ఈ వారంలో తెలంగాణలో యిద్దరు కొత్త యోధులు తెర మీదకు వచ్చారు. ఎప్పటినుంచో వున్న కాంగ్రెసు పార్టీకి రాష్ట్రస్థాయిలో నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాగా, వైయస్సార్‌టి (తెలంగాణ) పార్టీని స్థాపించి షర్మిల ముందుకు వచ్చారు. ఇద్దరూ యథావిధిగా కెసియార్‌పై విరుచుకు పడ్డారు. తమ తడాఖా చూపిస్తామన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం తామే అని ప్రజలు గుర్తించాలని యిద్దరి ఆకాంక్ష. రేవంత్ చాలా ఏళ్లగా రాజకీయాల్లో నలుగుతున్న వ్యక్తి.
షర్మిలకు రాజకీయాలు కొత్త. తండ్రి, సోదరుడు, బాబాయి అందరూ రాజకీయాల్లో వున్నారు. తల్లి రాజకీయాల్లో వున్నా చురుకుగా లేరు. ఎవరో చెప్పినట్లు చేయడమే తప్ప, విజయమ్మ గారికి సొంతంగా ఆలోచనలున్నాయో లేదో తెలియదు. షర్మిల కూడా గతంలో అన్న తరఫున ప్రచారం చేసినా, స్వయం ప్రతిపత్తి వున్న రాజకీయవేత్త కాదు. అలుపెరుగని పాదయాత్రికురాలిగానే జనాలకు గుర్తు. ఆమె కంటూ ప్రత్యేకమైన సిద్ధాంతాలూ, విధానాలూ ఏమైనా వుంటే ప్రజలకు యిప్పటిదాకా పరిచయం కాలేదు. రేవంత్, షర్మిలలు తెలంగాణ రాజకీయాల్లో తెచ్చే మార్పును ఊహించడమే యీ వ్యాసలక్ష్యం.
ముందుగా రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా ఆ పదవిలో వున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటె ఏడేళ్లు చిన్నవాడు. ఉత్సాహవంతుడు, ఉద్యమకారుడు, పోరాటాలలో ఆరితేరినవాడు, నాలుగు పార్టీలూ చూసినవాడు, విషయం వున్నవాడు, దేని గురించైనా సబ్జక్ట్ తెలిసి, వివరాలతో సహా, ఆకర్షణీయంగా చెప్పగలిగినవాడు. 2019లో దేశంలో మోదీ హవా నడుస్తున్న రోజుల్లో కూడా తెలంగాణలో గెలిచిన ముగ్గురు కాంగ్రెసు ఎంపీలలో ఒకడు. అదీ, తనకు సంబంధించని మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి! తెలంగాణలో రాజకీయంగా బలంగా వుండి, అధికారం కోసం వెలమలతో పోటీ పడే రెడ్డి కులానికి చెందినవాడు. ఉద్యమప్రారంభం నుంచి తెరాసకు బలమైన స్థావరంగా ఉత్తర తెలంగాణ ఉండగా యితను దక్షిణ తెలంగాణకు చెందినవాడు.
అన్నిటికన్న ముఖ్యంగా కెసియార్‌కు కన్నెర్రగా వున్నవాడు. కటువుగా విమర్శించడంలో దూకుడు చూపుతాడు. ఇతని పేరు చెప్తేనే కెసియార్‌కు అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఏ పార్టీకి చెందిన ఏ నాయకుణ్నయినా తెరాసలో చేర్చుకోవచ్చు కానీ రేవంత్‌ను మాత్రం ఛస్తే చేర్చుకోడనే మాట వినబడుతూంటుంది. కెసియార్ చేతిలో దెబ్బ తిన్న నాయకులు, తెరాసకు బుద్ధి చెప్పాలనుకున్న ఓటర్లు రేవంత్ కేసి ఆశగా చూస్తారు. ఎందుకంటే కెసియార్ పాలనతో విసిగిన ప్రజలు తెరాసకు వ్యతిరేకంగా కాంగ్రెసు, టిడిపిలకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్లు అధికార పార్టీలోకి దూరిపోతున్నారు. కాంగ్రెసులో కొంతమందైనా మిగిలారు కానీ టిడిపి అయితే అదీ లేదు. మొత్తం ఫిరాయించేశారు. బిజెపి నాయకులు మాత్రమే అలా చేయటం లేదు. అందువలన యిటీవల తెరాస వ్యతిరేక ఓట్లన్నీ బిజెపికి పడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ అయితే తెరాసలో చేరడని గట్టిగా నమ్మవచ్చు.
