ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫిరాయింపుల విషయంలో నీతులు చెప్పి వెళ్లారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఫిరాయించగానే నేతల మీద వేటుపడేలా చట్టం చేయాలని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఫిరాయింపు రాజకీయాల మీద ఇదివరకూ కూడా వెంకయ్య చాలా ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడును ఏమీ అనలేదు కానీ.. అప్పుడప్పుడు నీతులు చెప్పారు వెంకయ్య.
అంతేగాకా ఆ మధ్య జేడీయూ రాజ్యసభ సభ్యులిద్దరి మీద ఆయన వేటు వేశారు. నితీశ్ కుమార్ నాయకత్వాన్ని వారు వ్యతిరేకించారని వారిని అనర్హులుగా ప్రకటించారు వెంకయ్య నాయుడు. అప్పుడంటే వారు బీజేపీ వ్యతిరేకవాణి వినిపించారు కాబట్టి టక్కున వేటు వేశారు. అయితే ఇప్పుడు బీజేపీలోకి నలుగురు ఎంపీలు వచ్చి చేరారు. అది కూడా వెంకయ్య సమక్షంలో!
నైతికత ప్రకారం కచ్చితంగా ఇది తప్పే. ఒకటై మూడోవంతు, రెండూ బై మూడోవంతు అని ఎన్ని కథలు చెప్పినా.. వారు ఫిరాయింపుదారులే. అందులో సందేహం లేదు. ఇన్నాళ్లూ నీతులు చెప్పిన వెంకయ్య ఇప్పుడు
వారిపై అనర్హత వేటు వేయాలి. లేకపోతే ఆయన చెప్పిన నీతులు అన్నీ ఉత్తుత్తివే అవుతాయి.
ఆయన చెప్పిన నీతులను ఆయనే పాటించలేదని, ఆయన చేతిలో అందుకు సంబంధించిన అధికారం ఉన్నా ఇప్పుడు చేష్టలుడిగి చూడటం తప్ప బీజేపీ ప్రయోజనాలను ఆయన దెబ్బతీయలేరు అని సోషల్ మీడియాలో జనాలు విరుచుకుపడుతూ ఉన్నారు. మరి ఈ వ్యవహారంలో తన తీరును వెంకయ్య ఎలా సమర్థించుకుంటారో!