సినిమా రివ్యూ: గేమ్‌ ఓవర్‌

సమీక్ష: గేమ్‌ ఓవర్‌ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తారాగణం: తాప్సీ పన్ను, వినోదిని వైద్యనాధన్‌, సంచన నటరాజన్‌, అనీష్‌ కురువిల్లా, రమ్య సుబ్రమణ్యన్‌, పార్వతి .టి తదితరులు మాటలు:…

సమీక్ష: గేమ్‌ ఓవర్‌
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: తాప్సీ పన్ను, వినోదిని వైద్యనాధన్‌, సంచన నటరాజన్‌, అనీష్‌ కురువిల్లా, రమ్య సుబ్రమణ్యన్‌, పార్వతి .టి తదితరులు
మాటలు: వెంకట్‌ కాచర్ల
కథ: అశ్విన్‌ శరవణన్‌, కావ్య రామ్‌కుమార్‌
కూర్పు: రిచర్డ్‌ కెవిన్‌ .ఏ
సంగీతం: రాన్‌ ఈధన్‌ యోహాన్‌
ఛాయాగ్రహణం: ఏ. వసంత్‌
నిర్మాత: ఎస్‌. శశికాంత్‌
దర్శకత్వం: అశ్విన్‌ శరవణన్‌
విడుదల తేదీ: జూన్‌ 14, 2019

హారర్‌ అంటే దెయ్యాలని చూసి భయపడే మనుషులని చూపించి తద్వారా వచ్చే శాడిస్టిక్‌ ప్లెజర్‌ని ఇవ్వడమే అనే రీతిలో ఆ జోనర్‌ని కిచిడీ చేసేసారు. వెన్నులోంచి వణుకు పుట్టించే నిజమైన హారర్‌ సినిమాల కంటే హారర్‌ని వెంటనే కామెడీతో డామినేట్‌ చేసే చిత్రాలనే చూసేందుకు సినీ ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు. దీని వల్ల కమర్షియల్‌గా సేల్‌ అయ్యే సినిమాలు చాలానే వస్తున్నాయి కానీ రియల్‌ హారర్‌ జోనర్‌కి వున్న కొన్ని గొప్ప లక్షణాలు హరించుకుపోతున్నాయి. హారర్‌ సినిమా చూస్తోంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయి, తెరపై పాత్రలు అనుభవిస్తోన్న భయాన్ని ప్రేక్షకులు కూడా ఎక్స్‌పీరియన్స్‌ చేయాలి. ఆడియన్స్‌తో కనక్ట్‌ ఏర్పడడం అన్ని కథల వల్ల కాదు. కానీ హారర్‌ సినిమాలు ఈజీగా ఆడియన్స్‌ని కథలో లీనం చేసి, ఆ భయంలో భాగం చేయగలుగుతాయి.

ఈ జోనర్‌ని ఇటీవలి కాలంలో అద్భుతంగా పండించిన వారిలో అశ్విన్‌ శరవణన్‌ ఒకడు. అతని 'మాయ' (తెలుగులో మయూరి) గత కొన్నేళ్లలో వచ్చిన అద్భుతమైన హారర్‌ సినిమాల్లో ఒకటి. అతని తాజా చిత్రం 'గేమ్‌ ఓవర్‌' కూడా రొటీన్‌కి భిన్నంగానే సాగుతుంది. మెజారిటీ ఆడియన్స్‌ని మెప్పించాలని కాకుండా తన కథని ఇంటిలిజెంట్‌గా చెబుతూ అర్థమైన వారు మాత్రమే ఎంజాయ్‌ చేసేలా ఈ 'గేమ్‌' తీర్చిదిద్దాడు అశ్విన్‌. వీడియో గేమ్స్‌ని కేవలం థీమ్‌గానో, బ్యాక్‌డ్రాప్‌గానో కాకుండా ప్రేక్షకులతో కూడా 'గెస్సింగ్‌ గేమ్‌' ఆడించాడు. సినిమా చూస్తున్నంతసేపు కళ్ళు దృశ్యాన్ని చూస్తోంటే, మెదడు ఆ పజిల్‌ని సాల్వ్‌ చేయడానికి లేదా ఏది సత్యమో, ఏది స్వప్నమో తర్కించుకోవడానికి తపిస్తుంటుంది. 'ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడని కథని ఇది' అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇంత ఒరిజినల్‌ స్టోరీని, ఇంత ఇన్నోవేటివ్‌గా ఈమధ్య అయితే ఎవరూ చెప్పలేదు.

ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకుని, ఇంటికే పరిమితం అయిపోయి, కేవలం ఒక హెల్పర్‌ (పేరు కలమ్మ… వినోదిని ఈ పాత్రని అత్యంత సహజంగా పోషించింది), ఒక వాచ్‌మేన్‌ సాయంతో బ్రతుకుతోన్న స్వప్న (తాప్సీ) అలా వుండడానికి కారణముంది. జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. చీకట్లో రెండు క్షణాలు కూడా వుండలేనంత భయం ఆమెకి. తన చేతికి వున్న టాటూ ఒకటి విపరీతంగా నొప్పి పెడుతూ వేధిస్తుంటుంది. ఆ టాటూ వెనక మరో కథ వుంది. చనిపోయిన వారి అస్తికలనుంచి కొంత భాగాన్ని టాటూ ఇంక్‌లో కలిపి వేయించుకుంటే వారు తమతో వున్నట్టు అనిపిస్తుందనే నమ్మకంతో 'ఇమ్మోర్టల్‌' టాటూస్‌ వేయించుకుంటూ వుంటారు కొంతమంది. అనుకోకుండా ఎవరికో అలా వేయాల్సిన టాటూ స్వప్న చేతికి వేయడంతో ఇప్పుడా సదరు ఆత్మ కూడా తనతో వుంది. కేన్సర్‌ని మూడు సార్లు జయించిన ఆమె ఆత్మ సాక్షిగా స్వప్న తన భయాలని జయించగలదా?