అయితే రేవంత్ ఒక్కడూ పార్టీ మారకుండా వుంటే సరిపోయిందా? అతను గెలిపించిన నాయకులు కూడా పార్టీకి విధేయంగా వుండాలి కదా! ఉంటారా? నిజానికి తెలంగాణలో కాంగ్రెసుకు సాంప్రదాయికంగా పడే ఓట్లు పడుతూ వచ్చాయి. కానీ ఫిరాయింపుల కారణంగా క్రమేపీ పడడం మానేశాయి. రేవంత్ వాటిని ఆపగలిగితే చాలు, కాంగ్రెసుకు మళ్లీ ఓట్లు పడతాయి. ఆపగలడా అనేది ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెసు ఇప్పుడిప్పుడే అధికారంలోకి రాదని అందరికీ తెలుసు. కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా, తెరాసను నిరోధించగల ఒక బలమైన శక్తిగా, తెరాస చేత నష్టపోయినవారికి ఆశ్రయం యివ్వగలిగిన పార్టీగా వుంటే చాలు. ఈ విషయం తెలుసు కాబట్టే రేవంత్ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చాలా ఘాటుగా మాట్లాడాడు. అనేక పార్టీలు మారిన రేవంత్ ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టమని పిలుపు నివ్వడం వింతగా వుంది.
కాంగ్రెసుకి ముందు నుంచి వున్న సమస్య బహునాయకత్వం. వెంట ఒక ఎమ్మెల్యే నైనా ఉన్నా లేకపోయినా ప్రతివాడికీ పదవి కావాలి. ప్రజల్లోకి వెళ్లి ఆందోళన చేయడానికి ఎవరూ సిద్ధపడరు. పోనీ జేబులోంచి డబ్బు తీసి తమ పార్టీకి అనుకూల ప్రచారం చేయించుకోవడానికీ కష్టపడరు. మీడియాలో పార్టీ గురించి వ్యతిరేక ప్రచారం వస్తూనే వుంటుంది. నాయకులు ఒకరినొకరు ఖండించుకుంటూనే వుంటారు. ప్రజలకు పార్టీమీద నమ్మకం సడలిపోతోందని నాయకులకూ తెలుసు. అయినా తమ వ్యతిరేక కార్యకలాపాలను ఎవరూ ఆపుకోరు. మళ్లీ అదే పార్టీకి అధ్యక్షుడు కావాలనీ, తాము చెప్పినవారికి టిక్కెట్లు యివ్వాలని సిగపట్లకు దిగుతారు. ఎవరి పేరైనా కాస్త ముందుకు వెళుతోందంటే వాళ్లను వెనక్కి గుంజేవరకూ నిద్రపోరు.
ముసలివాళ్లు పక్కకు తప్పుకోరు. ఏమైనా అంటే అనుభవజ్ఞులమంటారు. ఈ అనుభవంతో కౌన్సిలరుగానైనా గెలవగలవా అంటే చెప్పలేరు. అమ్మ దయ వుంటే పైనుంచి నిధులు వచ్చి గెలుస్తా అంటారు. ఓడిపోతే సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచారని నింద వేసి వూరుకుంటారు. ప్రజల సమస్యలను హైలైట్ చేసి ఉద్యమాలు చేసి, ఏదో ఒక హడావుడి చేస్తే తప్ప పార్టీ వుందో లేదో ప్రజలకు తెలియని యీ రోజుల్లో వీళ్ల లాటి బద్ధకస్తుల వలన పార్టీ ఉనికి ప్రశ్నార్థకమై పోయింది. వీళ్లంతా ఒక్క తాటిపైకి వచ్చి రేవంత్‌కు పేరు తెచ్చేస్తారా, అతన్ని గద్దె వైపు నడిపిస్తారా అనేది పెద్ద ప్రశ్న.
