సమీక్ష: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
రేటింగ్: 3/5
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్
తారాగణం: నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ, సుహాస్, సందీప్ తదితరులు
కథనం: నవీన్ పొలిశెట్టి, స్వరూప్ ఆర్ఎస్జె
సంగీతం: మార్క్ కె. రాబిన్
కూర్పు: అమిత్ త్రిపాఠి
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
కథ, మాటలు, దర్శకత్వం: స్వరూప్ ఆర్ఎస్జె
విడుదల తేదీ: జూన్ 21, 2019
మిస్టరీ చేధించే డిటెక్టివ్ కథలు ఎప్పుడూ ఆసక్తిగానే అనిపిస్తాయి కానీ ఆ తరహా చిత్రాలు ఎక్కువగా రావు. కారణం… మిగతా కథల మాదిరిగా అలా ఆలోచనల్లో పడిపోయి లేదా ఊహల్లోకి వెళ్లిపోయి లేదా నిజ జీవితం నుంచి ఇన్‌స్పయిర్ అయి రాసేసుకునే కథలు కావు. మిస్టరీ జోనర్లో అయితే సస్పెన్స్‌ని హోల్డ్ చేయడం కీలకం. డిటెక్టివ్ కూడా ఇన్వాల్వ్ అయితే ఆ మిస్టరీ చేధించ సాధ్యం కానంత కఠినంగా వుండడం అవసరం. చూస్తుంటేనే మిస్టరీ ఏమిటనేది ఊహించేయగలిగితే ఇక డిటెక్టివ్ పాత్రలో హీరో ఎంత వరకు ఎంగేజ్ చేయగలడు? అందుకే ఇలాంటివి రాయడానికి మిగిలిన కథల కంటే ఎక్కువగా బ్రెయిన్ స్టార్మింగ్ జరగాలి. ప్రతి విషయానికీ లింక్ కలుపుతూ, చిన్న చిన్న హింట్స్‌తో కథని ముందుకి నడిపిస్తూ సస్పెన్స్‌ని చివరి వరకు మెయింటైన్ చేయాలి. ఇది ఆషామాషీ ఎక్సర్సైజ్ కాదు కనుక జనం మెచ్చిన జోనర్ అయినా, ప్రేక్షకులని ఈజీగా ఇన్వాల్వ్ చేసే స్కోప్ వున్నా ఎక్కువ మంది దీనిని టచ్ చేయరు.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' బృందానికి ఒక సంగతి అయితే పక్కాగా తెలుసు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలంటే అది రైటింగ్ టేబుల్ మీదే జరగాలని. ఎందుకంటే ఎవరో తెలియని ఒక చిన్న హీరోతో సినిమా తీసేస్తే దానికి జనం రావాలన్నా, వచ్చిన వాళ్లు జారుకోకుండా చూడాలన్నా రైటింగ్ పక్కాగా వుండాలి. ఈ విషయంలో దర్శకుడు స్వరూప్‌తో పాటు కథనంలో చెయ్యి వేసిన నటుడు నవీన్ పొలిశెట్టి ఫుల్ క్లారిటీతో వున్నారు. ఇంతవరకు సినిమాల్లో చూపించని ఒళ్లు గగుర్పొడిచే వాస్తవిక హింసాత్మక ఘటనలని తీసుకుని వాటికి ఫిక్షన్ జోడించారు. మూఢ నమ్మకాలు లాంటి రిలేటబుల్ ఎలిమెంట్‌ని అండర్ కరెంట్‌గా పెట్టుకున్నారు. ఇక దాని చుట్టూ ఒక ఆసక్తికరమైన కథని ఎలా చెప్పాలనేదానిపై విపరీతమైన కృషి, కసరత్తు చేసి చాలా భాగం రక్తి కట్టించే ఒక డిటెక్టివ్ థ్రిల్లర్‌ని తీర్చిదిద్దారు.
రైటింగ్ పరంగా ఎందుకంత కసరత్తు జరిగిందని అంటున్నానంటే… ఇందులోని క్రైమ్‌ని హీరో కేవలం సాల్వ్ చేస్తున్నట్టుగా చూపించవచ్చు. కానీ సదరు క్రైమ్ అతడిని కూడా ఎఫెక్ట్ చేసిందని చూపించడంలోనే రచయితలు చూపించిన నేర్పు కనిపిస్తుంది. అలా అని ఈ చిత్రం లోపాలు లేకుండా అయితే రూపొందలేదు. చాలా చోట్ల లాజిక్ గురించి ఆలోచించలేదు. వేగంగా కథ చెబుతోంటే కొన్ని లాజిక్స్ ఓవర్‌లుక్ చేసేస్తారనే ధోరణి చూపించారు. వందకీ, యాభైకీ పని చేసే డిటెక్టివ్ వద్ద ఒక ఫిమేల్ అసిస్టెంట్ అంత రిస్క్ చేసి ఎందుకు పని చేస్తుందనే దానికి సరయిన రీజనింగ్ లేదు. ఒక పోలీస్ అకారణంగా ఈ డిటెక్టివ్‌ని టార్గెట్ చేస్తే, మరో పోలీస్ అసాధారణంగా హెల్ప్ చేసేస్తుంటాడు. ఇక అన్నిటి కంటే మించి ఒక మెగా క్రైమ్‌ని ఆర్గనైజ్డ్గా చేస్తోన్న ఒక క్రిమినల్ గ్యాంగ్ ఒక చోటా మోటా డిటెక్టివ్‌ని ఫ్రేమ్ చేయడం, మళ్లీ దానికి ఎక్స్‌టెన్షన్‌గా ఇంకో పిల్ల డిటెక్టివ్‌ని రంగంలోకి దించడం… మరీ కన్వీనియంట్‌గా, సినిమాటిక్‌గా అనిపిస్తుంది.
