ఎనభయ్యవ దశకం…ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజులు. ఆయన పార్టీ ప్రకటించిన వెంటనే కలిగిన జనస్పందన…హడావుడి..ప్రకంపనలు మాములుగా లేవు. ఎక్కడ చూసినా అదే ముచ్చట..అవే మాటలు..అవే పాటలు.
మళ్లీ పాతికేళ్ల తరువాత 2008. జనాలు అంతా టీవీలకు అతుక్కుపోయిన రోజు. తిరుపతి పట్టణం. జనం తప్ప నేల కనిపించని తరుణం. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తొలి ప్రకటన సభ.
అంతలోనే కేసిఆర్ తెరాస ప్రభంజనం. ఆయనదో విలక్షణ శైలి. అది అనితరసాధ్యం. సినిమాల్లో రవితేజకు స్వంతమైన వెటకారం మాదిరిగా కేసిఆర్ కు మాత్రమే చెల్లిన సెటైర్లు.
ఆ తరువాత మరి కొన్నేళ్లకు వైఎస్ జగన్ సందోహం. హైదారాబాద్ నగర వీధుల్లో, ఆంధ్ర ఊళ్లలో ఎక్కడ చూసినా జగన్ సభల జన సందడి.
అంతెందుకు..అన్న తరపున జగన్ వదిలిన బాణం మాదిరిగా షర్మిల బహిరంగ సభలకు కూడా జన ప్రవాహం.
ఆ తరువాత కొన్నాళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…హైదరాబాద్ హైటెక్స్ లో జనసేన ఆవిర్భావం. పదండి ముందుకు..పదండి తోసుకు అన్నట్లుగా జనం పరుగులెత్తారు. ఆ సందడే వేరు. ఆ సంచలనమే వేరు.
ఇక ప్రస్తుతం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ ప్రసంగాలు..తుపాకీ తూటాలే కదా.
కానీ ఇన్నాళ్ల తరువాత మళ్లీ ఓ కొత్త లోకల్ పార్టీ పురుడు పోసుకుంటే…అది కూడా…తొలిసారి ఓ తెలుగు ఆడపడుచు స్వంతంగా రాజకీయ పార్టీ పెడితే….ఏవీ సభా సౌరభాలు?
వైఎస్ షర్మిల, తల్లి, భర్త, పిల్లలతో సహా కొత్త పార్టీ ప్రకటన సభ ఏర్పాటు చేస్తే, ఏదీ ఆ సందడి? అస్సలు రక్తి కట్టిందా? ఎవరికైనా పట్టిందా? అస్సలు రంగు..రుచి..వాసన ఏమైనా తగిలిందా?
'నేను మూడు గంటల పాటు ప్రసంగిస్తా' అంటూ ప్రారంభించి వైఎస్ షర్మిల చేసిన ప్రసంగం లో ఒక్కటంటే ఒక్క చమక్కు దొర్లినట్లు అనిపించిందా? అసలు తొలి రాజకీయ బహిరంగ సభ అంటే ఎలా వుండాలి. ఆ ప్రసంగం అంటే ఎలా సాగాలి?
నిప్పులు చిమ్ముకుంటే నింగికి నేనెగిరిపోతే….అన్న రేంజ్ లో కదా వుండాలి? మరేంటీ షర్మిల ప్రసంగం అంత చప్పగా..నీరసంగా, నిస్సారంగా సాగింది? ఒక్క పలుకు కైనా జనంలోంచి ఉవ్వెత్తున స్పందన వచ్చిందా?
ఎన్టీఆర్..వైఎస్సార్..చిరంజీవి..కేసిఆర్..జగన్..పవన్..వీరందరి ఉపన్యాస ధోరణి గుర్తు తెచ్చుకుంటే ఒక్కొక్కరిది ఒక్కో విలక్షణ శైలి. కానీ షర్మిలకు ఏదీ ఆ ఠీవి? పోనీ ఆడకూతురు కదా అని అనుకుందాం అనుకుంటే మమత..జయలలిత..ఇలాంటి వాళ్లను గుర్తు తెచ్చుకుంటే మళ్లీ నిరాశే.
సరే వాచకం సరిగ్గా లేదు. స్వరం సరిపోలేదు అనుకుందాం..అలా సరిపెట్టుకుందాం..కానీ అందులో విషయం కూడా అలాగే వుంది కదా? చప్పటి కూడు మాదిరిగా. కారాలు..మిరియాలు లేకుండా..ఏదో కవిసమ్మేళనంలో మాదిరిగా అక్కడక్కడ చెప్పిన డైలాగు మరోసారి చెబుతూ..పొయిటిగా మాట్లాడుతున్నట్లు, ఇదే తను అలవరుచుకున్న, అలవాటు చేసుకోబోతున్న శైలి అన్నట్లు.
రాజకీయ ప్రసంగం అంటే పక్కా మాస్ మసాలా సినిమా. కామన్ మాన్ ఊగిపోవాల్సిందే..విజిల్ వేయాల్సిందే. కానీ షర్మిల ప్రసంగం సినిమా మరీ అవార్డు కోసం తీసిన ఆఫ్ బీట్ సినిమా మాదిరిగా సాగిందే.
పార్టీ పెట్టిన తరువాత షర్మిల నివాసానికి నాయకులు బార్లు తీరతారేమో అనుకుంటే ప్రసంగంలోనే పస తేలిపోయినట్లయిపోయింది. సర్రున నేలకు రాలిపోయినట్లయింది. అటు సెటైర్ల మీద సెటైర్లు వేసే కేసిఆర్..ఇటు నిప్పులు చిమ్మే రేవంత్ రెడ్డి..వీరి నడుమ చప్పగా సాగే షర్మిల ప్రసంగం..ఇలా అయితే ఎలా? ఏదో చేయాలి? మారాలి? ప్రసంగం తయారుచేసేవాళ్లు…జనం ముందు చదివే తీరు కూడా.
కొసమెరుపు ఏమిటంటే, ఏ నాయకుడు రాజకీయ పార్టీ పెట్టినా, సభ పెట్టినా పెళ్లాం పిల్లలు, కుటుంబీకులు ముందు వరుసలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా తిలకించిన దాఖలాలు లేవు. కానీ షర్మిల సభ ఈ విషయంలో కొత్త పుంతలు తొక్కింది. ఫ్రంట్ లైన్ లో తల్లి, భర్త, పిల్లలు ఆసీనులై ఆమె ప్రసంగాన్ని ఆలకించారు. వారు కూడా పెద్దగా రసస్పందన కనబర్చుకుండానే
ఆర్వీ