Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: షర్మిల – ఏన్ యాంగ్రీ ఉమన్

ఎమ్బీయస్: షర్మిల – ఏన్ యాంగ్రీ ఉమన్

నీలం సంజీవరెడ్డి గారు పెద్ద వక్త కాదు కానీ, ఆయన చిరస్మరణీయమైన కొటేషన్ ఒకటి ప్రసాదించారు. ‘ఇన్ ఇండియా ఎవరీ యాంగ్రీమాన్ స్టార్ట్స్ ఏ పార్టీ’ అని. పార్టీ ప్రారంభించడానికి సిద్ధాంతాలూ గట్రా ఏమీ కొత్తగా వెతనక్కరలేదు. ఎప్పణ్నుంచో వున్న కూడూ, గుడ్డా, గూడు స్లోగనే, ఇంకో 50 ఏళ్లు పోయినా అదే వాడుకోవచ్చు. ప్రారంభించడానికి కావలసినదల్లా కోపం. తనకు రావలసిన గుర్తింపు రాలేదన్న అనే ఆగ్రహం. ఎన్‌జి రంగా గారు మేధావి. రైతు బాంధవుడు, నిజాయితీపరుడు. కానీ ఎవరితోనూ యిమడలేని తత్త్వం. ఏ పార్టీలో చేరినా తనే లీడరు కావాలనుకోవడం, యివ్వనంటే అలిగి విడిగా వెళ్లి, వేరే పార్టీ పెట్టుకోవడం. ‘ప్రథమస్థానం ఆయనకు దక్కదు, ద్వితీయస్థానం ఆయనకు గిట్టదు’ అని చమత్కరించారొకరు. మొత్తం మీద ఆయనకు రావలసిన పదవులు రాలేదు. రాజకీయ జీవితమంతా అస్తవ్యస్తంగా నడిచింది.

ఏంగ్రీమాన్‌లే కాదు, ఏంగ్రీ ఉమన్ కూడా పార్టీ ప్రారంభించగలరని రేణుకా చౌదరి, మమతా బెనర్జీ, జయలలిత వంటి వాళ్లు నిరూపించారు. వీళ్లంతా మాతృసంస్థలో తమకు కావలసిన పదవి దక్కలేదని బయటకు వెళ్లినవారే. కొందరికి అంబ పలికింది. కొందరికి పలకలేదు. ఇప్పుడు మరో యాంగ్రీ ఉమన్ షర్మిల విషయంలో పలుకుతుందో లేదో చాలాకాలమే వేచి చూడాలి. అబ్బే ఆవిడకు అన్న మీద కోపం కాదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ అంటే ఆ పార్టీ ఏదో యిప్పుడే ఎందుకు పెట్టాలి అని అందరూ అడుగుతున్నారు. వినబడుతున్న వార్తల ప్రకారం ఆవిడ ఎంపీ పదవి ఆశించింది, జగన్ యివ్వలేదు. సినిమా హీరో తన డ్యూప్‌ను యాక్షన్ సన్నివేశాల్లో మాత్రమే వాడుకుని, తక్కిన సీన్లలో దగ్గరకు రానివ్వనట్లు జైల్లో వున్నపుడే యీ బాణాన్ని వదిలాడు. తను బయటకు రాగానే బాణాన్ని తీసి అమ్ములపొదిలో పెట్టేశాడు. కానీ యీ బాణం ఆ పొదిలో ఒదగనంది. గుర్తింపు ఏదీ అని అడగసాగింది. 

ప్రత్యామ్నాయ సెంటరాఫ్ పవర్ అయ్యేవారా? - లోకసభ, రాజ్యసభ అన్ని ఎంపీ పోస్టులున్నాయి. దేనిలో ఒక దాన్నుంచి షర్మిలను నిలబెడితే జగన్‌కు ఏం పోయింది అనుకోవచ్చు మనం. 2014లో తల్లి విజయలక్ష్మిని, పిన్నమ్మ భర్త వైవి సుబ్బారెడ్డిని, సెకండ్ కజిన్ అవినాశ్ రెడ్డిని ఎంపీ అభ్యర్థులుగా, మేనమామ రవీంద్రనాథ రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టగా లేనిది, ఉత్సాహంగా వున్న చెల్లెల్ని నిలబెట్టలేదేం? పోనీ 2019లో? ఒకే కుటుంబం నుంచి యింతమంది నాయకులుంటే కుటుంబపాలన అంటారు అని భయపడ్డాడా? ఓ పక్క కెసియార్ కుటుంబాన్ని యీ విమర్శ వెంటాడుతూంది. అవతల బాబుని చూడబోతే ఆయన సోదరుడు 1994లో ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత అజాపజా తెలియదు. బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యే, కొడుకు లోకేశ్ ఎమ్మెల్సీ. వదినగారు, తోడల్లుడు రాజకీయాల్లో వున్నా వేరే పార్టీల్లో వున్నారు. బాబు అదృష్టం ఏమిటంటే పార్టీలో బాలకృష్ణ గ్రూపు అనేది లేదు, ఆయనకు యిది కాలక్షేపమే తప్ప ముఖ్యవ్యాపకం కాదు. ఇక లోకేశ్ తండ్రి అడుగుజాడల్లోనే వుంటూ, చేదోడువాదోడుగా వుంటాడు తప్ప తన కంటూ ఓ గ్రూపు కట్టుకోలేదు. 

