ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కడపలో రెండో బొంబాయిగా, బంగారు పట్టణంగా పేరొందిన అసెంబ్లీ నియోజక వర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వైరం స్టార్ట్ అయ్యింది. బంగారు వ్యాపారానికి కడప జిల్లాలో ఆ పట్టణం ప్రసిద్ధి. ఇటీవల గవర్నర్ కోటాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన రమేశ్‌యాదవ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. అయితే సదరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి తెలియకుండానే ఎమ్మెల్సీ పదవి రావడంతో జీర్ణించుకోలేకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరో వైపు ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌కు ముఖ్యమంత్రి గట్టి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. కడప జిల్లా అంతా తిరుగుతూ పార్టీని బలోపేతం చేయాలని సీఎం సూచించినట్టు సమాచారం. అలాగే కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో టచ్‌లో ఉంటూ బీసీల్లో వైసీపీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని రమేశ్‌కు సీఎం సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక ఎస్ఐ విషయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ పరిణామాలపై బంగారు పట్టణంలో హాట్‌హాట్ చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీగా రమేశ్‌యాదవ్ ప్రమాణ స్వీకారం అనంతరం కడప జిల్లాలోని తన స్వస్థలమైన పట్టణానికి వెళ్లాలనుకున్నారు. పట్టణం వెలుపల నుంచి ఆయన్ను ఊరేగిస్తూ తీసుకురావాలని రమేశ్‌యాదవ్ అభిమానులు నిర్ణయించుకున్నారు. అయితే ఈ ర్యాలీలో వైసీపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదు. దీనికి కారణం ఎమ్మెల్యే ఆదేశాలే అని తెలుస్తోంది. అయితే పోలీసులతో ఎమ్మెల్సీ ర్యాలీని అడ్డుకోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యే ప్లాన్ వేశారని రమేశ్‌యాదవ్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీ రూరల్, ఒన్‌టౌన్, టూటౌన్ పోలీసుస్టేషన్ల మీదుగా ఎమ్మెల్సీ నివాసానికి చేరింది.
కోవిడ్ సాకు చూపి ర్యాలీలో పాల్గొంటే అంతు చూస్తామని హెచ్చరించి భయాందోళనకు గురి చేసిన రూరల్ ఎస్ఐ తమ అనుచరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని కడప ఎంపీ దృష్టికి ఎమ్మెల్సీ తీసుకెళ్లారు. సొంత పార్టీ ఎమ్మెల్సీని అవమానించడంతో సదరు ఎస్ఐని వారం క్రితం బదిలీ చేయించారు. రూరల్ స్టేషన్‌కు ఒన్‌టౌన్ ఎస్ఐని బదిలీ చేశారు. అప్పటికి రూరల్ ఎస్ఐ ఆ పోస్టులోకి వచ్చి కేవలం నెల రోజులు మాత్రమే కావడం గమనార్హం.
తన అధికారిగా గుర్తింపు పొందిన సదరు ఎస్ఐని కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ ట్రాన్స్ఫర్ చేయించడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఎలాగైనా ఖాళీగా ఉన్న ఒన్‌టౌన్ స్టేషన్‌కు సదరు ఎస్ఐని బదిలీ చేయించి, తన పట్టు నిరూపించుకోవాలని ఎమ్మెల్యే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అలాగే తన పలుకుబడి ఏంటో ఎమ్మెల్సీకి రుచి చూపాలనే ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉన్నారు.
అలాగే ఇటీవల ఎమ్మెల్సీకి బెదిరింపు కాల్స్ రావడం వెనుక కూడా సదరు ఎమ్మెల్యే ఉన్నారనే ఆరోపణలు కూడా… వాళ్లిద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయనేందుకు ఉదాహరణగా పట్టణ వాసులు చెబుతున్నారు. ఆ బంగారు పట్టణంలో బీసీల సంఖ్య గణనీయంగా ఉండడం, అలాగే ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌ను సీఎంతో పాటు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రోత్సహించడం వెనుక భవిష్యత్ ముందు చూపు ఏదో ఉందనే గుసగుసలు సెకెండ్ బాంబేలో బలంగా వినిపిస్తున్నాయి.