ఆమధ్య తిరుపతి ఉప ఎన్నికల వేళ అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించి హడావిడి చేసిన చంద్రబాబు, 2024 ఎన్నికలకు కూడా అదే ఫార్ములాని ఫాలో అవ్వాలనుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం లోకేష్ కి ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చినబాబుకి మంగళగిరి అనే పేరు అచ్చిరాలేదు, ఆ నియోజకవర్గమూ అచ్చిరాలేదు.
అర్జంటుగా ఆయనకి కొత్త నియోజకవర్గం వెదకాలి. కుప్పం ఇస్తామంటే, స్థానిక ఎన్నికల టైమ్ కే అక్కడ కూసాలు కదిలాయనే భయం ఉంది. హిందూపురం బాలయ్య కుదరదు పొమ్మంటున్నాడు. చినబాబుకి సేఫెస్ట్ ప్లేస్ ఏంటనేదానిపై పీకే టీమ్ కంటే పెద్ద టీమ్ తో రీసెర్చ్ జరుగుతోందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఎన్నికలకు బాగా ముందుగానే నియోజకవర్గాల ఇన్ చార్జిలలో మార్పులు చేర్పులు చేసి, వారికే అసెంబ్లీ టికెట్లు కూడా ఇస్తామని భరోసా కల్పించాలని అనుకుంటున్నారు చంద్రబాబు. అయితే లోకేష్ దగ్గరికి వచ్చేసరికి వ్యవహారం తేడా కొడుతోంది. చినబాబు కోసం ఎవరో ఒకరు త్యాగం చేయాలి. అలా స్థానిక నాయకులతో త్యాగం చేయించి, అక్కడికి కొడుకుని పంపిస్తే, ఇప్పటినుంచే అసంతృప్తి పెరిగిపోతుందనే భయం చంద్రబాబుది. వైసీపీకి కూడా అక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది.
పోనీ లోకేష్ ని పక్కనపెట్టి మిగతావారి విషయంలో స్పీడ్ గా ఉందామా అనుకుంటే.. వైసీపీ సెటైర్లు తట్టుకోలేరు. నేరుగా గెలిచే దమ్ములేక, మరోసారి దొడ్డిదారి కోసం లోకేష్ వెదుక్కుంటున్నారని, కనీసం సొంత నియోజకవర్గం కూడా లేని భావి నాయకుడు లోకేష్ అంటూ ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తారు వైసీపీ నేతలు. అంటే అది కూడా కష్టమే. అందుకే చంద్రబాబు లోకేష్ నియోజకవర్గం విషయంలో కాస్త నిదానంగా ఉన్నారు.
ఏ వారసులకూ లేని దౌర్భాగ్యం లోకేష్ ది..
దేశ రాజకీయాల్లో ఓ వారసుడు, వారసురాలు కానీ ఇలా దొడ్డిదారిన మంత్రి పదవులు కొట్టేయలేదు. తొలిసారి డైరెక్ట్ గా బరిలో దిగి తమ సత్తా చాటుకున్నారు, అలాంటివారే ఇప్పుడు నిలబడ్డారు. కానీ లోకేష్ పరిస్థితి వేరు. ఆయనకు డైరెక్ట్ ఎన్నికల్లో నిలబడే సత్తా లేదు. దొడ్డిదారిన చట్టసభలకు పంపే అవకాశమూ ఇప్పుడు టీడీపీకి లేదు. అంటే కచ్చితంగా 2024 ఎన్నికలనాటికి లోకేష్ నియోజకవర్గం వెదుక్కోవాల్సిందే.
గెలుపు సంగతి పక్కనపెడితే, ముందు వెదుకులాటతోనే సగం కాలం గడచిపోయింది. తిరుపతి ఫార్ములా అయినా, ఇంకేదైనా ఫార్ములా అయినా సరే.. చంద్రబాబు ముందుగా నియోజకవర్గాన్ని ప్రకటిస్తే మాత్రం లోకేష్ కి మూడినట్టే. పనిగట్టుకు మరీ కొడాలి నాని వంటి నేతలు ఆ నియోజకవర్గం వెళ్లి లోకేష్ ని ఓడించి వస్తారు. అదే ఇప్పుడు పెదబాబు, చినబాబు భయం.