స్టార్లూ…ఈ రీమేక్ ల‌ను ఆపండ‌య్యా!

స్టార్ హీరోలు మార‌డం లేదు.. అని ప‌దే ప‌దే అనుకోవ‌డం క‌న్నా, వీళ్లు మార‌రు అని ఫిక్స‌వ్వ‌డం మంచిది. తెలుగులో ఏ స్టార్ హీరో సినిమా వ‌చ్చినా.. ఇదే చ‌ర్చ‌! ఆరు పాట‌లు, నాలుగు…

స్టార్ హీరోలు మార‌డం లేదు.. అని ప‌దే ప‌దే అనుకోవ‌డం క‌న్నా, వీళ్లు మార‌రు అని ఫిక్స‌వ్వ‌డం మంచిది. తెలుగులో ఏ స్టార్ హీరో సినిమా వ‌చ్చినా.. ఇదే చ‌ర్చ‌! ఆరు పాట‌లు, నాలుగు ఫైట్లు.. బిల్డ‌ప్ ఇస్తూ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్, ఫైట‌ర్లు బౌన్స్ అయ్యే ఫైట్లు.. ఇదే తెలుగు సినిమాకు ముడిస‌రుకు. ఇది మురిగిపోతున్నా.. దీన్నే వాడుతూ సినిమాల‌ను రూపొందించ‌డం తెలుగు సినిమా హీరోల‌కు అల‌వాటు. ఇదే రీతిన ష‌రామామూలుగా మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా భోళా శంక‌ర్ నిలుస్తోంది. తెలుగు సినిమా హీరోల‌ను నిందించ‌ద‌గిన మ‌రో అంశం రీమేక్!

ఓటీటీలు విస్తృతం అయ్యి ఇప్ప‌టికే నాలుగైదేళ్లు గ‌డిచిపోయాయి. ఇలాంటి కాలంలో కూడా ఇంకా రీమేక్ లు చేయాల‌నే తెలుగు స్టార్ హీరోల ఐడియాకు ఒక దండం పెట్టాలి! ఒక‌వైపు ఓటీటీల్లో ప్రేక్ష‌కులు ప్రపంచ సినిమాల‌న్నింటినీ వీక్షిస్తూ ఉన్నారు. ఓటీటీల ప్ర‌భావం వ‌ల్ల వారి టేస్ట్ పూర్తిగా మారిపోయింది. అర్రీబుర్రీ సినిమాలు చేస్తే ఎగ‌బ‌డి చూసే రోజులు పోయాయి. 

త‌న రోజులో రెండున్న‌ర గంట‌ల పాటు స‌మయం వెచ్చించి, టికెట్ కొని, మ‌ల్టీప్లెక్స్ కు వెళ్లాలంటే ప్రేక్ష‌కుడి ఎక్స్ పెక్టేష‌న్స్ లో ఒక‌టే ఉంటుంది. అదే వైవిధ్యం! కింద‌టి వారం చూసిన త‌ర‌హా సినిమానే మ‌రోటి చూడాలంటే కూడా ఎవ్వ‌రికీ ఆస‌క్తి ఉండ‌దు. అయితే తెలుగు స్టార్ హీరోలు మాత్రం ముప్పై న‌ల‌భై యేళ్ల నాటి త‌ర‌హా కాన్సెప్ట్ ల‌తోనే మాస్ మ‌సాలాల పేరిటీ అదే త‌ర‌హా సినిమాల‌తో వ‌స్తున్నారు! ఈ సినిమా బాక్సాఫీస్ ఫ‌లితాలు కూడా హీరోల టేస్టును మార్చ‌డం లేదు పాపం!

రీమేక్ సినిమాలు తెలుగు స్టార్ హీరోల చేత‌గాని త‌నానికి నిద‌ర్శ‌నం. సొంత క‌థ‌ల‌ను వెదుక్కునే ఓపిక లేక‌, త‌మ‌ను ప్రేక్ష‌కులు చూస్తారో లేదో అనే ధైర్యం లేక‌, కొత్త‌గా చేయాల‌న్న సృజ‌న లేక తెలుగు హీరోలు రీమేక్ సినిమాల‌ను ఎంచుకుంటున్నార‌నేది కాద‌న‌లేని వాస్త‌వం. తెలుగు నుంచి ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన సినిమాలెన్నో వ‌చ్చాయి. త‌మ కెరీర్ లో ఈ హీరోలు కూడా అలాంటి సినిమాలు కొన్ని చేసిన వారే! అయితే.. ఈ త‌రంలో కూడా రీమేక్ సినిమాల‌ను ఎన్నుకుంటున్న వీరు తీరు మాత్రం… ఇక వేరే ఏం చేయ‌లేక రీమేక్ లు చేస్తున్నార‌ని అనుకోవాల్సి వ‌స్తోంది.