పార్టీ లోపల కానీ, బయట కానీ రేవంత్‌ను అందరూ వేలెత్తి చూపించే అంశం – ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో ప్రత్యక్షంగా వీడియోలో దొరికిపోవడం. అది పెద్ద మైనస్ పాయింటు. కానీ ప్రజలందరికీ తెలుసు. అతను ఏజంటే కానీ ప్రిన్సిపల్ కాదు. ఆ ఎమ్మెల్సీ సీటు గెలిస్తే లాభపడేది అతను కాదు. స్టీఫెన్‌సన్ తన ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా వున్నాడని (అది ఒక ట్రాప్ అని తెలియక) నమ్మి, పార్టీ అధినేతను నమ్మించి తక్కినవారి కంటె రేవంత్ ఎక్కువ చొరవ చూపి వుండవచ్చు.
కానీ ఓ సీటు కోసం అలాటి దిక్కుమాలిన పని చేయాలా లేదా అన్నది పార్టీ అధినేత నిర్ణయమే. దాన్ని అమలు చేసిన విశ్వాసపాత్రుడైన సేనాపతి, పార్టీ అధినాయకుడు డబ్బు పంపగా యివ్వడానికి వెళ్లిన కొరియర్ రేవంత్. అందుకే బాబు అతన్ని బహిరంగంగా ఏమీ అనలేదు. ఈ వ్యవహారంలో అసలు దోషి బాబు. అయితే కెసియార్, బాబు లాలూచీ పడి కేసును నీరు కార్చారు. అది బలంగా వుండి వుంటే నేరానికి సహకరించినవాడిగా రేవంత్‌కు శిక్ష పడేది. దాన్ని నానుస్తున్నారు కాబట్టి ‘ఆ విషయం సబ్‌జ్యుడిస్’ అని చెప్పుకుంటూ తిరిగే అవకాశం రేవంత్‌కు కలిగింది.
ఆ సంఘటన తర్వాత రేవంత్‌కు, బాబుకు సత్సంబంధాలు బెసకలేదు. రేవంత్‌కు కోపం వచ్చి, తన పేరు బయటపెట్టేసే పక్షంలో తనను ఏ కెసియారూ రక్షించలేడని బాబుకి తెలుసు. అందువలన రేవంత్‌ను బుజ్జగిస్తూనే వున్నారు. అతను పార్టీ విడిచి వెళ్లినపుడు కూడా టిడిపి నాయకులు నిప్పులు చెరగలేదు. బలం క్షీణించిన మన టిడిపిలో మగ్గడం కంటె మన మనిషిగా కాంగ్రెసులో వుంటూ అవసరమైనప్పుడు సాయపడితే బెటరు అనుకుని బాబు దగ్గరుండి అటు పంపించారని పలువురి నమ్మకం. బయటకు వచ్చేశాక కూడా రేవంత్ టిడిపిని కానీ, టిడిపి రేవంత్‌ను కానీ ఒక్క మాట అనలేదు. కాంగ్రెసు ద్వారా రేవంత్ ప్రముఖుడైతే తన, తన పార్టీ అనుయాయుల ప్రయోజనాలను కాపాడగలడని బాబు ఆశ కాబోలు.
