బ్రోతో 40% న‌ష్టాలు…చెల్లిస్తావా ప‌వ‌న్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ చెల‌రేగిపోయారు. పెద్ద‌గా మీడియాతో మాట్లాడ‌ని విశాఖ ఎంపీ, త‌న‌పై ప‌వ‌న్ అవాకులు చెవాకులు పేల‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో ఆయ‌న మీడియా ముందుకొచ్చి ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్‌ను,…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ చెల‌రేగిపోయారు. పెద్ద‌గా మీడియాతో మాట్లాడ‌ని విశాఖ ఎంపీ, త‌న‌పై ప‌వ‌న్ అవాకులు చెవాకులు పేల‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో ఆయ‌న మీడియా ముందుకొచ్చి ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్‌ను, త‌న మంచి త‌నాన్ని చూసి విశాఖ ప్ర‌జ‌లు త‌న‌ను ఎంపీగా గెలిపించార‌ని ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ అన్నారు. 2019 నుంచి త‌న కార్యాల‌యంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్ర‌తి ఫోన్ కాల్‌ను అటెండ్ చేస్తాన‌న్నారు. నువ్వెప్పుడైనా అందుబాటులో ఉన్నావా? అని ప‌వ‌న్‌ను ఆయ‌న నిల‌దీశారు.

గాజువాక‌లో ఓడిపోయిన త‌ర్వాత ఏ ఒక్క‌రితోనైనా మాట్లాడావా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గాజువాక నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి ప‌రిశీలించావా? అని ఆయ‌న నిల‌దీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బీజేపీ ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రిస్తుంటే నువ్వెందుకు అడ్డుకోలేద‌ని ఎంపీ ప్ర‌శ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రిస్తే మీతో క‌లిసి ఉండ‌న‌ని బీజేపీకి ఎందుకు హెచ్చ‌రిక ఇవ్వ‌లేక‌పోతున్నావ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. విశాఖ‌ను విడిచి పారిపోతాన‌ని ఏనాడూ తాను చెప్ప‌లేద‌న్నారు.

విశాఖ‌లో రాజ‌కీయాలు చేస్తాన‌ని, వ్యాపారాలు మాత్రం కొన్ని కార‌ణాల వ‌ల్ల చేయ‌న‌ని అన్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. దాన్ని వ‌క్రీక‌రించి మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ నుంచి పారిపోయేంత‌గా తాను త‌ప్పులు చేయ‌లేద‌న్నారు. ఎంపీగా రాజీనామా చేయాల‌ని అడ‌గడానికి నువ్వెవ‌ర‌ని ప‌వ‌న్‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. నువ్వేమైనా ఓటేశావా? మ‌ద్ద‌తు ఇచ్చావా? అని నిల‌దీశారు. ఆరు నెల‌ల్లో ఎన్నిక‌లున్నాయ‌ని గాజువాక‌లో నాగిరెడ్డిపై లేదా, విశాఖ ఎంపీ అభ్య‌ర్థిగా ద‌మ్ముంటే త‌న‌పై పోటీ చేయాల‌ని ప‌వ‌న్‌కు ఆయ‌న స‌వాల్ విసిరారు.

రెండు చోట్ల నిలిచి ఓడిపోయి, ఒకే ఒక్క సీటు గెలిపించుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ విశాఖ వ‌చ్చి క‌బుర్లు చెబుతున్నార‌ని ఎంపీ స‌త్య‌నారాయ‌ణ విరుచుకుప‌డ్డారు. సిగ్గులేదా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గాజువాక‌లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌లేద‌న్నారు. వ్యాపారాలు చేయ‌డానికి ఎంపీ అయ్యింద‌ని ప్ర‌శ్నించ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. 25 ఏళ్లుగా విశాఖ‌లో నిర్మాణ రంగంలో ఎంతో మందికి ఉపాధి క‌ల్పిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

రాజ‌కీయాల్లో వుంటూ నువ్వెందుకు సినిమాలు చేస్తున్నావ‌ని ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. నువ్వు చేసేది వ్యాపారం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సినిమాల్లో న‌ష్టం వ‌స్తే క‌నీసం వెన‌క్కి డ‌బ్బు కూడా ఇవ్వ‌వని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ న‌టించిన‌ బ్రో అనే సినిమా వ‌ల్ల 30 నుంచి 40 శాతం న‌ష్ట‌పోయార‌ని, వాళ్ల‌కు తిరిగి ఇవ్వాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు.

త‌న‌కు ధైర్యం లేద‌ని, అస‌మ‌ర్థుడ‌ని విమ‌ర్శించ‌డంపై ఎంపీ మండిప‌డ్డారు. ప‌వ‌న్‌కు ద‌మ్ము, ధైర్యం వుంటే సింగిల్‌గా 175 స్థానాల్లో పోటీ చేయాల‌ని ఎంపీ స‌వాల్ విసిరారు. టీడీపీ మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నావ‌ని ప్ర‌శ్నించారు. టీడీపీ ఇచ్చే 25 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్ల కోసం టీడీపీని ఎందుకు దేబిరిస్తున్నావ‌ని ప‌వ‌న్‌ను నిల‌దీశారు. 

రాష్ట్రంలోని కాపు కుల‌స్తుల ఆత్మాభిమానాన్ని తాక‌ట్టు పెట్టావ‌ని విరుచుకుప‌డ్డారు. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు చంద్ర‌బాబు బూట్లు నాకుతున్నావ‌ని ఆరోపించారు. అస‌లు నీది మ‌నిషి జ‌న్మేనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.