ఇండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజే స్పిన్నర్ల చేతిలో బంతి తిరిగింది. తొలి మ్యాచ్ జరిగిన ఈ స్టేడియంలోని ఒక పిచ్ పై తొలి రెండు రోజులూ బంతి మరీ బెంబేలెత్తించలేదు. దీంతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ధాటిగానే ఆడారు.
భారత బౌలర్లు శ్రమించి కూడా వికెట్లు తీయలేకపోయారు. మూడో రోజుకు కానీ.. కాస్త చేయి తిరగలేదు స్పిన్నర్లకు. అదే స్టేడియంలోని మరో పిచ్ పై జరుగుతున్న ఈ మ్యాచ్ లో మాత్రం తొలి రోజే ఇంగ్లండ్ స్పిన్నర్లు చూడచక్కని డెలివరీలు సంధించగలిగారు.
ప్రత్యేకించి మొయిన్ అలా బౌలింగ్ లో విరాట్ కొహ్లీ బౌల్డ్ అయిన బంతి… పిచ్ స్వభావాన్ని చాటింది. అలాంటి చూడచక్కని బంతితోనే రహనేను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు అలీ. ఇక ఇంగ్లండ్ మరో స్పిన్నర్ కూడా పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని ఉపయోగించుకుని వికెట్లు తీయగలిగాడు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన రూట్ కూడా వికెట్ తొలి రోజే వికెట్ తీశాడు. రూట్ కూడా భారత బ్యాట్స్ మెన్ ను గడగడలాడించే బాల్స్ వేయగలిగాడు.
స్థూలంగా తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 300 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది టీమిండియా. తొలి రోజు ఆటలో ప్రముఖంగా పేర్కొనాల్సిన అంశం రోహిత్ శర్మ బ్యాటింగ్. తనదైన అద్భుత బ్యాటింగ్ తో 161 పరుగులను సాధించాడు ఈ భారత ఓపెనర్.
రెండో ఓవర్లోనే గిల్ ఔట్ అయినా, ఆ తర్వాత పుజారా, కొహ్లీలు కూడా స్టాండ్ కాలేకపోయినా.. ఏ దశలోనే తడబడకుండా శర్మ బ్యాటింగ్ సాగింది. 20 ఓవర్ల స్థాయిలోనే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్ శర్మ- రహనేలు అద్భుత భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీని పూర్తి చేసుకుని, 150 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తాడనుకుంటే..అంతలోనే ఔట్ అయ్యాడు. ఆ వెంటనే రహనే కూడా పెవిలియన్ చేరడంతో.. మ్యాచ్ భారత జట్టు చేతుల్లోకి వస్తున్న దశ నుంచి ఇంగ్లండ్ మళ్లీ పోటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.
క్రీజ్ లో పంత్, అక్షర్ పటేల్ లు ఉన్నారు. తనదైన బ్యాటింగ్ శైలితో పంత్ మంచి షాట్స్ ఆడాడు. ఈ పిచ్ మీద తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల పరుగులు సాధించినా.. టీమిండియా కచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే అని పిచ్ తీరును బట్టి స్పష్టం అవుతోంది.
ఈ మ్యాచ్ లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అశ్విన్ కు తోడు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లతో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్ లో ఓటమి నేపథ్యంలో.. భారత జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనదిగా మారింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో 350కి మించి పరుగులు సాధించినా కాస్త గౌరవప్రదమైన స్కోరే అవుతుంది. ఆ స్కోర్ కు టీమిండియా చేరవకావడం, కాకపోవడం పంత్ రేపు తొలి సెషన్ లో బ్యాటింగ్ చేసే తీరు మీదే ఆధారపడింది.