తన రాజకీయాలకు సంబంధించి వస్తున్న పుకార్లకు శాశ్వతంగా చెక్ పెట్టారు రజనీకాంత్. పాలిటిక్స్ కు సంబంధించి పూర్తిగా తలుపులు మూసేశారు. తను స్థాపించిన మక్కల్ మండ్రం పార్టీని పూర్తిగా రద్దుచేశారు. తన పార్టీని ఇకపై అభిమానుల సంక్షేమం కోసం ఉపయోగిస్తానని ప్రకటించిన సూపర్ స్టార్.. ఆ మేరకు మక్కల్ మండ్రంను రజనీకాంత్ ఫ్యాన్స్ వెల్ఫేర్ మండ్రంగా మార్చేశారు.
తన పార్టీకి చెందిన ఆఫీస్ బేరర్లతో కొద్దిసేపటి కిందట సమావేశమయ్యారు రజనీకాంత్. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో రాజకీయాల్లోకి రానంటూ ప్రకటించిన రజనీకాంత్, మనసు మార్చుకున్నారని, మరోసారి రాజకీయ ప్రవేశంపై అనుకూలంగా ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.
కానీ అన్ని ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఏకంగా తన పొలిటికల్ పార్టీని రద్దు చేస్తున్నట్టు రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. పోయెస్ గార్డెన్ లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. ఇకపై తనకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
తను సాధారణ వైద్య పరీక్షల కోసం మాత్రమే అమెరికా వెళ్లానని ప్రకటించిన సూపర్ స్టార్, ఈ గ్యాప్ లో కరోనా వల్ల తన పార్టీ సభ్యుల్ని కలవలేకపోయానని వెల్లడించారు. తన పొలిటికల్ జర్నీకి సంబంధించి మండ్రం ఆఫీస్ బేరర్లకు చాలా సందేహాలున్నాయని, అందుకే ఈరోజు మీటింగ్ పెట్టానని క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్.. మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్టు విస్పష్టంగా ప్రకటించారు.
దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ ఎన్నోసార్లు ప్రకటించారు రజనీకాంత్. తన సినిమాల్లో కూడా పొలిటికల్ ఎంట్రీపై పరోక్షంగా చాలా డైలాగులు చెప్పారు. అందరి అంచనాలకు అనుగుణంగా రాజకీయ ప్రవేశం కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో, సరిగ్గా ఎన్నికలకు ముందు తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు గతేడాది డిసెంబర్ లో ప్రకటించారు.
అలా రాజకీయాలకు దూరమైన రజనీకాంత్, ఈరోజు ఏకంగా తన పార్టీని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, తన రాజకీయ జీవితానికి శాశ్వతంగా తెరదించారు.