పెద్ద నోరు ఉంది. ఏది మాట్లాడినా మద్దతిచ్చే కొంతమంది జనాలున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే తాటికాయంత అక్షరాలతో బ్యానర్లు కట్టే పత్రికలున్నాయి. రోజంతా ఊదరగొట్టే న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. ఇంకేముంది వాగేయడమే. నోటికొచ్చినంత నంబర్ చెప్పేయడమే. అసలు ప్రజలు నమ్ముతారా నమ్మరా అనే విచక్షణ కూడా అక్కర్లేదు.
తాజాగా చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ఆ పల్లవి పేరు లక్షా 75వేల కోట్లు. గుర్తుంచుకోండి.. ఎన్నికల వరకు ఈ పాటే మారుమోగుతుంది. ఈ పల్లవే టీడీపీ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
జగన్ మూడేళ్లలో లక్షా 75వేల కోట్ల రూపాయలు దోచుకున్నారట. ఇదీ చంద్రబాబు తాజా ఆరోపణ. మహానాడు కోసం ఏదైనా బలమైన పంచ్ లైన్ ఉండాలని ఆలోచించి మరీ ఈ నంబర్ ఫిక్స్ చేసినట్టున్నారు. లక్షా 75వేల కోట్లు.. సౌండింగ్ చాలా బాగుంది. ఎల్లో మీడియాతో రీసౌండ్ కూడా బాగా చేయించొచ్చు. ఇంకేముంది, ముందువెనక ఆలోచించకుండా ఆ నంబర్ కు ఫిక్స్ అయిపోయారు. జగన్ అవినీతి చేశారంట, దాన్ని చంద్రబాబు కక్కిస్తారట.
ఇలా ఆయన సోలో స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చారు. దానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఎందుకంటే, అలాంటి సాక్ష్యాలు ఆయన దగ్గర లేవు కాబట్టి. ఎదురుగా జనాలున్నారు, రేపు ఉదయం పచ్చ పత్రికలకు ఓ హెడ్డింగ్ కావాలి. కాబట్టి చంద్రబాబు వాగేశారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడేశారు.
గతంలో లక్ష కోట్లు అన్నారు.. ఇప్పుడిలా..!
ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే దాన్ని తన మీడియా సహకారంతో నిజం చేయడంలో చంద్రబాబు దిట్ట. బాబు పందిని చూపించి నంది అంటే, ఎల్లో మీడియా దాన్ని క్షణాల్లో నందిగా మార్చేస్తుంది. గతంలో ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. జగన్ లక్ష కోట్ల రూపాయల అవినీతి చేశారనేది 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాట. దాదాపు పదేళ్లు ఈ పాట పాడారాయన.
లక్ష కోట్లు అనే సౌండింగ్ బాగుంది కాబట్టి అప్పుడలా వాడేశారు. ఎల్లో మీడియా తందానా అనేసింది. కానీ ఇందులో నిజమెంత. స్వయంగా జగన్ కేసులపై దర్యాప్తు చేసిన జేడీ లక్ష్మీనారాయణే ఓ సందర్భంలో ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. చెప్పుకోడానికి బాగుంటుందని కొంతమంది లక్ష కోట్లు పదాన్ని పాపులర్ చేశారని, అంతకుమించి అక్కడేం లేదని తేల్చిచెప్పారు.
ఇప్పుడు మరోసారి లక్ష కోట్లు అంటే జనం నమ్మరు. అలా అని అంతకంటే తగ్గిస్తే బజ్ ఉండదు. అందుకే ఈసారి ఏకంగా లక్షా 75వేల కోట్లు అనే పల్లవి అందుకున్నారు చంద్రబాబు. ఈ మూడేళ్లలో జగన్ చేసిన అవినీతి మొత్తం ఇదంట. తను అధికారంలోకి వస్తే ఇది కక్కిస్తారట.
మిగతా పాతిక వేల కోట్ల సంగతేంటి..?
చంద్రబాబు, లక్షా 75 వేల కోట్లు మాత్రమే అని ఎందుకన్నారు. 2 లక్షల కోట్లు అనేస్తే ఓ పనైపోతుంది కదా. ఈ అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది. కానీ క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబును అంత తక్కువగా అంచనా వేయకూడదు. కావాలనే ఆయన ఓ పాతిక వేల కోట్లను దాచిపెట్టారు. ఎందుకంటే, జగన్ టర్మ్ ఇంకా రెండేళ్లు ఉంది కదా. ఈ రెండేళ్లలో మరో పాతిక వేల కోట్ల అవినీతి అని చెప్పి, ఎన్నికల నాటికి 2 లక్షల కోట్ల రౌండ్ ఫిగర్ చేసేస్తారు. ఇదన్నమాట చంద్రబాబు బ్రెయిన్.
సో.. ఏపీ ప్రజలారా సిద్ధం కండి. రేపట్నుంచి మొదలుకాబోతున్న ఎల్లో మీడియా విసృంఖల దాడికి మానసికంగా రెడీ అయిపోండి. 2024 వరకు ఈ మానసిక దాడి ప్రజలపై ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే, అక్కడున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా. ఏపీ ప్రజల్ని అంత తేలిగ్గా వీళ్లు వదలరు.