ఆ నలుగురు: దయచేసి వాళ్లనేం అనొద్దు

రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలున్నాయి. వారు నిజంగానే పార్టీ మారారా? లేక చంద్రబాబు తరపున కోవర్డులుగా పార్టీలో చేరారా? కేసుల కోసం కాంప్రమైజ్ అయ్యారా? చంద్రబాబు…

రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలున్నాయి. వారు నిజంగానే పార్టీ మారారా? లేక చంద్రబాబు తరపున కోవర్డులుగా పార్టీలో చేరారా? కేసుల కోసం కాంప్రమైజ్ అయ్యారా? చంద్రబాబు కోసం తమ రాజకీయ జీవితాన్ని బలిచేసుకునేంత మూర్ఖులా? అన్న చర్చ జరుగుతోంది.

అయితే ఈ వ్యవహారంపై అనుమానాలు రేగడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి పార్టీ మారిన నేతలు టీడీపీని విమర్శించకపోవడం. రెండు పార్టీ మారిన నేతల్ని చంద్రబాబు పల్లెత్తుమాట అనకపోవడం. సహజంగా పార్టీ మారినవారు పాత పార్టీని పూర్తిస్థాయిలో దెప్పిపొడుస్తారు, కొత్త పార్టీతో వీలైనంతగా సఖ్యత కోసం ప్రయత్నిస్తారు. కానీ ఈ ఎపిసోడ్ లో అది ఎక్కడా జరగలేదు.

చంద్రబాబు తనకు రాజకీయ గురువని, ఏపీలో టీడీపీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు సుజనా చౌదరి. సీఎం రమేష్ కూడా అంతే. మిగతా ఇద్దరు కూడా ఎక్కడా టీడీపీని కానీ, బాబుని కానీ ఏమీ అనలేదు. కనీసం బీజేపీ ప్రాభవం కోసమైనా నోరు మెదపలేదు. రెండోది చంద్రబాబు వ్యవహార శైలి. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారతారన్న సమాచారం ఉండి కూడా ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. విషయం తెలిసిన తర్వాత కూడా పార్టీ ఫిరాయించిన వారిపై పల్లెత్తు మాట అనలేదు.

గతంలో టీడీపీ నుంచి బైటకెళ్లినవారి విషయంలో చంద్రబాబు ఎలా ప్రవర్తించిందీ అందరికీ తెలుసు. అదే సామాజిక వర్గానికి చెందినవారికి మైకిచ్చి అనరాని మాటలు అనిపించేవారు. ఇప్పుడు తానే స్వయంగా గోడదూకినవాళ్లను ఏమీ అనొద్దని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. అంత తట్టుకోలేకపోతే బీజేపీని తిట్టండి అంటూ ఉపదేశించారు. అందుకే పార్టీ మారినవారి కంటే.. బీజేపీపైనే ఎక్కువ ఫోకస్ చేశారు టీడీపీ నేతలు.

ఏదేమైనా.. టీడీపీ నుంచి పోయిన వలస పక్షులు అదను చూసి మళ్లీ తిరిగొస్తాయా లేక కాషాయంలో కలసిపోతాయా లేక బాబుకి కోవర్టులుగా అక్కడే ఉండిపోతాయా అనే విషయం వచ్చే ఎన్నికల నాటికి స్పష్టమవుతుంది.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'