ప‌వ‌న్‌ను నిరాశ‌ప‌రిచిన మ‌హానాడు

ఒంగోలులో రెండు రోజుల పాటు మ‌హానాడు ఘ‌నంగా జరిగింది. ఈ మ‌హానాడు టీడీపీ అన‌ధికార మిత్రుడు, జ‌గ‌న్ మాట‌ల్లో చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. పొత్తు విష‌య‌మై మ‌హానాడు స్ప‌ష్ట‌త ఇస్తుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్…

ఒంగోలులో రెండు రోజుల పాటు మ‌హానాడు ఘ‌నంగా జరిగింది. ఈ మ‌హానాడు టీడీపీ అన‌ధికార మిత్రుడు, జ‌గ‌న్ మాట‌ల్లో చంద్ర‌బాబు ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. పొత్తు విష‌య‌మై మ‌హానాడు స్ప‌ష్ట‌త ఇస్తుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంతో ఆశించారు. అయితే ఆయ‌న ఆశ‌, ఆశ‌యాల‌కు త‌గ్గ‌ట్టు మ‌హానాడు జ‌ర‌గ‌లేదు. త‌న‌పై టీడీపీ ఆధార‌ప‌డ లేదేమో అనే భావ‌న ప‌వ‌న్‌కు అసౌక‌ర్యం క‌లిగిస్తోంది.  జ‌న‌సేనాని ప‌వ‌న్‌, పొత్తు లాంటి ఊసే లేదు. ఇదే జ‌న‌సేనాని ప‌వ‌న్‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ప‌వ‌న్‌ను రెచ్చ‌గొట్టి, ఇప్పుడు మాత్రం టీడీపీ కూల్‌గా మ‌హానాడును విజ‌య‌వంతం చేసుకుంది. జ‌న‌సేన‌తో ఒన్‌సైడ్ ల‌వ్‌లో ఉన్నామ‌ని, అటు వైపు నుంచి స్పంద‌న వ‌స్తే క‌దా? అని కుప్పంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా రెచ్చ‌గొట్టారు. తన కోసం చంద్ర‌బాబు విర‌హ‌వేద‌న‌తో త‌పిస్తున్నార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌మ్మారు. ఈ ఏడాది మార్చిలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో చంద్ర‌బాబు ప్రేమ ప్ర‌తిపాద‌న‌కు సానుకూల సంకేతాల్ని ప‌వ‌న్ పంపారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌నివ్వ‌న‌ని, దానికి తాను నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని స‌భాముఖంగా ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపేందుకు బీజేపీ రోడ్‌మ్యాప్ ఇవ్వాల‌ని ప‌వ‌న్ కోరారు. ఈ స‌భ త‌ర్వాత కొన్ని రోజుల‌కు చంద్ర‌బాబు మాట్లాడుతూ జ‌గ‌న్‌పై పోరాటంలో అన్ని పోరాటాలు క‌లిసి రావాల‌ని, తాను నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించారు. 

త్యాగాల‌కు సైతం సిద్ధ‌మ‌న్నారు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, సొంతంగానే అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా పెరిగిన‌ప్ప‌టి నుంచి ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకుపోవ‌డంపై టీడీపీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది.

ఈ నేప‌థ్యంలో పొత్తుపై నిర్ణ‌యాన్ని కాలానికి వ‌దిలేయాల‌ని, త‌మ‌కు తాముగా ప్ర‌స్తావించ‌కూడ‌ద‌ని టీడీపీ అంత‌ర్గ‌తంగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. దీంతో మ‌హానాడులో పొత్తుపై చ‌ర్చే లేదు. పొత్తుపై మ‌హానాడులో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని, త్వ‌ర‌లో రెండు పార్టీలు క‌లిసి ప్ర‌యాణించొచ్చ‌ని జ‌న‌సేనాని ఆశించారు.

కానీ మ‌హానాడు ప‌వ‌న్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. చంద్ర‌బాబు వ్యూహం ప‌వ‌న్ అజ్ఞానాన్ని బ‌య‌ట పెట్టింది. ఇంత‌కూ టీడీపీ మ‌న‌సులో ఏముందో జ‌న‌సేనానికి అంతుచిక్క‌డం లేదు. చంద్ర‌బాబు ప్రేమ ప్ర‌తిపాద‌న‌ను న‌మ్మి, జ‌గ‌న్ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చ‌నివ్వ‌నంటూ, మిత్రప‌క్ష‌మైన బీజేపీ దృష్టిలో న‌మ్మ‌కాన్ని కోల్పోయానేమో అన్న భావ‌న క‌లుగుతోంది. 

ఏది ఏమైనా రాజ‌కీయాల్లో ప‌వ‌న్ అనుభ‌వ‌రాహిత్యం ఆయ‌న్ను మ‌రోసారి వెర్రిప‌ప్పుగా మిగిల్చింది.