ఈ చిత్రం గురించి ఎక్కువ విశ్లేషిస్తే స్పాయిలర్స్‌ చెప్పాల్సి వస్తుంది. చాలా కీలక విషయాలని అసలు మాట్లాడలేని విధంగా దర్శకుడు పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో 'గేమ్‌ ఓవర్‌' నడిపించాడు. సెకండ్‌ హాఫ్‌ టోటల్‌గా ఒక గేమ్‌ తెరపై జరుగుతున్నట్టే వుంటుంది. ఆ గేమ్‌ తాలూకు క్లూస్‌ అన్నీ మనకి ఫస్ట్‌ హాఫ్‌లో ఇచ్చేసి వుంటాడు. డీటెయిల్స్‌పై కూడా ఎంత ఫోకస్‌ అవసరం అంటే… గోడలపై తగిలించిన ఫ్రేమ్స్‌లో కోట్స్‌ కూడా క్లూసే అన్నమాట. పజిల్‌ సాల్వ్‌ చేయడానికి అవి కూడా హెల్ప్‌ అవుతాయి. ఏమాత్రం అటెన్షన్‌ పే చేయకపోయినా, డీటెయిల్స్‌పై దృష్టి లేకపోయినా ఏమి జరుగుతుందో అర్థం కాని గందరగోళం నెలకొనే అవకాశముంది. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సెకండ్‌ హాఫ్‌ గేమ్‌కి సెటప్‌ లాంటిది. అది కాస్త డీటెయిల్డ్‌ సాగుతోంటే మధ్యలో కాస్త విసుగనిపిస్తుంది కానీ మొత్తం సినిమా చూసిన తర్వాత ప్రతి ఎలిమెంట్‌, ప్రతి డైలాగ్‌ ఎంత కీలకమో అర్థమవుతుంది.

సినిమా పూర్తయిన తర్వాత కూడా ఏమి జరిగింది, ఎందుకు జరిగింది అంటూ తర్కించుకుని సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది ఏ జోనర్‌కి చెందిన చిత్రమనేది చెప్పడం కూడా కష్టమే. వివిధ జోనర్స్‌ని మిక్స్‌ చేస్తూ దర్శకుడు ఓ రసవత్తరమయిన గేమ్‌ ఆడాడు. ఈ చిత్రం చూడదలిస్తే ఒంటరిగా వెళ్లడం కంటే గ్యాంగ్‌తో వెళితే ఎక్కువ ఎంజాయ్‌ చేయవచ్చు. చూసేటప్పుడు కంటే చూసేసి బయటకి వచ్చినపుడు ఆ డిస్కషన్స్‌తో, ఎవరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ ఏమిటో చర్చించుకునేలా 'గేమ్‌' ఆడించారు. హారర్‌, థ్రిల్లర్‌ జోనర్స్‌కి చెందిన ఎలిమెంట్స్‌ డామినేట్‌ చేసినా ప్రధానంగా ఒక బలమైన సోషల్‌ మెసేజ్‌ కూడా ఇచ్చారు. ఆడవాళ్లు తమ సమస్యలపై తామే పోరాడాలని, ఒక సంఘటన జరిగిపోయాక అలా చేసి వుంటే బాగుండేది, ఇలా చేయకుండా వుండాల్సింది అంటూ ఆలోచించుకోకుండా దానినుంచి బయట పడాలని ఒక స్ట్రాంగ్‌ మెసేజ్‌ అంతర్లీనంగా వుంది.

తాప్సీ నటిగా చాలా పరిణితి సాధించింది. ముఖ్యంగా స్ట్రాంగ్‌ విల్‌ చూపించే పాత్రల్లో మెప్పిస్తోంది. అయితే భయాన్ని, పిరికితనాన్ని అభినయించడంలో ఇంకాస్త మెరుగు పడాలి. కథ సాంతం తాప్సీ, ఆమె మెయిడ్‌గా నటించిన వినోదిని చుట్టూ పరిభ్రమిస్తుంది. మిగతా పాత్రలన్నీ కథని ముందుకి నడిపించే టూల్స్‌గా పని చేస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కింది. సినిమాటోగ్రఫీ మూడ్‌కి తగ్గట్టు వుంటూ లీనం చేయడమే కాకుండా పాత్రల మానసిక పరిస్థితిని మనం కూడా ఫీలియ్యేలా చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా బాగుంది. సౌండ్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా కుదిరాయి. ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా వుంది.

దర్శకుడు అశ్విన్‌ మరోసారి కమర్షియల్‌ సక్సెస్‌ కోసమని కాకుండా తన సినిమాతో ఆడియన్స్‌కి విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలి, వారిని తన గేమ్‌లో భాగం చేయాలని ట్రై చేసాడు. అయితే ఈ క్రమంలో ఇంత ఫోకస్‌తో సినిమా చూడమని పరీక్ష పెట్టడం వల్ల ఇందులో పాస్‌ అయ్యే వాళ్లు ఎక్కువ మంది వుండరు. పజిల్‌ సాల్వ్‌ చేసిన వారి కంటే ఏమి జరిగిందా అని తెల్ల ముఖం వేసేవాళ్లే ఎక్కువ వుంటారు.

బాటమ్‌ లైన్‌: క్లెవర్‌ గేమ్‌!
– గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: 7      సినిమా రివ్యూ: హిప్పీ