జనసేన ఆవిర్భవించి 9 సంవత్సరాలైంది. ఇంత వరకూ కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను కూడా నియమించుకోలేని దుస్థితి. దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్‌కల్యాణే అని సొంత పార్టీ కార్యకర్తలు కూడా అంటున్న మాట. టీడీపీ అధినేత చంద్రబాబుతో సాగిస్తున్న చీకటి సంబంధాల వల్లే పార్టీని అంధకారంలోకి నెడుతున్నారని జనసైనికుల ఆవేదన.
మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మార్పు తీసుకొస్తానని, అణగారిన వర్గాల రాజకీయ అధికార ఆకాంక్షను నెరవేరుస్తానంటే కొంత వరకూ నమ్మారు. అందుకే కనీసం రెండు అంకెల సీట్లైనా వచ్చాయి. 2009లో కూడా వైఎస్సార్ నేతృత్వంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం చేశారు. చిరంజీవికి రాజ్యసభ పదవి, అనంతరం కేంద్ర మంత్రి అయ్యారు.
ప్రజారాజ్యం అనుబంధ విభాగం యువరాజ్యానికి పవన్‌కల్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న ప్పుడు పవన్ నోరెత్తలేదు. ఇదేంటని అన్నను ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు తెగ బాధపడిపోతూ… నాటి విలీనానికి వైఎస్సార్ కోవర్టులే కారణమని విమర్శిస్తున్నారు. అప్పట్లో చిరంజీవి, పవన్‌కల్యాణ్ రాజకీయాలు వదిలేసి సినిమాల్లో బిజీ అయ్యారు. రాజకీయాలు మంచి వ్యాపారమని పవన్ భావించారో, మరే కారణమో తెలియదు కానీ, పవన్ జనసేనను స్థాపించారు.
పవన్ అంతా తానై ఒన్ మ్యాన్ షో చేశారు, చేస్తున్నారు. చిరంజీవి ఊసే లేదు. అన్న కనపడితే మరో ప్రజారాజ్యం అవుతుందని జనం అనుమానిస్తారని పవన్ భయపడినట్టున్నారు. జనసేనను స్థాపించిన పవన్… అప్పుడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా జగన్నే తిట్టడం పవన్‌కల్యాణ్ ప్రత్యేకత. జగన్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా శత్రువుగానే ఆయన చూస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులపై పవన్ ఏనాడూ ఒక్క మాట కూడా విమర్శించలేదు. చంద్రబాబుతో పవన్ లాలూచీ ఏంటో జనానికి అర్థమైంది.
టీడీపీపై ప్రజావ్యతిరేకతను పసిగట్టి, 2019లో ఆ పార్టీకి పవన్ దూరంగా ఉన్నారు. పనిలో పనిగా ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని రాష్ట్ర ప్రజానీకం కోపంగా ఉన్నారని గ్రహించి, ఆ పార్టీకి కూడా ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు. నాటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నంలోనే పవన్ విడిగా పోటీ చేశారని జనం గుర్తించారు. దీంతో ఆయనకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. చివరికి పవన్ నిలిచిన రెండుచోట్ల కూడా ఆయన్ను ఓడించారు. పార్టీని నడపడం కష్టమని భావించిన పవన్ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు.
బీజేపీతో పెళ్లి, టీడీపీతో సంసారం అన్నట్టుగా ఆయన రాజకీయ వ్యవహారాలున్నాయనే విమర్శ. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన మనస్ఫూర్తిగా పని చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు లవ్ ప్రపోజల్ తేవగానే, పవన్ మనసు పారేసుకున్నారు. పవన్ కల్యాణ్ మీటింగ్ పెట్టారంటే… జగన్, కులాలపై విషం కక్కడం పవన్‌కు అలవాటైంది. తనను ఎందుకు అధికారంలోకి తీసుకురావాలో పవన్ ఎక్కడా చెప్పడం లేదు. జగన్‌ను విమర్శించడానికే పుణ్యకాలం కాస్త సరిపోతోంది.
జగన్ విముక్త ఆంధ్ర అంటూ కొత్త రాగం అందుకున్నారు. కానీ సొంత పార్టీ నాయకుల నినాదం మరోలా వుంది. తమ పార్టీకి టీడీపీ నుంచి ఎప్పుడు విముక్తి వస్తుందంటూ బహిరంగంగా చర్చించుకుంటున్న పరిస్థితి. భవిష్యత్ రాజకీయాలపై ఎటూ తేల్చకుండా, జనసేన కార్యకర్తలు, నాయకుల్ని కూడా కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. పవన్ రాజకీయ పంథా ఇలాగే కొనసాగితే… 2024లో కనీసం ఆయనకు డిపాజిట్ కూడా దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.