టీడీపీలో జోష్ తెచ్చే నాయకుడు దొరుకుతాడా ?

చంద్రబాబు గాని, వైఎస్ జగన్ గాని ఆనాడు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చినప్పుడు తమ పార్టీలు తెలంగాణలోనూ కొనసాగుతాయని అనుకున్నారు. తెలంగాణలోనూ తమ పార్టీలు మనుగడ సాగించాలంటే మద్దతు ఇవ్వడమే మంచిదని అనుకున్నారు. కానీ…

చంద్రబాబు గాని, వైఎస్ జగన్ గాని ఆనాడు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చినప్పుడు తమ పార్టీలు తెలంగాణలోనూ కొనసాగుతాయని అనుకున్నారు. తెలంగాణలోనూ తమ పార్టీలు మనుగడ సాగించాలంటే మద్దతు ఇవ్వడమే మంచిదని అనుకున్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగాక తమ పార్టీలు మనుగడలో లేకుండా పోతాయని ఆనాడు ఈ ఇద్దరు అధినేతలు ఊహించి ఉండరు. జగన్ పార్టీ తెలంగాణలో దుకాణం మూసేసింది. ఇక అది తెరుచుకోకపోవచ్చు.

కానీ టీడీపీ కథ వేరు. దానికో సంచలనాత్మకమైన చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. పరిపాలనలో సైతం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీకి రాష్ట్ర విభజనతో తెలంగాణలో గడ్డు కాలం దాపురించింది. ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో అక్కడా మనుగడ కష్టంగానే ఉంది.

సరే … ఆంధ్రా సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణను చూసుకోగల నాయకుడు కావాలి. అలాంటివాడికోసం బాబు అన్వేషణ సాగుతోంది. టీడీపీలో ముప్పై ఏళ్లపాటు కొనసాగిన ఎల్. రమణ ఇక టీడీపీతో లాభం లేదనుకున్నాడు. టీఆర్ఎస్ లో చేరిపోయాడు. ఈ ఆపరేషన్ చేసింది స్వయంగా కేసీఆరే. రమణ పాత మిత్రుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ బాధ్యత అప్పగించాడు. షరా మామూలుగా పార్టీలో చేరడానికి అనేక హామీలు ఇచ్చాడు. ఒక హామీ నెరవేర్చలేక పోయినా మరో హామీ నెరవేరుస్తానని చెప్పాడు కేసీఆర్.

మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని కూడా అన్నారు. ఈటల రాజేందర్ మీద పోటీ చేయాలని రమణకు ఆశగా ఉంది. ఆ విషయం కూడా కేసీఆర్ పరిశీలనలో ఉందట. మొత్తం మీద ఏదో ఒక పదవి దక్కడం ఖాయం. టీడీపీలో ఉండగా రమణ మంత్రిగా చేశాడు. ఎమ్మెల్యేగా చేశాడు. ఎంపీగా చేశాడు. ఆ పదవులు చేసి చాలా ఏళ్లైపోయింది. మళ్ళీ ఏదో ఒక పదవి చేయాలి. అందుకే టీఆర్ ఎస్ లో చేరాడు.

కొత్త అధ్యక్షుడి కోసం చంద్రబాబు ఉన్నవాళ్లతోనే మంతనాలు జరుపుతున్నారు. టీడీపీని పైకెత్తడం రమణ వల్ల కాలేదు. ఇక అధ్యక్షుడిగా రాబోయే నాయకుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంటుంది. పార్టీ కొంతలో కొంత ఉనికిని చాటుకోవలసి ఉంటుంది. ఈ మాత్రం చేయాలన్నా చాలా రిస్క్ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడున్న పార్టీనైనా కాపాడుకోవలసి ఉంటుంది. 

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఎన్నికల పరంగా ఘోరంగా విఫలమైనా ఆ పార్టీ అధ్యక్ష పదవికి క్రేజ్ ఉంది. పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నాయకులు ఎలా పోటీ పడ్డారో చూసాం. అధిష్టానం ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుందోగానీ చివరకు రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టింది. రేవంత్ వచ్చాక పార్టీలో జోష్ వచ్చింది. అలా జోష్ తెప్పించే నాయకుడు బాబుకు దొరుకుతాడా ? 

టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతున్న ఎల్‌.రమణను వ్యూహాత్మకంగా 2014లో తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు నియమించారు. టీఆర్‌ఎస్‌ హవా చూసి రమణ 2018లోనే కారెక్కేస్తున్నారని ప్రచారం జరిగినా పరిస్థితుల అనుకూలించక ఇన్నాళ్లు సైకిల్ తొక్కుకొచ్చారు. ఇక ఇప్పుడు తెలంగాణాలో సైకిల్ తొక్కలేక కారు ఎక్కాడు.

బాబు తెలంగాణాలో పార్టీని ముందుండి నడిపించే సేనాధిపతిని ఎన్నుకునే పనిలో పడ్డారు. కానీ అదంత తేలికైన పనేమీ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ టీడీపీ పార్టీలో ఉన్న పెద్ద,చిన్న నేతలందరూ వివిధ పార్టీల్లోకి జంప్ అయ్యారు. మిగిలిన చోటా మోటా నాయకులు కూడా పార్టీకి భవిష్యత్ ఉందా అనే అనుమానం నుండి లేదనే నమ్మకానికి వచ్చేశారు. అయినప్పటికీ చంద్రబాబు లైట్ తీసుకోకుండా పార్టీకి గత వైభవం తీసుకురావాలనే పట్టుదలతోనే ఉన్నారు.