మహానాడు బాగా జరిగింది. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు చాలానే చెప్పుకొచ్చారు. ఆయన టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయంటూ ఒక పెద్ద నంబరే చెప్పి అధినాయకత్వం ముఖాన నవ్వులు పూయించారు. సరే ఇంత చేసినా మహానాడులో చంద్రబాబు లోకేష్ హడావుడే ఎక్కువగా కనిపించింది.
ఇక మహానాడు అందించిన మరో వార్త ఏంటి అంటే తొందరలో ఏపీ టీడీపీకి కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారుట. అంటే అచ్చెన్న ప్లేస్ లో మరొకరు అన్న మాట. ఆ వచ్చేవారు కూడా బీసీ సామాజికవర్గం వారే ఉంటారు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అని పార్టీ పెద్దలు భావిస్తున్నారుట.
నిజానికి అచ్చెన్నను ఎందుకు తప్పించాల్సిస్తోంది అంటే దానికొక ఫ్లాష్ బ్యాక్ ఉంది మరి. ఆయన గత ఏడాది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగితే అక్కడ ఒక హొటల్ లో మాట్లాడుతూ పార్టీ లేదు బొక్కా లేదు అని ఏదేదో అనేశారన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదే వీడియోలో లోకేష్ మీద కూడా కామెంట్స్ చేసినట్లుగా ఉంది.
దాంతో నాటి నుంచే అచ్చెన్న మీద అధినాయకత్వం కొంత గ్యాప్ ని కొనసాగిస్తూ వస్తోంది. ఇపుడు పార్టీలో పదవులు, నిబంధనలు అంటూ రూల్స్ కూడా పెడుతూ ఈ మధ్యన అచ్చెన్నాయుడు పదవికే ఎసరు పెడుతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తే మహానాడు పుణ్యమాని అచ్చెన్నకు పదవి ఉండదా అంటే అదే నిజమని పార్టీ వర్గాలు అంటున్నాయి.