మేం గిల్లుతాం.. గిల్లించుకోవాలి! ఇదేనా మెగా బ్ర‌ద‌ర్స్ తీరు?

రాజ‌కీయ నేత‌లు రాష్ట్రం గురించి మాట్లాడాలి కానీ సినిమాల గురించి కాదంటూ మెగాస్టార్ నీతులు బాగా వ‌ల్లెవేశారు! మ‌రి సినిమా ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని ఉద్ధ‌రిస్తానంటూ రాజ‌కీయంలోకి వ‌చ్చింది ఈయ‌నేనా! అని జ‌నాలు…

రాజ‌కీయ నేత‌లు రాష్ట్రం గురించి మాట్లాడాలి కానీ సినిమాల గురించి కాదంటూ మెగాస్టార్ నీతులు బాగా వ‌ల్లెవేశారు! మ‌రి సినిమా ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని ఉద్ధ‌రిస్తానంటూ రాజ‌కీయంలోకి వ‌చ్చింది ఈయ‌నేనా! అని జ‌నాలు ఆలోచించ‌ర‌నేది చిరంజీవి ఫీలింగ్ కాబోలు! సినిమాల్లో హీరోయిజాన్ని పండించి, దాన్ని అడ్డం పెట్టుకునే రాజ‌కీయ పార్టీ పెట్టి సీఎం అయిపోవాల‌ని క‌ల‌లు గ‌న్న‌ది! ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు పార్టీ పెట్టింది అందుకే క‌దా.. మ‌రి ఈయ‌నేంటి ఇప్పుడు సినిమాలు, రాజ‌కీయాల‌కు మ‌ధ్య‌న హ‌ద్దులు, స‌రిహ‌ద్దుల గురించి మాట్లాడారు!

చిరంజీవి త‌న‌కు రాజ‌కీయాల‌తో సంబంధం లేదంటూ ప్ర‌క‌టిస్తే అందులో ఏదో హుందాత‌నం అంటారంతా. అయితే పొలిటిక‌ల్గా సక్సెస్ కాలేక చిరంజీవి ఆ వైరాగ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు కొంత‌కాలం పాటు. అయితే ఇప్పుడు త‌మ్ముడు పార్టీతో చిరంజీవికి ఆ వైరాగ్యం ఏమైనా వీడిన‌ట్టుగా ఉంది. అయితే త‌మ్ముడేమో.. ప్ర‌జారాజ్యం పార్టీ ని ఆ రోజు విలీనం చేయ‌క‌పోతే అంటారు! నాడు చిరంజీవి పార్టీలో ప‌ని చేసిన వారిని తిడ‌తాడు. విలీనం చేసింది మ‌రెవ‌రో కాద‌య్యా మీ అన్న‌య్యే అని ఆ త‌మ్ముడికి ఎవ్వ‌రూ చెప్ప‌రు కాబోలు. ప‌దేళ్లుగా రాజ‌కీయంగా త‌ను సాధించింది ఏమీలేక‌పోయినా.. ప్ర‌జారాజ్యం పార్టీ విలీనం కాక‌పోతే.. అన‌డం అదేదో సామెత‌ను గుర్తు  చేస్తుంది!

ఈ మ‌ధ్య‌నే ఒక వీర మ‌హిళ మాట్లాడుతూ.. ప్ర‌జారాజ్యం విలీనం విష‌యంలో చిరంజీవిని నిందించింది. అదీ అక్క‌డ ప‌రిస్థితి! ఇంత‌లో అన్న‌య్య గారు పారితోషికాల గురించి మాట‌లెందుకు, అస‌లు మా సినిమాల గురించినే మీకెందుకు అంటున్నారు! స‌రే చెడును చెవిలో చెప్పు, మంచిని మైకులో చెప్పు అంటూ మా రాజ‌కీయాల్లో కూడా సూక్తులు చెప్పిన చిరంజీవి గారికి ఇటీవ‌లి వ్య‌వ‌హారంలో గిల్లింది ఎవ‌రో తెలీదా! సినిమాలు తీసే అవ‌కాశం ఉంది క‌దా.. అని చెప్పి త‌మ‌కు ప‌డ‌ని వారి పాత్ర‌ల‌ను సినిమాల్లో పెట్టి వారిని గిల్ల‌డం క‌రెక్టేనా! టాలీవుడ్ మెగాస్టార్ దీన్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్టేనా!

