బీజేపీకి షాక్‌!

తెలంగాణ‌లో బీజేపీకి మ‌రో షాక్‌. ఆ పార్టీకి సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి పంపారు. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ బీజేపీ…

తెలంగాణ‌లో బీజేపీకి మ‌రో షాక్‌. ఆ పార్టీకి సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి పంపారు. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ బీజేపీ బ‌ల‌ప‌డ‌క‌పోగా, ఒక్కొక్క‌రుగా రాజీనామా చేయ‌డం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌రోవైపు బీఆర్ఎస్‌, బీజేపీ అసంతృప్త నేత‌లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూప‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పొచ్చు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, అలాగే మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు త‌దిత‌ర బ‌ల‌మైన నాయ‌కులు కూడా కాంగ్రెస్‌లో చేర‌డం ద్వారా బీఆర్ఎస్‌కు ప్ర‌ధాన ప్ర‌త్యామ్నాయం ఆ పార్టీనే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. దుబ్బాక‌, హుజూరాబాద్ త‌దిత‌ర ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపుతో తెలంగాణ‌లో ఆ పార్టీనే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని అంతా భావించారు. కానీ రోజులు గ‌డిచేకొద్ది తెలంగాణ పొలిటిక‌ల్ సీన్ మారుతోంది.

ముఖ్యంగా క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. బీఆర్ఎస్‌ను వ‌ద్దనుకుంటున్న వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ క‌డుతున్నారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన చంద్ర‌శేఖ‌ర్ కూడా కాంగ్రెస్‌లో చేర‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఈయ‌న ఐదుసార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. ఒక‌ప్పుడు టీఆర్ఎస్‌లో ప్ర‌ముఖంగా ఉన్నారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరి, అక్క‌డ ప‌నిచేసే వారికి ప్రోత్సాహం లేదంటూ రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్‌లో ఆయ‌న ప్ర‌స్థానం త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.