హైదరాబాదులోని తన ఆస్తుల కోసం జగన్ కెసియార్‌తో రాజీ పడుతున్నాడని టిడిపి వాళ్లు అంటూంటారు. టిడిపి నాయకుల, ఆప్తుల ఆస్తులతో పోలిస్తే జగన్ ఆస్తి లెక్కలోకే రాదు. వాటి కోసమే కాబోలు బాబు, లోకేశ్ కెసియార్‌ను ఏమీ అనరు. తాము వుండే వూళ్లో కరోనా కట్టడి సవ్యంగా జరగకపోయినా యీ జాతీయ నాయకులు నోరు విప్పరు. తెలంగాణలో అధికారంలో వుండే నాయకుడు తమ ఆస్తుల జోలికి రాకుండా వుండడమే ఆంధ్ర నాయకులందరికీ కావలసినది. కెసియార్‌ను నమ్మడానికి లేదు. ఎప్పుడైనా ప్లేటు ఫిరాయించవచ్చు. కక్ష సాధింపులో ఎంతకైనా వెళ్లవచ్చు. తనవాడనుకున్న రేవంత్ కాంగ్రెసు దళపతి అయితే బాబుకి అంతకంటె కావలసినదేముంది? నామమాత్రంగా మిగిలిన తన పార్టీ కార్యకర్తలను అతనికి అప్పగించేయవచ్చు.
ఒకప్పుడు తెలంగాణలో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు వుండేది. ఊరూరా క్యాడర్ వుండేది. తెలంగాణలోని, ముఖ్యంగా జంటనగరాలలోని ఆంధ్రమూలాల వారందరూ టిడిపిని నమ్ముకున్నారు. ఈ రోజు కెసియార్ తమపై ద్వేషం చిమ్మకపోవచ్చు. కానీ జలవివాదమో, మరోటో వస్తే చాలు, ఆంధ్రులను తిట్ట నారంభిస్తారు. ఆంధ్ర మూలాలున్న జడ్జి కేసు విచారించకూడదంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్ చేసిన వాదన చూడండి. ఈ ప్రాంతీయవాదం యిస్తోకును తెరాస ఎప్పటికీ జారవిడుచుకోదు. ఆంధ్రమూలాల వాళ్లు రాజకీయాల్లో ఎదుగుతూంటే తెలంగాణ నాయకులందరూ ఆ అంశాన్ని లేవనెత్తుతూంటారు. ఎన్నికల వేళ రెచ్చిపోతారు.
కెసియార్ కుటుంబానికి ఆప్తులైన కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు అన్నీ సవ్యంగానే వుండవచ్చు కానీ సాధారణ ప్రజలు, యితర రంగాల్లో వున్నవాళ్లు ఒక స్థాయికి మించి ఎదగలేరు. అందువలననే వాళ్లు తమ బాగోగులు చూడడానికి టిడిపి తెలంగాణలో వుంటుందనుకున్నారు. హైదరాబాదులో కనీసం పదేళ్ల పాటు వుండి తమ ప్రయోజనాలను రక్షిస్తుందనుకున్నారు. కానీ టిడిపి పారిపోయింది. టిడిపితో జత కట్టి 2004లో హైదరాబాదులో కొన్ని సీట్లు గెలుచుకున్న బిజెపి కూడా వీర తెలంగాణవాదాన్ని వినిపిస్తోంది తప్ప ఆంధ్రమూలాల వారిని అక్కున చేర్చుకోవటం లేదు. ఏమైనా వస్తే ఆంధ్రులను తిట్టడంలో తెరాస కంటె ముందుంటోంది.
తనకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన ఆంధ్రమూలాల వాళ్లు రేవంత్ వైపు మళ్లడానికి అనువుగా బాబు తన క్యాడర్‌కు ఆదేశాలివ్వవచ్చు. రేవంత్ కూడా వీర తెలంగాణవాదిగా గతంలో ఆంధ్రులపై అవాకులు, చెవాకులు మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇతర పార్టీలవాళ్లందరినీ కాదని, తెలంగాణ వాదులందరూ కెసియార్‌నే ఎంచుకోవడంతో, రేవంత్ తన స్టాండ్‌ను మెత్తబరుచుకుని, మాజీ టిడిపి ఓటర్లను, ఆంధ్రమూలాల వారిని ఆకట్టుకోవడానికి చూడవచ్చు. ఎందుకంటే వారిది బలమైన ఓటు బ్యాంకు. కాంగ్రెసుకు సహజంగా వున్న బలానికి, వీరి బలం తోడైతే విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇవాళ కెటియార్ కూడా ఆ భయాన్నే వ్యక్తం చేశారు. టిడిపి, కాంగ్రెసు ఏకమవుతున్నాయని అనేశారు. రేవంత్ కాంగ్రెసు అధ్యక్షుడు కావడంతోనే బాబు తన టిడిపి పడవను ముంచేయదలచుకున్నారని గ్రహించే కాబోలు రమణ తెరాస వైపు చూశారు. పార్టీ ఫిరాయించనని మొన్ననే చెప్పినా, ఫిరాయింపు తప్పదని యివాళ్టి పేపరు చెప్తోంది.
కెసియార్‌కు తాము ప్రత్యామ్నాయం అని బిజెపి ఎంత చెప్పుకున్నా, కేంద్ర విధానాలు రాష్ట్రంలో దాని ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయి. మన రాష్ట్రానికి ఏం చేశారో చెప్పమనండి? అంటే స్థానిక బిజెపి నాయకుల వద్ద సమాధానం లేదు. ఎంతసేపూ ‘వీళ్లు సరిగ్గా అడగలేదు’ అనేసి తప్పించుకుంటున్నారు. వాటా ప్రకారం రావలసినదానికి కూడా అడుక్కోవలసిన అవసరం ఏముంది? పోనీ మీరడక్కపోయినా, మేం అడిగి తెస్తాం అంటూ తెలంగాణ బిజెపి నాయకులు రాష్ట్రానికి నిధులు తెప్పించి, కాలరు ఎగరేయవచ్చు కదా! ఈటల చేరినంత మాత్రాన పార్టీ బలపడిపోదు. ఈటల మొన్నటిదాకా కెసియార్‌తో అంటకాగినవాడే. అతనికి విధేయుడైన, సమర్థుడైన సైనికుడు అంతే. సొంత వ్యక్తిత్వాన్ని ఎక్కడా చాటుకోలేదు.
తన కంటూ సొంత భావాలున్నా ఆర్థికమంత్రిగా, ఆరోగ్యమంత్రిగా కెసియార్ చెప్పినట్లే నడుచుకున్నాడు కదా. ఎప్పుడైనా ఎదిరించాడా? రాష్ట్రంలో కరోనా నిర్వహణ అస్తవ్యస్తంగా వుండడానికి కెసియార్‌తో పాటు ఈటల కూడా కారకుడు కాదా? ప్రజారోగ్యం దెబ్బ తింటున్నపుడు, మరణాల సంఖ్య నానాటికి పెరుగుతున్నపుడు తిరగబడలేదే! తన ఆస్తులకు ముప్పు వచ్చేసరికే మాత్రమే ఎదురు తిరిగాడు. ఇప్పుడు ముదిరాజ్ బిడ్డను అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. నువ్వు ముదిరాజ్ అయితే నీ కొడుకు పేరు చివర రెడ్డి ఎలా వచ్చింది అని అడిగితే, ‘నా భార్య రెడ్డి, నేను ఆ తోక లేకుండానే పేరు పెడితే ఆమె తగిలించింది.’ అంటాడు ఈటల. ఆమె కులంపై ఆమె కున్న గర్వం నీ కులం పట్ల నీకు లేదు. మంచిదే. ఇప్పుడు మాత్రం కులం పేరు చెప్పి కాలరెగరేయడం దేనికి? ఈటల మహా అయితే తన నియోజకవర్గం గెలుచుకోగలడేమో కానీ జిల్లానైనా ప్రభావితం చేయలేడు. తన కంటూ వర్గం లేదు. అతనిపై పడిన వేటుకి వ్యతిరేకంగా ఎవరూ తిరగబడలేదు చూడండి. అన్యాయమని కూడా ఎత్తి చూపలేదు.
