చేసిందంతా చేసి చేతులు దులుపుకొని రెండు దశాబ్దాల తర్వాత అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా, దాని మిత్రగణం నిష్క్రమించటం మొదలుపెట్టారు. ఎంత దారుణమంటే కనీసం దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి మాట మాత్రం కూడా చెప్పకుండా కాబూల్‌కు కూతవేటు దూరంలోని వైమానిక స్థావరాన్ని ఖాళీ చేసిపోయారు. ఇన్నేళ్లుగా వాళ్లు సాగించిన విధ్వంసం ఒక్కటే ప్రపంచానికి తెలిసింది. కానీ అక్కడి సమాజంలో అమెరికా దురాక్రమణ తీసుకొచ్చిన మార్పులు, వాటి పర్యవసానాలు…మున్ముందు వాటివల్ల కలిగే పరిణామాలు కొందరికి కునుకు పట్టనీయడం లేదు. రోజురోజుకీ మునుముందు కు దూసుకువస్తున్న తాలిబన్ల తీరు వాళ్ళ ను వణికిస్తోంది. అమెరికా దురాక్రమణ అనంతరకాలంలో ఎలావుండేదో, ఇప్పుడేమువుతున్నదో చెప్పే కథనం ఇది.
తొలిసారి జీతం తాలూకు చెక్కు అందుకోగానే ఆ కుర్రాడి మొహం వెలిగిపోయింది. వెంటనే సైకిల్ తీశాడు. నగర వీధుల్లో విహరించాడు. వచ్చే పోయే యువతులను వారి హిజాబ్‌ల నుంచే పరీక్షగా చూడటం మొదలెట్టాడు. వారి చూపు తనపై పడకపోతుందా అని తపించాడు. అతని ధ్యేయం ఒక్కటే– తనకంటూ ఒక భార్యను ఎంచుకోవటం! పెద్దలకు చెప్పి రాయబారం పంపటం!! ఇది మరో యువకుడి కథ. ఇతనూ పెళ్లికి తయారయ్యాడు. అదృష్టవశాత్తూ వెదుక్కోవాల్సిన పని లేదు. పొరుగునే ఉన్న చిన్నదానిపై మనసు పారేసుకున్నాడు. కానీ చిక్కేమంటే ఇంట్లోవాళ్లకు ఈ సంగతి తెలియకూడదు. ఆమెదీ అదే అవస్థ.
ఈ కుర్రాడు నచ్చాడు. కానీ ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా…? అందుకే ఎవరూ చూడనప్పుడే వారి కళ్లు కలిసేవి. ఊసులాడుకునేవి. పెళ్లీడు వచ్చిందని గ్రహించి ఇంట్లోవాళ్లు సంబంధాలు చూడటం మొదలెట్టాక, పొరుగమ్మాయిని చేసుకుంటాను…అడిగి చూడమన్నాడు. అమ్మో, వాళ్లడిగే కన్యాశుల్కానికి మనం తూగగలమా అని తల్లిదండ్రులు కొట్టిపారేశారు. ఫర్వాలేదు అడిగి చూడండి, నా దగ్గర కాస్త డబ్బుందని ఎంతో ఆత్మ విశ్వాసంతో అతను చెప్పగలిగాడు.
ఇప్పుడు చెప్పేది ఒక కుర్రాడి విఫల ప్రేమ. అతని లవర్ దూరపు చుట్టం. కానీ ఉండేది పాకిస్తాన్లో. ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టాడు. కానీ అలాంటి శ్రీమంతులతో సరితూగలేమని తల్లిదండ్రులు చెప్పేశారు. అడిగి లేదనిపించుకోవడం ఇష్టం లేదని చెప్పి, గంతకు తగ్గ బొంతను వెదికారు. పెళ్లయితే అయింది కానీ ప్రేయసిని అతను మరవలేకపోతున్నాడు. ఎప్పటికప్పుడు సంపాదన వెనకేస్తున్నాడు.
ఎందుకంటే ఇప్పటికీ ఆ ప్రేయసి అవివాహితగానే ఉండిపోయింది. ఎలాగైనా రహస్యంగా ఒక ఇల్లు కట్టి ఆమెను తనదాన్ని చేసుకుంటేనే జన్మ ధన్యమవుతుందని అతని ఆత్రుత. అయితే రెండో పెళ్లాన్ని తెస్తే కాల్చుకు చస్తానని భార్య చేసే హెచ్చరిక అతనిలో గింగిరాలు తిరుగుతూనే వుంది. అయినా నిబ్బరంగానే ఉన్నాడు. అనుకున్నది సాధిస్తానని అతని నమ్మకం. వీరంతా ఏదో వాణిజ్య ప్రకటనలో చెప్పినట్టు చిట్‌ఫండ్ కంపెనీలో పొదుపు చేస్తున్నవారు కాదు.