మేం గిల్లుతాం, మీరు గిల్లించుకోవాలి.. మ‌ళ్లీ మ‌మ్మ‌ల్ని ఏదైనా అంటే గ‌గ్గోలు పెడ‌తాం అంటే ఎలా సారూ! చాలా మంది ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్ పై వ్యంగ్యంగా సినిమాలు తీశార‌ని ఆయ‌నేం అన‌లేద‌నే వాద‌న‌నూ వినిపిస్తూ ఉన్నారు. అయితే .. తెలుగుదేశం ఏమీ త‌క్కువ తిన‌లేదు! టీడీపీ వ్య‌వ‌హారాలు ఇన్ డైరెక్టుగా ఉంటాయి. 

ఎన్టీఆర్ మ‌న‌వ‌ళ్ల‌లో ఒక‌డైన క‌ల్యాణ్ రామ్ ఒక సినిమా తీశాడు. దాని పేరు హ‌రేరామ్. అందులో విల‌న్ పేరు రెడ్డి. అత‌డు సీఎం. అత‌డి వెంట ఉండే పీఏకు అచ్చం వైఎస్ స‌హాయ‌కుడిగా ఉండిన సూరీడు త‌ర‌హా మేక‌ప్ వేశారు. ఈ సీఎం త‌మ్ముడు ఒక డాక్ట‌ర్ అట‌. అత‌డు మ‌నుషుల‌పై ఏవేవో ప్ర‌యోగాలు చేస్తూ ఉంటాడ‌ట‌! ఆ క‌ళాఖండం ఆడ‌లేదు. కాబ‌ట్టి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ఆ సినిమా వ‌చ్చింది. సీఎం పాత్ర‌ధారిని విల‌న్ గాచూపుతూ, అత‌డి పేరును రెడ్డిగా సంబోధిస్తూ.. మ‌నుషుల‌పై క్రూర‌మైన ప్ర‌యోగాలు చేసే గ్యాంగ్ గా అలా చూప‌డం .. సూరీడు గెట‌ప్ ను విల‌న్ పీఏకు వేయ‌డం.. దీన్నేమ‌నాలి!

ఇక ఆర్జీవీ సినిమాలు తీశాడు క‌దా.. త్రివిక్ర‌మ్ తీస్తే త‌ప్పా.. అంటే, ఆర్జీవీ తీయ‌బోయే సినిమాల‌ను గ‌ట్టిగా స‌మ‌ర్థిస్తున్న‌ట్టుగా ఉందీవాద‌న‌!

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ మొన్న‌టి వ‌ర‌కూ త‌న రాజ‌కీయ స్టామినా అంతా ఇంతా అని సినిమాల్లో డైలాగులు పెట్టించుకున్నాడు. తీరా సినిమాల బ‌య‌ట రెండు చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తే క‌నీసం ఒక్క చోట గెల‌వ‌లేపోయాడు. అలాంటి అవ‌మాన‌క‌ర‌మైన ఓట‌మి త‌ర్వాత‌.. ఇంకా త‌న గురించి డైలాగులు రాయించుకుంటే తేడా కొడ‌తాయ‌ని అర్థం అయ్యింది. దీంతో చేసేది లేక ప్ర‌త్య‌ర్థుల‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు, వారి పేర్ల‌ను వాడుకోవ‌డం ద్వారా తృప్తి పొందుతూ ఉన్నాడు. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టామినా ఇలా సినిమాల్లో సీన్ల‌ను పెట్టి సంతృప్తి చెంద‌డంతోనే ముగిసిపోతుంది కాబోలు!

హిమ‌