కెసియార్ కుటుంబంలో అన్నా చెల్లెలు మధ్య సఖ్యత లేదనే వార్తలు వస్తూంటాయి. కెటియార్‌కి ప్రాముఖ్యత పెరిగిన కొద్దీ తనకు తగ్గిపోతోందన్న బాధతో హరీశ్ తిరుగుబాటు చేయబోతున్నాడని ప్రతి ఆర్నెల్లకూ వార్తలు వస్తూంటాయి. కాంగ్రెసు, బిజెపి వగైరా అన్ని పార్టీలతోనూ అతన్ని జోడించేశారు. ఇప్పటిదాకా అది జరగలేదు కానీ తెరాసకు సీట్లు తగ్గిన పక్షంలో హరీశ్ బయటకు వచ్చేస్తాడన్న పుకార్లు మాత్రం ఆగటం లేదు. వైసిపిలో షర్మిల ఎంపీగానో, ఎమ్మెల్యేగానో, లేక పార్టీలో ఏదో ఒక ముఖ్యమైన పదవిలో వుండి వుంటే (ప్రస్తుతం కన్వీనర్ పోస్టు పేరుకే తప్ప పార్టీ ముఖ్యులతో సమావేశాలు జరిపినట్లు పేపర్లలో రాలేదు) ఆల్టర్నేటివ్ సెంటర్ ఆఫ్ పవర్‌గా మారడానికి ఛాన్సు ఎక్కువుంది. ఎంపీలకు, ఎమ్మెల్యేలకే జగన్ దర్శనం దుర్లభంగా వుందని ఆరోపణలు వస్తున్న సమయంలో వారందరూ ఆమె చుట్టూ గుమిగూడేవారు. 

వైయస్ వారసత్వం తనొక్కడికే – పదవి వుండి వుంటే అన్నకు, వాళ్లకు మధ్య లయజన్ చేసేదో లేక అసంతృప్తులను చేరదీసేదో తెలియదు కానీ హరీశ్ విషయంలో వచ్చినట్లే షర్మిల తిరుగుబాటు చేస్తోందన్న వార్తలు రోజూ వచ్చేవి. ఓ పక్క టిడిపి లోంచి ఎమ్మెల్యేలు జారిపోతూ వుంటే వారి మాట ఎత్తకుండా, వైసిపిలోంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని ఆ మధ్య ఎబిఎన్, టివి5 హోరెత్తించేయి. షర్మిల పార్టీలో యాక్టివ్‌గా వుండి వుంటే యిక రోజూ యిదే న్యూస్! ఇవాళ షర్మిల నల్ల చీర కట్టుకుంది, అన్న ప్రవర్తనకు నిరసనగా! తను వచ్చినప్పుడు కుర్చీలోంచి లేవడం కావాలని ఆలస్యం చేసింది.. యిలా అల్లేసుకుంటూ పోయేవారు. హరీశ్ ఎన్నిసార్లు ఖండించినా వార్తలు వస్తూన్నట్లే, షర్మిల బోర్డు రాసి పెట్టుకున్నా యీ కథనాలు ఆగేవి కావు. షర్మిల వెంట ఎంతమంది వైసిపి ఎమ్మెల్యేలు వస్తారో ఊహించమని రోజుకో ఒపీనియన్ పోల్ పెట్టేవారు. 

