మెగాస్టార్ చిరంజీవి ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 67 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సంతోషకర క్షణం. మెగా అభిమానులకు పండుగ రోజు. రాజకీయ, సినీ , ఇతర రంగాల ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా అన్నయ్యకు శుభాకాంక్షలు చెబుతూ పవన్‌కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కనీసం అన్నయ్యకు విషెస్ చెబుతున్న ప్రకటనలో అయినా విమర్శలతో కూడిన రాజకీయాలకు చోటు ఇవ్వకూడదనే విచక్షణ పవన్‌లో కొరవడింది. తన రాజకీయ ప్రత్యర్థి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చిరంజీవికి బర్త్ డే విషెస్ ప్రకటనలో అనుచిత కామెంట్స్ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది. పవన్‌కు ఏ మాత్రం సంస్కారం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
జగన్‌ను విమర్శించేలా పవన్ ఏమన్నారో చూద్దాం.
‘అన్నయ్య…. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవి గారిని పిలవడమే కారణమేమో. ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు. అన్నిటికన్నా మిన్న ఆయనలోని ఒదిగి ఉండే లక్షణం. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి గారి సొంతం. సుగుణాలున్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావడం నా పూర్వ జన్మ సుకృతం’ అంటూ చాలా పెద్ద ప్రకటనే విడుదల చేశారు.
గత రెండుమూడు రోజులుగా తన అన్న చిరంజీవిని జగన్ అవమానించారని పవన్ వాపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సుగుణాలున్న అన్నయ్యకు తమ్ముడిగా పుట్టడం నీ పూర్వ జన్మ సుకృతం అయితే, అన్నయ్యగా పుట్టడం చిరంజీవి చేసుకున్న పాపం అని నెటిజన్లు గట్టిగా సెటైర్స్ విసురుతున్నారు. అసందర్భంగా జగన్‌పై విమర్శలు చేసి పవన్ తన కుసంస్కారాన్ని బయట పెట్టుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.