కెసియార్ పాలన బాగా లేదు. హైదరాబాదు వంటి ఇంజను వుంది కాబట్టి, బండి నడిచిపోతోంది. చిన్న నీటి ప్రాజెక్టుల కారణంగా పల్లెల్లో వ్యవసాయం బాగుంది కానీ నగర నిర్వహణ అధ్వాన్నం. కరోనా విషయంలో వైఫల్యం. ఉద్యోగుల్లో అవినీతి పెరిగింది. అలసత్వం ఎప్పటిలాగానే వుంది. ఈటల వ్యవహారం బయటకు వచ్చినపుడు యితర నాయకుల అవినీతి, భూ ఆక్రమణలు కూడా బయటపడ్డాయి కదా! తెరాస అధినాయకత్వం అసమ్మతిని అణచివేస్తోంది. పాలనలో అవకతవకలను విమర్శించే ప్రజావాణిని వినబడనీయటం లేదు.
కెసియార్ నియంతృత్వం చూసి నిజామే నాలిక కరుచుకోవాలి. తెరాసకు ప్రత్యామ్నాయం కావాలి. అది ఎవరు అనేదే ప్రశ్న. ఈటల రాజేందర్ బయటకు వద్దామనుకున్నపుడు కెసియార్‌కు వ్యతిరేకంగా బలంగా నిలబడగలిగిన పార్టీ బిజెపి ఒక్కటే కావడంతో దానిలో చేరాడు, భావసారూప్యం లేకపోయినా! రేవంత్ సరిగ్గా చేస్తే, కాంగ్రెసు నాయకులు సహకరిస్తే (బిగ్ ఇఫ్) గట్టి ప్రతిపక్షంగా ఎదిగి, భావి రాజేందర్‌లకు కాంగ్రెసు ఒక ఆప్షన్‌గా ఎదుగుతుంది.
జాతీయ స్థాయిలో కాంగ్రెసు పతనదిశలో వుండగా స్థానికంగా ఎలా ఎదగగలరు అనుకోవద్దు. కొన్ని రాష్ట్రాల ఉపయెన్నికలలో కాంగ్రెసు గెలుస్తూనే వుంది. రాహుల్ అటు తొంగి చూడకుండా వుండాలంతే! అతను రంగంలోకి దిగకుండా వుంటే స్థానిక నాయకులు తంటాలు పడి ఏవో కొన్ని సీట్లు గెలుచుకుని వస్తున్నారు. తమిళనాడులో 75 శాతం స్ట్రయిక్ రేట్ సాధించారు. రేవంత్‌పై అసూయతో హనుమంతరావు లాటి వాళ్లు రాహుల్‌ను పిలుచుకుని వస్తే మాత్రం రేవంత్ కృషి అంతా బూడిదలో పోసినట్లే!
ఇక షర్మిల – ఫిబ్రవరిలోనే ఆమె గురించి ( షర్మిల – ఏన్ యాంగ్రీ ఉమన్ ) రాశాను. దానిలో తెలంగాణలో ఎదగడం ఆమెకు ఎన్ని రకాలుగా కష్టమో వివరంగా రాశాను. అప్పణ్నుంచి యీ ఐదు నెలల్లో ఆమె పరిస్థితిలో మెరుగు ఏదీ కనబడలేదు. కొన్ని సభలు పెట్టి, కొన్ని పెట్టబోయి, కరోనా కారణంగా తమాయించుకుని, వాయిదాలు వేసింది. వైయస్ జయంతి రోజున పార్టీ పెట్టేసింది. ఈ లోగా టీవీ చర్చల్లో పాల్గొనలేదు. మేధావుల వేదికపై ప్రసంగించలేదు. రాజకీయాల పట్ల తన కెంత అవగాహన వుందో, తెలంగాణ అభివృద్ధికి తన వద్ద ఎలాటి ప్రణాళిక వుందో ఎప్పుడూ చెప్పలేదు.
