Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇక ఏపీలో బండి సంజయ్‌ రాజకీయాలు...?

ఇక ఏపీలో బండి సంజయ్‌ రాజకీయాలు...?

రాజకీయాలంటేనే ఊహించని మలుపులు తిరిగే ఉత్కంఠభరిత సినిమా అని చెప్పకోవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు కీలక స్థానంలో ఉంటాడో, ఏ నాయకుడు ఎప్పుడు కిందికి జారుతాడో తెలియదు. ఇప్పుడు కొత్తగా బీజేపీ జాతీయ కార్యదర్శి అయిన తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌ బండి సంజయ్‌ పరిస్థితి అలాగే ఉంది. 

ఆయన్ని ఉన్నట్టుండి హైకమాండ్‌ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించినప్పుడు కాషాయం నేతలే ఆశ్చర్యపోయారు. సామాన్య ప్రజలు కూడా ఏమిటి ఇలా జరిగిందని అనుకున్నారు. బండి కూడా అవేదన చెందాడు. పార్టీకి కమిటెడ్‌ నాయకుడు కాబట్టి గమ్మున ఉండిపోయాడు. మరో పార్టీలో అయితే తిరుగుబాటు జరిగేదే. 

బండి సంజయ్‌ మార్పు వెనుక సీఎం కేసీఆర్‌ మంత్రాగం ఉదంటారు. అది నిజమో కాదో చెప్పలేం. తెలంగాణలో బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మంచి ఊపు మీద ఉన్న సమయంలో హఠాత్తుగా మార్పు జరగడం నిజంగా పెద్ద షాక్‌. అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుందని మీడియాలోనూ కథనాలు వచ్చాయి. బండిని తప్పించడంవల్ల తెలంగాణలో బీజేపీ నష్టపోతుందనే  అభిప్రాయం వ్యక్తమైంది.

కొత్త అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బండితో కంపేర్‌ చేసుకుంటే చాలా సౌమ్యుడు. బీఆర్‌ఎస్‌పైన, కేసీఆర్‌పైన దూకుడుగా వ్యవహరించలేడు. అధ్యక్షుడయ్యాక బీఆర్‌ఎస్‌ పైన గట్టిగా మాట్లాడిన దాఖలాలు కనబడలేదు. మరి ముందు ముందు ఏం చేస్తాడో చూడాలి. అధిష్టానం బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అంతటితో ఊరుకోలేదు. ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించిన హైకమాండ్‌  ఆ స్థానంలో పురందేశ్వరిని నియమించింది. కాని ఏపీలో పార్టీని పురందేశ్వరి పైకెత్తలేదు. అది ఆమె వల్ల అయ్యే పని కాదు.

అందుకే ఏపీ బీజేపీ ఇన్‌చార్జిగా బండి సంజయ్‌ని నియమించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పురందేశ్వరికి తోడు ఓ ఫైర్‌బ్రాండ్‌ అవసరమని ఢిల్లీ పెద్దలు భావించి ఉండొచ్చు. అక్కడ పార్టీ గెలుస్తుందా, ఓడుతుందా అనేది వేరే సంగతి. కాని తెలంగాణలో మాదిరిగా పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చే నాయకుడు కావాలి. అందుకే ఇన్‌చార్జిగా బండి నియమంచాలనే ఆలోచన  చేసి ఉండొచ్చు. ఏపీ ఇంఛార్జిగా ఉన్న సునీల్‌ దేవ్‌ధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని బండితో భర్తీ చేయనున్నట్లు పార్టీ ఇంటర్నల్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఏపీలో జనసేనతో కలిసి  బీజేపీ రాజకీయ ప్రయాణం చేస్తోంది. అఫ్‌కోర్స్‌ ఈ పొత్తు నామమాత్రంగానే ఉందనుకోండి.  అది వేరే విషయం. టీడీపీతో పొత్తు పైన స్పష్టత రావాల్సి ఉంది. 

ఇదే సమయంలో కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉంటూనే ఇన్‌ఛార్జ్‌గా చురుగ్గానే వ్యవహరించేవారు. కానీ, కొంత కాలంగా మూడు నెలలకొకసారి కూడా ఏపీకి రావడంలేదు. కాగా ఏడాదిన్నరగా ఏపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించమని పార్టీ హైకమాండ్‌ను మురళీధరన్ కోరుతున్నారని సమాచారం. బీజేపీలో గత ఎన్నికల తరువాత చేరిన కొందరి నేతల తీరు..రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను సహ ఇన్‌ఛార్జ్‌లని మార్చడానికి బీజేపీ అధిష్టానం‌ కసరత్తులు చేస్తోంది. 

ఏపీ నుంచి తనని తప్పించాలని మురళీధరన్‌  కోరుతుండటంతో కొత్త ఇంఛార్జ్ నియమాకం పైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా బండి సంజయ్ ను నియమించే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ దూకుడుతో పార్టీకి మైలేజ్ వచ్చింది. ఏపీ బీజేపీలోనూ సంజయ్ కు ఆదరణ ఉంది. ఇదే సమయంలో పొత్తు రాజకీయం.. ఎన్నికల సమయం కావటంతో ఏపీ బాధ్యతలు అప్పగించటం ద్వారా అటు తెలంగాణ.. ఇటు ఏపీలోనూ బండి సంజయ్ నియామకం పార్టీకి మేలు చేస్తుందని లెక్కలు వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?