ఓడించిన ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ చేతిలో తిట్లు త‌ప్ప‌వా?

మూడో విడ‌త వారాహి యాత్ర ప్ర‌స్తుతం విశాఖ జిల్లాలో సాగుతోంది. ప‌వ‌న్ గొప్ప‌త‌నం ఏంటంటే త‌న అభిమానుల్ని, ప్ర‌జ‌ల్ని కూడా తిట్ట‌గ‌ల‌రు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడ్దామ‌నుకుంటే, కార్మికులు క‌లిసి రావ‌డం లేద‌ని విమ‌ర్శించే…

మూడో విడ‌త వారాహి యాత్ర ప్ర‌స్తుతం విశాఖ జిల్లాలో సాగుతోంది. ప‌వ‌న్ గొప్ప‌త‌నం ఏంటంటే త‌న అభిమానుల్ని, ప్ర‌జ‌ల్ని కూడా తిట్ట‌గ‌ల‌రు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడ్దామ‌నుకుంటే, కార్మికులు క‌లిసి రావ‌డం లేద‌ని విమ‌ర్శించే గ‌డుస‌రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. త‌న స‌భ‌ల‌కు జ‌నం వ‌స్తార‌ని, ఓట్లు మాత్రం జ‌గ‌న్‌కే వేస్తార‌ని, ఇలాగైతే తానెలా గెలుస్తాన‌ని వారి మొహం మీదే నిష్టూర‌మాడ‌డం ప‌వ‌న్‌కే చెల్లింది. అభిమానుల్ని న‌మ్ముకుని ఒంట‌రిగా పోటీ చేస్తే వీర‌మ‌ర‌ణం త‌ప్ప‌, చ‌ట్ట స‌భ‌లో అడుగు పెట్టే ప‌రిస్థితి వుండ‌ద‌ని నిజాల్ని నిర్భ‌యంగా బ‌హిరంగంగా మాట్లాడే అజ్ఞానం ప‌వ‌న్ సొంతం.

అలాంటి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇవాళ గాజువాక వెళుతున్నారు. సాయంత్రం అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించ‌నున్నారు. 2019 ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రంతో పాటు గాజువాక‌లో ఆయ‌న పోటీ చేసి ఓడిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఓట‌మి తాలూకూ గాయాలు ఆయ‌న్ని బాధ‌పెడుతూ వుంటాయి. గాజువాక‌లో మైకు ప‌డితే ఊగిపోవ‌డం ఖాయం. త‌న‌ను ఓడించిన ప్ర‌జ‌ల‌పై తిట్లు గ్యారెంటీ అనే చ‌ర్చ న‌డుస్తోంది.

సాధార‌ణంగా ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌ను ఏ నాయ‌కుడైనా దేవుళ్ల‌తో పోలుస్తుంటారు. స‌మాజాన్ని ఆల‌యంగా ప‌రిగ‌ణిస్తుంటారు. ఇవ‌న్నీ మ‌న క‌ల్యాణ్‌కు అస‌లు గిట్ట‌దు. మ‌న‌సులో క‌లిగిన భావాల‌ను బ‌య‌ట పెట్ట‌డం ఒక్క‌టే ఆయ‌న‌కు తెలుసు. ఎవ‌రేమ‌నుకుంటార‌నేది ఆయ‌న‌కు అన‌వ‌స‌రం. తాను ఏమ‌నుకుంటున్నార‌నేదే ప్ర‌ధానం. అందుకే ఆయ‌న ప్ర‌సంగాల్లో చాలా సంద‌ర్భాల్లో అజ్ఞానం రాజ్య‌మేలుతోంటోంది. తానొక అపార‌మైన జ్ఞాన సంప‌న్నుడ‌ని ప‌వ‌న్ భ్ర‌మ‌ల్లో వుంటారు. ఆ జ్ఞానం తాలూకూ మాట‌లే వ‌లంటీర్ల‌పై అవాకులు చెవాకుల‌నే విమ‌ర్శ వుంది.

గాజువాక ప్ర‌జ‌లు క‌నీసం త‌న‌నైనా ఎమ్మెల్యేగా గెలిపించి వుంటే ఇవాళ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌ర‌ణ కాకుండా అడ్డుకునేవాడిన‌ని ఆయ‌న అంటారు. జ‌గ‌న్ మాయ మాట‌లు విని త‌న‌ను ఓడించి, ఇవాళ వీధిన ప‌డ్డార‌ని నిష్టూర‌మాడుతారు. మ‌నమెవ‌ర‌మూ ఊహించ‌ని విధంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌పై నోరు పారేసుకోవ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. తిన‌బోతు రుచి చూడ‌డం ఎందుకు? ఎటూ సాయంత్ర‌మే క‌దా బ‌హిరంగ స‌భ‌. ఆయ‌న నోటి నుంచి రాలే ఆణిముత్యాల్లేంటో చూద్దాం.