మ‌రి ఆ రీమేక్ ల‌ను అయినా స‌వ్యంగా చేస్తున్నారా.. అంటే, అయితే.. ఒరిజిన‌ల్స్ ను దారుణంగా చెడ‌బెట్ట‌డం, లేదంటే య‌థాత‌థంగా మ‌క్కికిమ‌క్కి దించే క్ర‌మంలో ఒరిజిన‌ల్ లో ఉన్న ఫీల్ ను క్యారీ చేయ‌లేక‌పోవ‌డం! ఇదీ తెలుగులో గ‌త కొంత‌కాలంలో వ‌చ్చిన రీమేక్ ల ప‌రిస్థితి. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి క‌న్నడ చిత్ర సీమ‌కు ఉండేది. క‌న్న‌డ‌నాట 90 శాతం రీమేక్ లు వ‌చ్చేవి ఒకానొక ద‌శ‌లో. 

త‌మ కెరీర్ ఆరంభంలో గొప్ప సినిమాలు, వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలు చేసిన విష్ణువ‌ర్ధ‌న్, ఉపేంద్ర లాంటి హీరోలు కూడా ఆ త‌ర్వాత క‌న్న‌డ నాట రీమేక్ ల బాట ప‌ట్టారు. రీమేక్ సినిమాల మీద ఆధార‌ప‌డ్డారు. స్టార్ హీరోలే ఈ ప‌ని చేస్తూ ఉండ‌టంతో.. క‌న్న‌డ నాట ఏ సినిమా వ‌చ్చినా అది మ‌రేదో సినిమాకు రీమేక్ గానే వ‌చ్చింది. అలా ద‌శాబ్దాల పాటు.. రీమేక్ సినిమాల‌తో ప‌రిశ్ర‌మ విసిగించ‌డంతో ప్రేక్ష‌కుల‌కు త‌మ ఇండ‌స్ట్రీ అంటేనే ఏవ‌గింపు మొద‌లైంది!

ప్రేక్ష‌కులు ప‌క్క భాష‌ల వైపు మ‌ళ్లారు. రీమేక్ ల‌ను చూడ‌లేమ‌ని ఒరిజిన‌ల్స్ ను చూడ‌టానికి ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. దీంతో క‌ర్ణాట‌క‌లో తమిళ‌, తెలుగు, మ‌ల‌యాళీ, హిందీ సినిమాలు రాజ్య‌మేల‌డం మొద‌లైంది. సిటీల్లోనూ, స‌రిహ‌ద్దుల్లోనే కాదు.. రూర‌ల్ ఏరియాల్లో, క‌ర్ణాట‌క లోప‌లి వైపున కూడా తెలుగు సినిమాలు డైరెక్టుగా విడుద‌ల‌య్యాయి. అప్ప‌టికే డ‌బ్బింగుల‌ను నిషేధించారు క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ వారు. దీంతో డైరెక్టుగా ఆయా భాష‌ల్లోనే సినిమాలు విడుద‌ల కావ‌డం స‌హ‌జంగా మారింది. ఫ‌లితంగా క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ విస్తృతి కుంచించుకుపోయింది. క‌న్న‌డ సినిమాల మార్కెట్ డౌన్ అయ్యింది. ఇలా ద‌శాబ్దాల పాటు క‌న్న‌డ సినిమా చిన్న‌బోయింది. 

హీరోలేమో రీమేక్ ల‌ను వ‌ద‌ల‌రు. ప్రేక్ష‌కుల‌కేమో వాటిని చూడ‌టమే ఇష్టం లేదు. ఏదో ఏడాదికో స్ట్రైట్ సినిమా హిట్ అయితే, ప‌దేళ్ల‌కు ఒక చెప్పుకోద‌గిన సినిమా వ‌స్తే అదే గొప్ప అనేంత స్థాయిలో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ దుస్థితిని అనుభ‌వించింది. ఇప్పుడిప్పుడు అక్క‌డే ప‌రిస్థితి మారుతోంది. కేజీఎఫ్, కాంతర వంటి సినిమాల‌తో క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ త‌న ద‌శాబ్దాల దాస్యాన్ని వ‌దిలించుకుంటోంది. అయితే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో స్టార్ హీరోల రీమేక్ ల ఉబ‌లాటం మ‌రో క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయికి తీసుకెళ్తున్న‌ట్టుగా ఉంది.

ఓటీటీలు లేని రోజుల్లోనే క‌న్న‌డ చిత్ర ప్రేమికులు రీమేక్ ల‌ను వ్య‌తిరేకించారు. త‌మ వాళ్లు తీసే సినిమాల‌ను లైట్ తీసుకున్నారు. అయితే తెలుగు స్టార్ లు ఓటీటీ యుగంలో రీమేక్ ల‌ను త‌గులుకుంటున్నారు. ప్రేక్ష‌కుల‌ను విసిగిస్తూ ఉన్నారు!