వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి చర్చించుకునేవాళ్లం. ఇప్పుడు వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.
గోషామహల్ నుంచి ఆయన బీజేపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నిత్యం ఏదో ఒక రెచ్చగొట్టే ప్రకటనతో రాజాసింగ్ తన ఉనికి కాపాడుకుంటున్నారనే విమర్శ వుంది. గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు కూడా డబుల్ ఇంజన్ వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా హిందువుల ఉద్ధారకుడినంటూ ఇతర మతాలను రెచ్చగొడుతున్నారనేది ఆయనపై ప్రధాన ఆరోపణ. రెండు రోజుల క్రితం కమెడియన్ మునావర్ షారూకి హైదరాబాద్‌లో షో నిర్వహణ సందర్భంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. కమెడియన్ హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తుంటారనేది రాజాసింగ్ ప్రధాన ఆరోపణ. షోను అడ్డుకుంటారనే ఉద్దేశంతో రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు లేకుండానే షో ముగిసింది.
తాజాగా మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారనేది ఆరోపణ. ఈ వీడియోలో ముస్లింల మనోభావాలను కించపరిచారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఎమ్మెల్యేను అరెస్టు పోలీసులు చేశారు. అలాగే ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.