ఏది ఏమైనా వైయస్ వారసత్వం తనొక్కడికే వుండాలని జగన్ ప్లాను కావచ్చు. తెలంగాణను వదిలేసి తను ఆంధ్రపైనే ఫోకస్ పెట్టాలని, వైయస్ అభిమానులందరూ తనపైనే ఫోకస్ పెట్టాలనీ జగన్ ఊహ కావచ్చు. గతంలో లాగ జైలుకి వెళతాడేమో, అప్పుడు అన్న స్థానంలో తన డిప్యూటీగా వెళ్లవచ్చని షర్మిల ఆశించి వుండవచ్చు. వ్యాపారం భారతి చూసుకుంటోంది కాబట్టి, రాజకీయం తను చూసుకోవచ్చని అనుకోవడంలో తప్పు లేదు. ఆరేళ్లు దాటిపోయింది కానీ అది జరగలేదు. తను జైలుకి వెళ్లే సందర్భం రాదనుకుంటున్నారో ఏమో జగన్ నెంబర్ టూగా ఎవర్నీ చూపటం లేదు. తను రాష్ట్రానికి పరిమితమయ్యాడు కాబట్టి చెల్లికి రాజ్యసభ ఎంపీ సీటు యిప్పించి దిల్లీలో విజయసాయి బదులు నువ్వే లాబీయింగ్ చేయి చాలు అందామన్నా పార్టీలో అసంతృప్తివాదులు అటు చేరవచ్చు. బంధువుల్ని నమ్మకూడదని ఎన్టీయార్ ఉదంతం చాటి చెప్పింది కదా! 

క్రైస్తవ యిమేజి తెలంగాణలో మైనస్సే - ఏదైతేనేం, జగన్ షర్మిలను పక్కన పడేశాడు. నీ అవసరం తీరిపోయింది, అనామకురాలిగా వుండు అని చేతలతో చెప్పాడు. ఆవిడకు కోపం వచ్చింది. నువ్వెంత లీడర్‌వో నేనూ అంతే లీడర్‌ని అని అన్నకు పాఠం చెప్పాలనుకుంది. కానీ ఆంధ్రలో అన్నను ఎదిరించడం కష్టం. ఎందుకంటే జగన్ యిటీవల సొంతంగా యిమేజి పెంచుకుంటున్నాడు. వైయస్ వారసత్వం మాట అవసరం పడటం లేదు. అందుకే తెలంగాణ ఎంచుకుంది. అది కష్టమైన టెర్రైన్. ఆంధ్రలో అయితే షర్మిలకు రెస్పాన్స్ బాగుంటుంది. ముఖ్యంగా కడప, రాయలసీమలలో నాన్న సెంటిమెంటు పనికి వస్తుంది. పైగా క్రైస్తవ జనాభా ఆంధ్రలోనే ఎక్కువ. వైయస్ కుటుంబంలో పక్కా క్రైస్తవులు, పక్కా హిందువులు, రెండిటిని గౌరవించేవాళ్లూ ఉన్నారని విన్నాను. వైయస్, జగన్‌లకు క్రైస్తవ ముద్ర తక్కువ. వాళ్లు గుళ్లూ గోపురాలకు వెళతారు. విజయలక్ష్మిగారు క్రైస్తవం పుచ్చుకున్నాక గుళ్లకు వెళుతున్నట్లు లేదు. ఇక భారతి, షర్మిల గుళ్లకు వెళ్లరట. షర్మిల విషయంలో ఆమె భర్త అనిల్ ఆమెను పెళ్లాడాక బ్రాహ్మణ్యం వదిలేసి క్రైస్తవం తీసుకోవడమే కాక, క్రైస్తవ మతగురువుగా కూడా మారాడు. 

అది క్రైస్తవులను మెప్పించవుండవచ్చు కానీ తెలంగాణలో మాత్రం అది మైనస్సే. ముఖ్యంగా బిజెపి హిందూత్వ ఎజెండాతో ముందుకు వెళుతున్న యీ రోజుల్లో! తెరాస-ఎమ్ఐఎమ్ దోస్తీని బూచిగా చూపిస్తూ ఎదుగుతున్న బిజెపి, ఈమె పార్టీని వదులుతుందా? పార్టీ సభలను మతవ్యాప్తి సభలుగా చిత్రీకరిస్తారు. అనిల్ పాల్గొనే మతప్రచార సమావేశాలను రాజకీయాలకు ఉపయోగిస్తున్నాడని ఫిర్యాదులు చేస్తారు. క్రైస్తవ మతప్రచారోధృతి ఎప్పణ్నుంచో సాగుతూనే వుంటుంది. హిందూమతంలో వివక్షత వున్నంతకాలం క్రైస్తవం దాన్ని వాడుకుంటూనే వుంటుంది. నాకు తెలిసి ముస్లిములెవరూ క్రైస్తవులుగా మారటం లేదు. హిందువులే మారుతున్నారు. హిందువుల్లోని కొన్ని వర్గాల్లో సామాజిక పరమైన అసంతృప్తి వున్నంతకాలం మార్పిడులు జరుగుతూనే వుంటాయి. 

