జ‌న‌సేన ఖుషీ

హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపొందింది. ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఈ ఎన్నిక‌లో టీఆర్ఎస్ మొద‌టి నుంచి ఆధిక్య‌త కన‌బ‌రిచినా …రెండో ప్రాధాన్య‌త ఓట్ల‌తో గ‌ట్టెక్కుతామ‌ని బీజేపీ న‌మ్ముతూ వ‌చ్చింది.  Advertisement…

హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపొందింది. ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఈ ఎన్నిక‌లో టీఆర్ఎస్ మొద‌టి నుంచి ఆధిక్య‌త కన‌బ‌రిచినా …రెండో ప్రాధాన్య‌త ఓట్ల‌తో గ‌ట్టెక్కుతామ‌ని బీజేపీ న‌మ్ముతూ వ‌చ్చింది. 

అయితే రెండో ప్రాధాన్య‌త ఓట్ల‌లో కూడా అదే ఒర‌వ‌డి కొన‌సాగ‌డంతో బీజేపీ త‌న సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇక్క‌డి నుంచి దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె సుర‌భి వాణీదేవి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి రామ‌చంద్ర‌రావుపై విజ‌యం సాధించిన‌ట్టు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ప్రియాంక ఆల అధికారికంగా ప్ర‌క‌టించారు.

ముఖ్యంగా వాణీదేవి గెలుపు టీఆర్ఎస్ కంటే , ఏపీ బీజేపీ మిత్ర‌ప‌క్షమైన జ‌న‌సేన‌కు ఎక్కువ ఆనందాన్ని ఇస్తోంది. ఈ నెల 14న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రోజు వాణీదేవికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తెలంగాణ బీజేపీకి తామంటే లెక్క‌లేనిత‌న‌మ‌ని, ఏ మాత్రం గౌర‌వించ‌డం లేద‌ని, అందువ‌ల్లే ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి కాకుండా పీవీ న‌ర‌సింహారావు కుమార్తె వాణీదేవికి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో నాలుగు రోజుల పాటు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ ఉత్కంఠంగా సాగింది. చివ‌రికి ఈ పోరులో టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవి స్వ‌ల్ప తేడాతో బీజేపీపై విజయం సాధించ‌డంపై జ‌న‌సేన సంబ‌రాలు చేసుకుంటోంది. త‌మ‌ను అవ‌మానించిన పాపానికి  బీజేపీ త‌గిన మూల్యం చెల్లించింద‌ని జ‌న‌సేన నుంచి సెటైర్లు ప‌డుతున్నాయి. త‌మ‌తో స‌ఖ్య‌త‌గా ఉండి ఉంటే బీజేపీకి ఈ గ‌తి ప‌ట్టేది కాద‌ని  జ‌న‌సేన నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

త‌మ‌ను గౌర‌వించ‌డం ప‌క్క‌న పెడితే తెలంగాణ బీజేపీ నేత‌లు అవ‌మానించే రీతిలో మాట్లాడార‌ని జ‌న‌సేన నేత‌లు , ఆ పార్టీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు గుర్తు చేస్తున్నారు. బీజేపీ ఎంపీ అర‌వింద్ మొద‌లుకుని , ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌ర‌కూ అంతా కూడ‌బ‌లుక్కున్న‌ట్టు త‌మ పార్టీని చుల‌క‌న చేసి మాట్లాడార‌ని జ‌న‌సేన నేత‌లు చెప్పుకొస్తున్నారు. 

మ‌రోవైపు స్వ‌ల్ప తేడాతో ఓడిపోవ‌డంతో జ‌న‌సేన‌పై తెలంగాణ బీజేపీ గుర్రుగా ఉంది. క‌నీసం జ‌న‌సేన సైలెంట్‌గా ఉన్నా స‌రిపోయేద‌ని అంటున్నారు. ఏది ఏమైనా హైద‌రాబాద్‌లో ఓట‌మి బీజేపీ-జ‌న‌సేన మ‌ధ్య‌ మ‌రింత గ్యాప్ పెంచింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.