తిరుప‌తిపై తొల‌గిన ప‌వ‌న్ క‌ల్యాణ్ భ్ర‌మ‌లు!

తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించి టికెట్ ను జ‌న‌సేన‌కు కేటాయించ‌క‌పోతే తాము బీజేపీకి స‌పోర్ట్ చేసేది ఉండ‌ద‌ని బ‌లిజ సంఘాల వాళ్లు తీర్మానించిన‌ట్టుగా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. అంతే కాదు.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు…

తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించి టికెట్ ను జ‌న‌సేన‌కు కేటాయించ‌క‌పోతే తాము బీజేపీకి స‌పోర్ట్ చేసేది ఉండ‌ద‌ని బ‌లిజ సంఘాల వాళ్లు తీర్మానించిన‌ట్టుగా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. అంతే కాదు.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌ట హ‌డావుడి మొద‌లుపెట్టింది తిరుప‌తిలోనే! అక్క‌డ జ‌న‌సేన‌కు సానుకూల సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు ఉన్నాయ‌ని, అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టి తిరుప‌తి ఉంద‌ని అప్ప‌ట్లోనే గ‌ట్టిగా ప్ర‌చారం చేశాయి జ‌న‌శ్రేణులు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గాజువాక‌లో, భీమ‌వ‌రంలో పోటీ చేసి పొర‌పాటు చేశార‌ని, అదే తిరుప‌తి  అసెంబ్లీ సీటుకు ఆయ‌న పోటీ చేసి ఉంటే.. గొప్ప విజ‌యం సాధించేవాడంటూ సోష‌ల్ మీడియాలోని జ‌న‌సైనికులు,  వీర‌మ‌హిళ‌లు వాపోయారు!

అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ గాజువాక‌లోనూ, భీమ‌వ‌రంలోనూ పోటీ చేసిందే కుల స‌మీక‌ర‌ణాల ఆధారంగా అనేది ముందే వ‌చ్చిన స్ప‌ష్ట‌త‌. త‌న సామాజిక‌వ‌ర్గం ఓట్లు,త‌న పార్టీ స‌భ్య‌త్వాలు భారీగా న‌మోదు అయిన చోటకు వెళ్లి ప‌వ‌న్ క‌ల్యాణ్ నామినేష‌న్ వేశార‌నేది అంద‌రికీ తెలిసిందే. త‌ను కుల రాజ‌కీయాలు చేయ‌నంటూ చెప్పుకుంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అలా త‌న కులం ఓట్ల‌ను ఫాలో అయ్యి ఒక‌టికి రెండు చోట్ల నామినేష‌న్ వేశారు, రెండు చోట్లా ఓడిపోయారు.  అది అంద‌రికీ తెలిసిన క‌థే. అయినా.. మ‌ళ్లీ జ‌న‌సైనికులు తిరుప‌తిలో అయితే.. అన‌డం వారి మార్కు కామెడీ!

కులం త‌ప్ప ప‌వ‌న్ క‌ల్యాణ్ ను రాజ‌కీయంగా ర‌క్షించేది ఏదీ లేద‌ని ఆ పార్టీ శ్రేణులు అలా ఒప్పుకుంటూ ఉంటాయి. ఇక తిరుప‌తి లోక్ స‌భ సీటుకు బై పోల్ నేప‌థ్యంలో కూడా మ‌ళ్లీ కుల స‌మీక‌ర‌ణాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. జ‌న‌సేన‌కు ఆ టికెట్ ను కేటాయించాల‌ని బ‌లిజ సంఘాలు బీజేపీకి సిఫార్సు చేశాయ‌ట‌. అయితే బీజేపీ ఏమో త‌న స‌త్తా ఏమిటో చూపాల‌నే ఉబ‌లాటంలో ఉంది. ఈ క్ర‌మంలో బీజేపీకే ఆ టికెట్ ఖ‌రారు అయ్యింది.

మ‌రి ఇప్పుడు బ‌లిజ సంఘాలు ఏమ‌ని ప్ర‌క‌టిస్తాయో, ఎలా ఓటేస్తాయో! ఆ సంగ‌త‌లా ఉంటే.. తిరుప‌తి కార్పొరేష‌న్లో జ‌న‌సేన‌కు వ‌చ్చిన ఓట్లు మాత్రం చాలా స్ప‌ష్ట‌త‌నే ఇచ్చాయి. 50 డివిజ‌న్లు ఉన్న తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో జ‌న‌సేన‌కు వ‌చ్చిన ఓట్ల సంఖ్య అక్ష‌రాలా..231.  స‌గ‌టున వార్డుకు ఐదు ఓట్ల నిష్ఫ‌త్తిలో కూడా ఆ పార్టీకి ఓట్లు ప‌డ‌లేదు.

వాస్త‌వానికి తిరుప‌డి కార్పొరేష‌న్ ప‌రిధిలో జ‌న‌సేన పోటీ చేసిందే రెండు డివిజ‌న్ల‌కు! 50 డివిజ‌న్లు ఉన్న చోట జ‌న‌సేన‌కు ప‌డ్డ నామినేష‌న్లే రెండు డివిజ‌న్ల‌కు. ఈ పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీ ఎనిమిది డివిజ‌న్ల‌కు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయ‌గ‌లిగింది! రెండు పార్టీలూ క‌లిపి క‌నీసం 50 డివిజ‌న్ల‌కు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయించ‌లేక‌పోయాయి. ఎనిమిది డివిజ‌న్ల‌లో పోటీ చేసి బీజేపీ సుమారు 2,546 ఓట్ల‌ను పొందితే, రెండు డివిజ‌న్ల‌కు గానూ జ‌న‌సేన 231 ఓట్ల‌ను సాధించింది. సుమారు 60 వేల‌కు పైగా ఓట్లు పోల్ అయితే.. ఈ రెండు పార్టీలూ ముచ్చ‌ట‌గా మూడు వేల ఓట్ల‌ను కూడా పొంద‌లేక‌పోయాయి. అది కూడా తిరుప‌తి అర్భ‌న్ లో!

ఎక్క‌డైతే జ‌న‌సేన‌కు తిరుగులేద‌న్నారో, ఎక్క‌డైతే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు అనుకూలంగా ఉన్నాయ‌న్నారో, ఎక్క‌డైతే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సింద‌న్నారో, ఎక్క‌డైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశం ఉందంటున్నారో.. అదే తిరుప‌తిలో బీజేపీ, జ‌న‌సేన‌లు జాయింటుగా చూపిన ప్రతాపం ఇది! ఇదే తిరుప‌తి లోక్ స‌భ సీటు ఉప ఎన్నిక‌లనూ బీజేపీ-జ‌న‌సేన‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.  

అక్క‌డ స‌త్తా చూప‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించాయి. ఇలాంటి నేప‌థ్యంలో వీళ్ల‌కు అత్యంత అనుకూల స‌మీక‌ర‌ణాలు క‌లిగిన తిరుప‌తి సిటీలో మూడు వేల ఓట్లు రావ‌డం.. అస‌లు క‌థ‌పై స్ప‌ష్ట‌త‌ను ఇస్తూ ఉంది.