ఇక హీరోని ఎలా చూపించాలనే దానిపై కూడా కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నట్టు అనిపిస్తుంది. అతడిని చంటబ్బాయ్లా కామెడీ డిటెక్టివ్‌లా చూపించాలా లేక షెర్లాక్ హోమ్స్ మాదిరిగా ఎక్సెంట్రిక్‌గా తీర్చిదిద్దాలా అనే దానిపై ఏర్పడిన డైలెమా వల్ల ఆరంభంలో ఈ క్యారెక్టర్ గ్రాఫ్ సవ్యంగా సాగదు. కొత్త హీరోని పెట్టుకున్నపుడు కామెడీనే సేఫ్ అనుకుని వుంటారని ఆ తప్పుని ఉపేక్షించవచ్చు. ఆరంభంలో వినోదం పాళ్లు ఎక్కువ వున్నా కానీ స్టోరీ గ్రాఫ్ అయితే పడుతూ లేస్తూ వెళుతుంటుంది. ఇంటర్వెల్లో హీరోని అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి కథ రసకందాయంలో పడుతుంది. అప్పట్నుంచి మిస్టరీని చేధిస్తూ వెళ్లే కొద్దీ అది షాకింగ్‌గా, అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తూ ఇంకా ఇంకా ఆకట్టుకుంటుంది. డీటెయిల్డ్‌గా చూపించే ఆ క్రైమ్ ఏదయితే వుందో చాలా చిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివర్లో ఆ రివీల్ ఇంకాస్త బెటర్‌గా వుంటే ఇంకా బాగుండేది కానీ అంచనాలే లేని ఓ చిన్న సినిమా స్థాయికి 'ఏజెంట్ ఆత్రేయ' చాలా వరకు ఎంటర్టైన్ చేస్తుంది, ప్రేక్షకులని ఎంగేజ్డ్గా వుంచుతుంది.
నవీన్ పొలిశెట్టి అంతగా తెలియని నటుడయినా కానీ అతనిలో టాలెంట్‌కి లోటు లేదనే సంగతి మొదటి సీన్లలోనే అర్థమైపోతుంది. చక్కని కామెడీ టైమింగ్‌కి తోడు వివిధ రకాలుగా మాట్లాడగలిగే టాలెంట్ కూడా అతని సొంతం. ఒక సీన్లో 'ఇంటిలిజెన్స్ పెంచే బుక్' అమ్మడానికి అతను చేసే ప్రయత్నం విపరీతంగా నవ్విస్తుంది. సీజన్డ్ యాక్టర్ అయితే తప్ప హోల్డ్ చేయలేని సబ్జెక్ట్‌ని నవీన్ తన ప్రతిభతో నిలబెట్టాడు. మిగిలిన తారాగణంలో ఎక్కువగా తెలిసిన ఫేస్‌లు ఏమీ లేవు. సుహాస్ మినహా మరెవరూ తమ నటనతో మెప్పించలేకపోయారు. సాంకేతిక విభాగంలో మార్క్ రాబిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పలు సుదీర్ఘమైన ఎపిసోడ్స్ డైలాగ్స్ లేకుండా కేవలం నేపథ్య సంగీతం మీదే ఆధారపడ్డాయి. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. దర్శకుడు స్వరూప్ మంచి కథాబలం వున్న చిత్రంతో కెరీర్ మొదలు పెట్టాడు. ఆ కథని ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా మంచి ప్రతిభ చూపించాడు.
ఆరంభంలో కామెడీనా, సీరియస్‌గానా అనే మీమాంసలో పడి కాస్త గందరగోళంకి గురయిన ఈ చిత్రం అసలు కథ మొదలు కావడానికి చాలా సమయం తీసుకుంది. ఇంటర్వెల్ వరకు ఓకే అనిపించినా కానీ ఆ తర్వాత మాత్రం బిగి సడలని కథనంతో ఆకట్టుకుంది. మిస్టరీ జోనర్‌ని ఇష్టపడే వారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఎన్నో డికెక్టివ్ థ్రిల్లర్స్ చూసిన వారికి కూడా ఈ చిత్రం కొత్తగా అనిపిస్తూ, తర్వాతేం జరుగుతుందో గెస్ చెయ్యనివ్వకుండా చివరి వరకు కదలకుండా కూర్చోబెడుతుంది. కొత్త వాళ్లతో తీసిన ఒక చిన్న సినిమాకి అది చాలా పెద్ద అఛీవ్‌మెంటే మరి.
బాటమ్ లైన్: ఇడుగో మన షెర్లాక్!
– గణేష్ రావూరి