వైసీపీకి మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమా సడలుతోందా? 2024లో అధికారంలోకి రాలేమనే భయం పట్టుకుందా? టీడీపీ, జనసేన కలిస్తే… ఇక అధికారం కల్లే అనే నిర్ణయానికి అధికార పార్టీ నేతలు వచ్చారా? అంటే….ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు సామాజిక న్యాయభేరి యాత్రలో మంత్రుల ప్రసంగాలే నిదర్శనం. మరోసారి అధికారం తమదే అని పైకి వైసీపీ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, క్షేత్రస్థాయి పరిణామాలు ఆ పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
సామాజిక న్యాయభేరి యాత్ర శనివారం రాత్రికి పల్నాడు జిల్లా నరసరావుపేటకు చేరింది. న్యాయభేరి యాత్రా సభల్లో మంత్రులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తానని చంద్రబాబునాయుడు చెప్పాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో సింహం సింగిల్‌గానే వస్తుందని, తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్‌మోహన్‌రెడ్డే అని మంత్రులు స్పష్టం చేశారు.
ఇక్కడే మరోసారి అధికారంపై మంత్రుల ప్రసంగాలు అనుమానం కలిగిస్తున్నాయి. ప్రత్యర్థులు ఎలా వస్తే ఏంటి? రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. ఇలా పోటీ చేయ్, అలా పోటీ చేయ్ అని సవాల్ విసరడానికి ప్రత్యర్థులకు హక్కు ఏముంది? రెచ్చగొడితే, పౌరుషానికి పోయి టీడీపీ ఒంటరిగా బరిలో నిలుస్తుందేమోనని వైసీపీ ఆశ పడుతున్నట్టు మంత్రుల మాటలు చెబుతున్నాయి. చంద్రబాబుకు అలాంటివేవీ లేవు.
తనకు గెలుపు, అధికారం తప్ప ….మరేవీ ప్రాధాన్య అంశాలు కానేకావు. కానీ వైసీపీ విషయం అలా కాదు. ఇతరులతో కలిసిపోలేని తత్వం. గెలుపోటములతో సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడాలనేది ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నైజం. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పంథా. కొన్నిసార్లు పొత్తులు కలిసొస్తాయి, మరికొన్ని సందర్భాల్లో వికటిస్తాయి. అందరితో పొత్తు పెట్టుకుంటానని చెప్పడం సిగ్గుగా లేదా అని చంద్రబాబును మంత్రులు నిలదీసినంత మాత్రాన ఆయన మారరుకాక మారరు.
కానీ మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే సింగిల్‌గా పోటీ చేసి అధికారంలోకి వస్తామని చెప్పగలవా? అని సవాల్ విసరడం ద్వారా …. పొత్తులో వస్తే తాము ఓడిపోతామనే సంకేతాలు పంపినట్టుంది. ఇది అధికార పార్టీకి నష్టదాయకమే. మంత్రుల మనసుల్లో అధికారంపై బెంగ వుండడం వల్లే అలా మాట్లాడ్తుతున్నారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన నాయకులు విమర్శిస్తున్నారు.
కానీ టీడీపీ, జనసేన మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు కుదరకూడదని వైసీపీ కోరుకుంటోంది. ఆ రెండు పార్టీల ఎడబాటే, తమకు శ్రీరామ రక్షగా వైసీపీ భావిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో మరి!