పార్టీ పెట్టినపుడు కూడా ఎంతసేపూ వైయస్ నామజపం చేసి నేను ఆయన కూతుర్ని అని చెప్పుకుంటే ఏం లాభం?. తనకు ఎంత తెలుసో మనకు తెలియనివ్వలేదు. తను పార్టీ పెట్టగానే వైయస్ అనుయాయులందరూ పొలోమని వచ్చి చేరిపోతారని అనుకుంటే మాత్రం నిరాశ పడి వుండాలి. ఎందుకంటే ఎవరూ వచ్చి చేరలేదు. ఐదు నెలల్లో పార్టీలో ఎంతో కొంత చలనం వచ్చి వుండాలి కదా, చైతన్యం కనబడాలి కదా!
ఈమె మహిళలకు 50శాతం కోటా యిస్తాను, నిరుద్యోగ యువతల వెతలు తీరుస్తాను అంటూ రొటీన్ వాగ్దానాలే చేస్తోంది. ప్రత్యేక నినాదం ఏమీ లేదు. నిరుద్యోగ సమస్యను కేంద్రమే తీర్చలేక పోతోంది. ఈమె స్థాయిలో ఏం చేయగలదు? పార్టీ తరఫున స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెడతాను వంటివి ఆఫర్ చేయటం లేదు. 100 రోజుల తర్వాత పాదయాత్ర చేస్తానని ఆఫర్ మాత్రం చేసింది! తెలంగాణలో తన తండ్రికి యింకా అనుయాయులు వున్నారని, పాదయాత్ర టైములో వాళ్లు కదం కలిపి పార్టీలే చేరతారని ఆవిడ అంచనా కాబోలు. వైయస్ మరణించి పుష్కరమైంది. పబ్లిక్ మెమరీ నుంచి కొద్దికొద్దిగా ఫేడ్ కావడం సహజం. ఆంధ్రలో అయితే మంచికో, చెడుకో బాబు, జగన్ ఆ జ్ఞాపకాలను సజీవంగా వుంచారు. తెలంగాణలో ఆ అవసరమేముంది? కాంగ్రెసే వైయస్ పేరును భూస్థాపితం చేసేసింది. అవినీతిపరుడని ముద్ర వేసి కేసులు నడిపిస్తోంది. ఇక వైయస్ ఓటు బ్యాంకు ఏం మిగులుతుంది?
వైయస్ చేపట్టిన జలయజ్ఞం గురించి, ఇచ్చిన ఉచిత విద్యుత్ గురించి యిప్పుడు కూడా షర్మిల మాట్లాడడంలో అర్థమేముంది? ఉచిత విద్యుత్ ఎలాగూ లభిస్తోంది. ఇక జలయజ్ఞమా? కెసియార్ చేపట్టిన మినీ ప్రాజెక్టుల కారణంగా తెలంగాణ పల్లెలు కళకళలాడుతున్నాయి. పంటభూముల రేట్లు పెరిగాయి. అప్పుడెప్పుడో వైయస్ చేసినదాని వలననే యిప్పుడీ కళ అంటే ఎవరు నమ్ముతారు? షర్మిలకు వచ్చిన యిబ్బంది ఏమిటంటే – గత ఏడేళ్లగా తెలంగాణలో వైయస్ కథ వినిపించినవాడు లేడు.
వైయస్ అనుయాయులుగా వున్నవాళ్లు కూడా తెలంగాణవాదులుగా మారిపోయి, ‘సమైక్య రాష్ట్రంలో వైయస్ మా గొంతు నొక్కేశాడు, అందుకే మా ప్రాంత ప్రజలకు ఏమీ చేయలేక పోయాం’ అంటూ తమ వైఫల్యాలను వైయస్ నెత్తిన రుద్దేశారు. వైయస్ కుటుంబం దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే జగన్ తెలంగాణపై ఆశలు వదిలేసుకుని, ఆంధ్రపై మాత్రమే ఫోకస్ చేశాడు. షర్మిల ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.
