హీరోల రెమ్యూనిరేషన్లకు గండం

కోవిడ్ అనంతరం సినిమాల జోరు పెరిగింది. హీరోల రెమ్యూనిరేషన్లు అమాంతం పెరిగాయి. కానీ వసూళ్ల ట్రెండ్ చూస్తుంటే ఇక ఈ రెమ్యూనిరేషన్లకు కళ్లెం పడేలా కనిపిస్తోంది. నైజాం, ఆంధ్రలో కలెక్షన్ల లెక్కలు చూస్తుంటే ఈ…

కోవిడ్ అనంతరం సినిమాల జోరు పెరిగింది. హీరోల రెమ్యూనిరేషన్లు అమాంతం పెరిగాయి. కానీ వసూళ్ల ట్రెండ్ చూస్తుంటే ఇక ఈ రెమ్యూనిరేషన్లకు కళ్లెం పడేలా కనిపిస్తోంది. నైజాం, ఆంధ్రలో కలెక్షన్ల లెక్కలు చూస్తుంటే ఈ రోజు దగ్గరలోనే వుందనిపిస్తోంది. 

కోవిడ్ అనంతరం నైజాం సినిమా మార్కెట్ ఎలా వుంది? ఎలా వుండబోతోంది అన్నది అంతు పట్టడం లేదు. కోవిడ్ తరువాత విడుదలైన సినిమాలు హిట్ అయినా, కాకున్నా, కూడా నైజాంలో చేసిన వసూళ్లు రికార్డు స్థాయికి చేరడం లేదు. ఆర్ఆర్ఆర్ ను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా 36 కోట్ల మార్క్ ను దాటలేదు. కోవిడ్ ముందు అల వైకుంఠఫురములో సినిమా 42 కోట్లతో ఓ మార్క్ వేసింది ఇక్కడ కూడా బాహుబలి సిరీస్ మినహాయింపు.

భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, అఖండ, ఇలా ఏవీ 30 కోట్ల మార్కు దాటలేదు. ఆచార్య సంగతి సరేసరి. పుష్ప, కేజిఎఫ్ 2 మాత్రమే 36 కోట్ల మార్క్ దాటాయి. మరి అలవైకుంఠపురములో సెట్ చేసిన మార్క్ ను అందుకోవడం అన్నది కోవిడ్ తరువాత ఇక కష్టమేనా? పైగా అప్పటి కన్నా ఇప్పుడు రేట్లు ఎక్కువ. హిట్ అనిపించుకుంటే 36 కోట్ల రేంజ్, లేదంటే 30 కోట్ల లోపు రేంజ్ తో సరిపెట్టుకోవాల్సిందేనా? 

మహేష్ -త్రివిక్రమ్ సినిమా రాబోతోంది. లెక్క ప్రకారం అలవైకుంఠపురములో మార్క్ చూపించి 42 కోట్ల రేంజ్ లో అమ్మాలి. కానీ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు, కలెక్షన్లు చూస్తుంటే 36 మించి అమ్మడానికి లేదు. 

ఇక ఆంధ్ర వ్యవహారం చూస్తుంటే కూడా తేడాగానే వుంది. 50 కోట్ల రేంజ్ లో పెద్ద సినిమాల బిజినెస్ చేస్తున్నారు. కానీ ఫలితాలు ఆ మేరకు వుండడం లేదు. పుష్పతో సహా పెద్ద సినిమాలు అన్నీ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడానికి కిందా మీదా అయ్యాయి. అవుతున్నాయి. అది కూడా అదనపు రేట్లు తెస్తుంటే. ఇకపై అలా రేట్లు తెస్తే ఫుట్ పాల్ తగ్గిపోతుందన్న భయం వెంటాడుతోంది. అలా రేట్లు తేకుంటే 50 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేయడం కష్టం అవుతుంది. 

ఎప్పుడయితే ఆంధ్ర, నైజాం అమ్మకాల రేట్లు తగ్గుతాయో, కచ్చితంగా ఆ ప్రభావం హీరోల రెమ్యూనిరేషన్ మీద పడక తప్పదు. పెద్ద హీరోలకు 50 కోట్లు ఇచ్చి, ప్రొడక్షన్ కు 70 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటే థియేటర్ మార్కెట్ ను నమ్ముకునే. కానీ థియేటర్ మార్కెట్ లో పది నుంచి పది హేను కోట్లు కన్నం పడితే ఎక్కడ ఖర్చు తగ్గించాలి? 

ప్రొడక్షన్ ఖర్చు రాను రాను పెరుగుతుందే తప్ప తగ్గదు. తగ్గాల్సింది రెమ్యూనిరేషన్లే. కానీ హీరోల కోసం నిర్మాతలు పరుగులు తీస్తుంటే తగ్గిస్తారా? ఏమో? మొత్తానికి ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడుతుందేమో? చూడాల్సి వుంది.