మతగురువుల రాజకీయాలు - జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యిది పెరిగిందని, అతను దిగిపోగానే వాళ్లు ఆపేస్తారని నేననుకోవడం లేదు. గణాంకాలు చూస్తే తప్ప యిలాటివి నిర్ధారించలేం. తిరుపతిలో అన్యమతప్రచారం అనేది పివి నరసింహారావు వంటి బ్రాహ్మణుడు ముఖ్యమంత్రిగా వుండగా కూడా విన్నాను. కానీ జగన్ వచ్చాకనే క్రైస్తవులు చెలరేగి పోతున్నారని ఆంధ్రలో ప్రతిపక్షాలు అంటున్నాయి. అలాటిది ఒక ఎవాంజలిస్టు భార్య ఐన షర్మిలపై యీ అభియోగం రాదా? ఆమె దాన్ని ఎలా తట్టుకుంటుంది? 2014లో అనిల్ చురుగ్గా వున్నపుడు ఆంధ్ర ఎన్నికలలో చర్చి తాలూకు వాహనాల్లో వైసిపి ఓటర్లకు సరఫరా చేయాల్సిన డబ్బు రవాణా చేశాడని టిడిపి ఆరోపించింది. 2019లో అలాటిది వినలేదు. అనిల్‌కు ఏ ప్రాధాన్యతా యివ్వకపోవడం చేత కాబోలు. 

కానీ షర్మిల పార్టీలో అనిల్ విస్మరింపరాని వ్యక్తి. పైగా అతన్ని దాచేద్దామని షర్మిల అనుకోవటం లేదు. తన తలిదండ్రుల మేరేజ్ యానివర్సరీ అంటూ అందర్నీ పిలిచింది. మర్నాడు అనిల్ పుట్టినరోజు అంటూ కోలాహలం చేసింది. కనబడ్డవాళ్లందరినీ క్రైస్తవంలోకి మార్చేస్తాడని పేరుబడిన ఈ అనిల్ ఆమెకు ఎసెట్ అవుతాడో, లయబిలిటీ అవుతాడో చూడాలి. ప్రియాంకా గాంధీకి రాబర్డ్ వాధ్రా ఒక బ్యాగేజి అయినట్లు, షర్మిలకు అనిల్ కావచ్చు. ఒక మతగురువు డైరక్టుగా రాజకీయాల్లో తిరిగితే చూడ్డానికి ఎబ్బెట్టుగానే వుంటుంది. కెఎ పాల్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదుగా. హిందూ సన్యాసులు, సన్యాసినులు, యోగులు బిజెపిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రిణులు అయ్యారు. అదంతా నార్త్‌లో చెల్లింది. ఇక్కడ మనకు కొత్త. స్వామి పరిపూర్ణానంద బిజెపిలో చేరి తెలంగాణలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేశారు. ఫలితం లేకపోయింది. తర్వాత ఆయనా చప్పబడ్డారు.

మతగురువులంటే శాంతివచనాలు చెపితేనే బాగుంటుంది. ‘హమ్‌సే జో టకరాయేగా, వో మిట్టీమే మిల్ జాయేగా’ వంటి నినాదాలిస్తే బాగుండదు. ప్రత్యర్థులను తుక్కుతుక్కుగా ఓడగొట్టండి అన్నా ఎబ్బెట్టుగానే వుంటుంది. విజయలక్ష్మిగారు చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగితేనే ఆంధ్రలో యాగీ చేశారు. మనం రుద్రాక్షమాలలు, చేతికి తాళ్లు కట్టుకున్నట్లే ఆవిడ బైబిల్ పట్టుకుందని ఓటర్లు అనుకోలేదేమో, వైజాగ్‌లో ఓడించారు. ఓటమికి ఇదొక్కటే కారణమని నేను అనటం లేదు. ఇది కూడా కారణం కావచ్చు. మరి షర్మిల భర్త వెనక్కాలే తెల్ల గౌను, బైబిల్‌తో కనబడుతూంటే తెలంగాణ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. (సశేషం)

ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?