వైయస్ లింకు పూర్తిగా తెగిపోయాక, యిప్పుడు హఠాత్తుగా వచ్చి ‘నేను తెలంగాణ దానినే’ అంటూ రాజకీయాలు చేయబోతే ఎవరు హర్షిస్తారు? ఎవరు స్పందిస్తారు? అది అర్థం చేసుకోకుండా ఆమె వీర తెలంగాణవాదిగా వేషం కట్టడానికి చూస్తున్నారు. ‘రెండు సంవత్సరాలుగా కృష్ణా నది మీద ప్రాజెక్టులు కడుతూంటే కెసియార్ యిప్పుడే తెలివిలోకి వచ్చారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని యింటికి పిలిపించి, భోజనాలు పెట్టి, కౌగలించుకుని, స్వీట్లు పంచుకోవచ్చు, ఉమ్మడి శత్రువును ఓడించవచ్చు.
కానీ రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాయితీ గురించి మాట్లాడుకోలేరా?’ అని షర్మిల అడిగారు. ఈ డైలాగు ఆంధ్ర టిడిపి నాయకుడెవరైనా అన్నారని చెప్పినా సులభంగా నమ్మవచ్చు. ఇది వారి భాషే. ‘ఇద్దరూ కలిసి కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవాలి’ అనేది ఎవరైనా అనదగిన మాట. కానీ యీ వెటకారాలు, కలిసి ఉమ్మడి శత్రువును ఓడించారు అనేది.. యివన్నీ జగన్‌ను తక్కువగా చూపే ప్రయత్నమే. కలిసి కూర్చోవాలని అనడం సంపాదకీయం బ్రాండ్ మాట. రెండు సంవత్సరాలుగా ఆంధ్ర కట్టే ప్రాజెక్టులు సక్రమమో, అక్రమమో షర్మిల తన అభిప్రాయాన్ని చెప్పి వుంటే బాగుండేది.
‘కనబడ్డవాళ్లందరినీ క్రైస్తవంలోకి మార్చేస్తాడని పేరుబడిన ఆమె భర్త అనిల్ ఆమెకు ఎసెట్ అవుతాడో, లయబిలిటీ అవుతాడో చూడాలి. ప్రియాంకా గాంధీకి రాబర్డ్ వాధ్రా ఒక బ్యాగేజి అయినట్లు, షర్మిలకు అనిల్ కావచ్చు.’ అని ఆ వ్యాసంలో రాశాను. ఈలోగా బిజెపి మరింత మతవాదిగా మారుతోంది. ‘భాగ్యలక్ష్మీ ఆలయాన్ని విస్తరిస్తాం.’ అంటున్నారు సంజయ్. ఎలా? చార్మినార్ పడగొట్టా? వీళ్లను తట్టుకోలేక మమతా బెనర్జీ గతంలో ఎన్నడూ లేని విధంగా సభల్లో మంత్రాలు చదివింది. నేను బ్రాహ్మణ మహిళను అని చెప్పుకుంది. షర్మిల అలా చేయగలరా? ఆవిడ గుడిలోకే అడుగుపెట్టరట.
రాజకీయంగా తెరాస, మతపరంగా బిజెపి ఆమెను యిరుకున పెట్టే ప్రయత్నాలు తప్పక చేస్తారు. కెసియార్ కుటుంబీకులు వైయస్ తెలంగాణ ద్రోహి అంటూ తెలివిగా మాట్లాడి ప్రజల్ని నమ్మించగలరు. కాదని వాదించగలిగే వాగ్ధాటి కానీ, సంభాషణా చాతుర్యం కానీ షర్మిల యిప్పటిదాకా ప్రదర్శించ లేదు. ఆమెకున్న ఎసెట్స్‌లో వాయిస్ ఒకటి కాదు. ఏవైనా టీవీ చర్చల్లోకి వచ్చి పాల్గొంటే ఆమె సామర్థ్యం, అవగాహన విషయమై మనకు ఓ స్పష్టమైన అంచనా వస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2021)