టీనేజ్‌కొచ్చాక పెళ్లి కోసం ఏదో ఒక పనిలో కుదురుకుని సంపాదించుకోవటం అలవాటు చేసుకున్న లక్షలమంది అఫ్ఘానిస్తాన్ యువకుల్లో కొందరు. కానీ అందరూ వీరిలా గౌరవప్రదమైన కొలువు సంపాదించలేరు. ఎందుకంటే…వీళ్లు కష్టపడి ఇంగ్లిష్ నేర్చుకున్నారు. పడమటి దేశాలనుంచి వచ్చే సైనికాధికారులకూ, వ్యాపారులకూ, పాత్రికేయులకూ దుబాసీలుగా పనిచేశారు. మరి మిగిలినవారు…? చదువు అంటనివారికి తాలిబన్లే గతి. వాళ్లల్లో చేరితే నెల జీతం వస్తుంది. పైగా సర్కారీ భద్రతా దళాల్లో చేరినవారికంటే అది రెట్టింపు ఉంటుంది. కానీ అవతలివాళ్లకి దొరికితే ఇంతే సంగతులు.
చంపడమో… చావడమో…పట్టుబడటమో! అందుకు భయపడేవారికి వేరే పనులుంటాయి. విదేశీ సైనిక స్థావరాలకు కాంక్రీట్ బ్లాక్‌లు అమ్మడం, ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేయటం, నిత్యం విదేశీ దౌత్యవేత్తలతో, పాత్రికేయులతో, వ్యాపారులతో కిటకిటలాడే గాండ్మాక్ లాడ్జీలో వంటవారిగానో, వెయిటర్లగానో పనిచేయటం. ఇంకా అమ్మకానికి బోలెడున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీ కల్పిస్తామని, బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూరుస్తామని ఆఫర్లు ఇవ్వటం వీటిల్లో కొన్ని. 2001 తర్వాత అఫ్ఘాన్‌లో జడ్జి కావటం కూడా సులభమైంది.
ఒక్క పదివేల డాలర్లు కాదనుకుంటే చాలు, నేరుగా న్యాయపీఠం ఎక్కడం ఈజీ. ఆ తర్వాత నిందితుల నుంచి వసూళ్లు మొదలుపెట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవటం అక్కడ రివాజు. అఫ్ఘాన్‌లో మంచికో చెడుకో వరకట్నం లేదు. పిల్లను పెళ్లాడదల్చుకున్నవాడు ఎదురు కట్నం(అదే…కన్యాశుల్కం) ఇవ్వాలి. కలిగినవారింట కుర్రాళ్లకు చింతలేదు. అంతా తల్లిదండ్రులే చూసుకుంటారు. ‘మంచి సంబంధం’ కుదురుస్తారు. కానీ మెజారిటీ యువకులు పెళ్లాడాలంటే పైసలు సంపాదించుకోవాల్సిందే…తనకంటూ ఒక ఇల్లు సమకూర్చుకోవాల్సిందే.
అఫ్ఘానిస్తాన్ తరచుగా వార్తల్లో ఉంటుంది. ఆ వార్తలు ఎప్పుడూ విషాదకరమైనవే. ఆత్మాహుతి దాడులు, గెరిల్లా దాడులు, వైమానిక దాడులు ఇవే అఫ్ఘాన్‌ను పదే పదే ప్రపంచానికి గుర్తు చేస్తుంటాయి. కానీ అక్కడా ఒక సమాజం ఉంది. ఆ సమాజాన్ని నడిపించే నియమాలున్నాయి. వాటిని బేఖాతరుచేసేవారు, భయభక్తులతో పాటించేవారు…ఇలా ఉంటున్నందుకు పర్యవసానాలు అనుభవించేవారు కోకొల్లలు. ఇన్నాళ్లూ పాశ్చాత్య ప్రపంచంతో అంటకాగుతూ ఆ వచ్చిన డబ్బులతో పెళ్లిళ్లు చేసుకుని, ఇళ్లు కట్టుకుని కులాసాగా గడుపుతున్నవారికి, ఓ లెవెల్లో బతుకుతున్నవారికి ఇప్పుడు చిక్కొచ్చిపడింది.
