ఉద్యోగాల భర్తీ.. కేసీఆర్ Vs జగన్

ఏపీ, తెలంగాణ విభజన తర్వాత సహజంగానే రెండు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ మొదలవుతుందని నిరుద్యోగులు ఆశపడ్డారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అంటూ ఉద్యమం చేపట్టిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల విషయాన్ని మాత్రం…

ఏపీ, తెలంగాణ విభజన తర్వాత సహజంగానే రెండు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ మొదలవుతుందని నిరుద్యోగులు ఆశపడ్డారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అంటూ ఉద్యమం చేపట్టిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. 

ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం అన్న నోటితో, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉద్యోగం అన్నారు, ఆ తర్వాత ఒక్కొక్కరికీ ఒక్కో ఉద్యోగం ఎలా ఇస్తామనేదాకా వచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అంటేనే అదో పెద్ద సెన్సేషన్ అయిందంటే అప్పటి వరకూ ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఏపీ విషయానికొస్తే.. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ చంద్రబాబు ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచారు కానీ, ఉద్యోగుల సంఖ్యను పెంచలేదు. బాబు వస్తే జాబు వస్తుందంటూ ఊదరగొట్టి హ్యాండిచ్చారు. నిరుద్యోగ భృతిని కూడా ఎన్నికల తాయిలంలా ప్రకటించి అందరి ఆశలనపై నీల్లు చల్లారు. 

తన కొడుక్కి మంత్రి పదవి ఇప్పించుకోవడంపై ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలో ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో చూపలేదు బాబు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం వచ్చీ రాగానే సచివాలయాల పేరుతో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశారు. అసలు జగన్ ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇస్తారని, ఇవ్వగలరని, ఇలా కూడా ఇవ్వొచ్చని ఎవరూ ఊహించలేదు.

ఊహలకందని పని చేసిన జగనే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ తో ఇరుకున పడిన పరిస్థితి. ఏపీపీఎస్సీ భర్తి చేసేవే ఉద్యోగాలు, డీఎస్సీ వేస్తేనే ఆ ముఖ్యమంత్రి దమ్మున్నోడు అనుకునే పాతకాలపు రోజులు కావివి. సచివాలయాల పోస్ట్ లు ఉద్యోగాలు కాదా, ఎక్కడికక్కడ నిరుద్యోగులు తమ జిల్లాలలోనే పోస్టులు సంపాదించి, ఉద్యోగాలు చేసుకునే అవకాశం జగన్ ఇచ్చారు కదా. మరి దీన్ని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తే ఎలా. పోనీ ప్రతిపక్షాలకు బుద్ధిలేదు, వారి మాయలో పడి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇదే బాటపట్టారు.

సీఎంలు ఇద్దరికీ తలనొప్పులు

అప్పటి వరకూ ఆంధ్రావాళ్లు మన ఉద్యోగాల్లో తిష్టవేశారు, తెలంగాణ వేరు పడితే.. ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని చెప్పిన కేసీఆర్ ఆ స్థాయిలో ఉద్యోగాలివ్వలేక విమర్శలపాలయ్యారు. అయితే జగన్ పరిస్థితి వేరు. అడిగిన వాటి కంటే ఎక్కువగా ఉద్యోగాలిచ్చి ఇబ్బందులపాలవుతున్నారు జగన్. సచివాలయ పోస్టుల్నే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే అప్పుడు అందరూ సైలెంట్ గా ఉండేవారేమో.

తెలంగాణలో 50వేలు ఉద్యోగాలు భర్తీచేస్తామంటే విపక్షాలు ఒప్పుకోవడం లేదు, లక్ష ఉద్యోగాలు కావాలంటున్నాయి. నిరుద్యోగులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు ఇటు ఏపీలో జగన్ కు కూడా సేమ్ టు సేమ్ అవే చిక్కులు. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రిలీజ్ చేసినా.. అసంతృప్తి సెగలు మాత్రం తప్పడంలేదు. ఉద్యోగాలివ్వలేని కేసీఆర్ కీ, ఉద్యోగాలిచ్చిన జగన్ కీ తేడా లేకపోవడమే విచిత్రం.