తెలుగుదేశం నుంచి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యుల వెనుక రాజధాని భూముల దందా కూడా ఉందనేమాట వినిపిస్తూ ఉంది. రాజధాని భూములపై ఏపీ ప్రభుత్వం పూర్తి గుట్టు మట్లను బయటపెట్టే ఉద్దేశంతో ఉంది. రాజధాని ముందుగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారనే సమాచారంతో తెలుగుదేశం నేతలు పెద్దఎత్తున బినామీల ద్వారా భూముల కొనుగోలు చేయించారు. అలాంటి వారిలో ఈ ఫిరాయింపు ఎంపీలు కూడా ముందు వరసలో ఉన్నట్టుగా సమాచారం.
ఒకవైపు రాజకీయ అధికారానికి దూరంకావడం, ఇదే సమయంలో పాత వ్యవహారాలు అన్నీ బయటపడే అవకాశం ఉండటం.. ఇవన్నీ ఈ ఎంపీలకే కాదు, చంద్రబాబుకు కూడా ఇబ్బందికరమైన పరిణామాలే అని పరిశీలకులు అంటున్నారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి లాంటివాళ్లు దొరికిపోవడం ఒకటే, చంద్రబాబు స్వయంగా దొరకడం ఒకటే అనే ప్రచారం ప్రజల్లో కూడా ఉంది.
అందుకే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వీరిని బీజేపీలోకి పంపించి, సేఫ్ షెల్టర్ ఏర్పాటు చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నలుగురు ఫిరాయించడం వెనుక చంద్రబాబు నాయుడు స్కెచ్చే ఉందనే చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంది.
రాజధాని ప్రాంతంలో కొన్ని వందల ఎకరాల భూములు ఈ నలుగురూ కొన్నారని, ఇప్పుడు ఆ స్కామ్ లు అన్నీ బయటపడకుండా, బయటపడినా రాజకీయ శక్తితో వాటిని ఎదుర్కోవడానికి వీరు ఫిరాయించారనే ప్రచారమే ప్రజల మధ్యన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ల సుఖమే కోరుతోందని, కంప్లైంట్లు వగైరాలు కూడా ఉత్తుత్తివే అని ప్రజలు అనుకుంటున్నారు.