అఫ్ఘాన్‌లో సాగించిన విధ్వంసం చాలనుకుందో, ఇక్కడ గెలుపు అసాధ్యమని తీర్మానించుకుందో…మొత్తానికి ‘ఉగ్రవాదంపై వెయ్యేళ్ల యుద్ధం’ శపథానికి తిలోదకాలిచ్చి అమెరికా అక్కడినుంచి నిష్క్రమించటం మొదలుపెట్టింది. సహచర దేశాలు కూడా దాని అడుగుజాడల్లో నడుస్తున్నాయి. పర్యవసానంగా తాలిబన్లు మున్ముందుకు చొచ్చుకువస్తున్నారు. వాళ్లు ఆల్రెడీ తమ పుట్టిల్లు కాందహార్ వచ్చేశారు. చడీ చప్పుడూ లేకుండా అమెరికా దళాలు ఖాళీ చేసిన బగ్రాం వైమానిక స్థావరం కూడా సొంతం చేసుకున్నారు. 85 శాతం భూభాగాన్ని అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక కాబూల్‌లో కుంభస్థలాన్ని కొట్టడం రోజుల్లో పని. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఏం చేస్తారో, ఏమవుతారో ఆయనే నిర్ణయించుకోవాలి. లేదా ఆయన వరకైనా అమెరికా పూచీ పడిందేమో తెలియదు.
రేపన్నరోజు అఫ్ఘాన్‌లో తాలిబన్ ఫత్వాలు రాజ్యమేలబోతున్నాయి. అక్కడ ఇన్నేళ్లుగా ఉద్యోగాలు చేసినవారికీ, ఊళ్లేలినవారికీ కష్టాలు ఖాయం. మహిళలు మళ్లీ క్లాసు రూములవైపు, కార్యాలయాలవైపు కన్నెత్తి చూసే అవకాశం ఉండకపోవచ్చు. గడపదాటి బయటికొస్తే ఫత్వా కాటేయొచ్చు. యధాప్రకారం తాను ఏపాపం ఎరగనట్టు, తాలిబన్లు నమ్మకద్రోహానికి పాల్పడినట్టు అమెరికా ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేస్తుంది. అఫ్ఘాన్ సమాజం మరోసారి ఉగ్రవాద పాలకుల చెరలో మౌనంగా రోదిస్తుంది. దాన్ని రికార్డు చేసే సాధనాలు, ప్రపంచానికి వెల్లడించే సాధనాలు బహుశా ఏమీ ఉండకపోవచ్చు.
అదే ఇప్పుడు యువతను వేధిస్తోంది. గతంలో తాము దుబాసీలుగా పనిచేసిన అమెరికన్ పౌరులకు ఫోన్ చేయటం, అమెరికా వచ్చేందుకు సాయం చేయాలని ప్రాథేయపడటం వారికి రివాజుగా మారింది. గతంలో అఫ్ఘాన్‌లో అనేక పనుల నిమిత్తం వెళ్లిన అమెరికన్లందరికీ ఇలాంటి వేడుకోళ్లే. వీరు వేలాదిమంది ఉంటారు. ఇలాంటివారిని కాపాడటం మన బాధ్యతంటూ అమెరికా పౌర సమాజం కూడా కోరస్ ఇచ్చింది. అందువల్లే కావొచ్చు… బైడెన్ సర్కారు ఆ బాపతువారిని అమెరికాకు తీసుకురావాలని తీర్మానించింది. ఈమధ్యే ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. ఇందుకోసం ప్రత్యేక వీసాలు కూడా మంజూరు కాబోతున్నాయి. కానైతే అలాంటివారు 16,000మందిని మాత్రమే ఆ దేశం గుర్తించింది.
వీరిలో అమెరికాకు, ఇతర పాశ్చాత్య దేశాలకూ సాయం చేసినవాళ్లున్నారు. కానీ ఈ లిస్టులో పాత్రికేయులకో, వ్యాపారవేత్తలకో సాయపడినవారు ఉండకపోవచ్చని చెబుతున్నారు. అదే కొందరికి నిద్ర పట్టనీయటం లేదు. ఇన్నాళ్లూ వీరి విరగబాటు చూసి, దర్జా చూసి అసూయ పెంచుకున్నవారు రేపు తాలిబన్లు రంగంలోకి దిగాక ఎటూ ఉప్పందిస్తారు. అప్పుడు వాళ్ల చేతుల్లో శిక్షలు ఖాయం. కాల్చి చంపేస్తారో, ‘న్యాయంగా’ విచారించి ఉరికొయ్యలకు వేళ్లాడగడతారో చెప్పలేం. కాఫిర్లకు సహకరించి, దైవద్రోహానికి పాల్పడ్డవారిని వదలబోమంటూ ఈ ఇరవైయ్యేళ్లుగా తాలిబన్లు అడపా దడపా చేస్తున్న హెచ్చరికలు తెలియనివారు లేరు.
అమెరికాలో గట్టిగా వాదించి, బైడెన్ సర్కారును ఒప్పించగలిగేవారుంటే సరేసరి. లేకుంటే గతంలో అమెరికన్లతో, ఇతర పాశ్చాత్య దేశాలవారితో సన్నిహితంగా మెలిగినవారికి, సాయపడినవారికి కష్టాలు ఖాయం.
-వీజీటీ రావు