటున్నారు. సహజంగానే అది ఎన్టీఆర్ కు నచ్చదు. ఇలా డిసైడ్ అయిపోవడానికి పెద్దగా అనుభవం అక్కర్లేదు, రాజకీయాలను పరిశిస్తుంటూ వుంటే చాలు. అందువల్ల ఎన్టీఆర్ కలవడం అన్నది తేదేపాకు కలిసి వస్తుందని, మావయ్య నాయుడుతో కలిసి వెళ్లమని ఎన్టీఆర్ రికమెండ్ చేసేదీ వుండదు.
ఈ విధంగా తెలుగుదేశానికి ఫలితం వుండకపోగా, కమ్మవారు చేస్తున్న ఎన్టీఆర్-అమిత్ ల హడావుడి చూసి రామ్ చరణ్ అభిమానులు, కాపు సామాజిక వర్గం మాత్రం బాధపడడం పక్కా. మరి ఇలా కమ్మ కాపుల మధ్య విభజన రేఖ గీసే పని అమిత్ షా చేయడం వల్ల పవన్ పరిస్థితి ఏమిటి?
రామారావు..రామ్ చరణ్ సంగతి అలా వుంచితే మూడో ఆర్ అయిన రామోజీ వుండనే వున్నారు. ఆడు మగాడ్రా బుజ్జీ అన్నట్లు దేశంలోనే శక్తివంతమైన నేత అమిత్ షా నేరుగా ఆయన ఇంటికే వెళ్లి ఆయనతో ముచ్చటించి వచ్చారు. ఇది ఎవరు ఎవరికి మండిస్తుంది..ఎవరికి ఆనందం ఇస్తుంది అన్న సంగతి అలా వుంచితే, తాను..తన మీడియా ఎంతో శక్తి వంతవైనమని మరో మీడియా అధినేత రాధాకృష్ణ భావిస్తూ వుండి వుండొచ్చు. నాలుక మడేతేసినట్లు ఆయన తన మీడియా వార్తలు కూడా రకరకాలుగా మడతేస్తుంటారని అభిప్రాయం వుంది. షర్మిలకు అయినా లోకల్ భాజపా నాయకులకు అయినా రాధాకృష్ణ అండ కావాలి.
మరి అలాంటపుడు రామోజీని ఇంటికి వెళ్లి కలిసిన అమిత్ షా, కనీసం నోవాటెల్ లో అయినా రాధాకృష్ణను కూడా కలిసి వుంటే వేరుగా వుండేది. కానీ అలా జరగలేదు. చంద్రబాబుతో దోస్తీ చేయనంత కాలం భాజపా అంటే ఆర్కేకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆయన సిద్దాంతాలు ఆయనవి. ఆయన అభిమానాలు ఆయనవి. ఇప్పుడు అమిత్ షా స్వయంగా ఆర్కేను దూరం పెట్టి, రామోజీని దగ్గరకు తీయడం అంటే ఏమని భావించాలి.
మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ కొత్త ఆర్ఆర్ఆర్ఆర్ దే హడావుడి అంతా. ఎవరికి తోచినట్లు వాళ్లు ఏనుగును వర్ణించినట్లు, ఎవరికి అనుకూలంగా వాళ్లు మాట్లాడేసుకోవడమే.