చంద్రబాబుతో బీజేపీ ఒఠ్ఠి మాటలే. జూనియర్ ఎన్టీఆర్‌తో మాత్రం చెట్టపట్టాల్. జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ కావడం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ప్రధాని మోదీ పలకరింపునకు ఎల్లో బ్యాచ్ పులకరించింది. ఇక ఏపీలో రాజకీయం మారుతోందని వరుస డిబేట్లు పెట్టి వైసీపీని రెచ్చగొట్టింది.
“ఏం చంద్రబాబు గారూ మీరు అసలు ఢిల్లీకి రావడం లేదా? మీతో చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయండి. మీరు ఈ దఫా ఢిల్లీకి వస్తే తప్పక కలవండి. ముందే చెప్పి వస్తే… నేనే విమానాశ్రయానికి వచ్చి రిసీవ్ చేసుకుంటా. లోకేశ్, దేవాన్ష్ బాగున్నారు కదా? మీ కుటుంబ సభ్యుల్ని చూడక చాలా ఏళ్లైంది. ఈ సారి తప్పకుండా వాళ్లను వెంట పెట్టుకురండి” అని బాబుతో ప్రధాని అన్నట్టు ఉన్నవీ లేనివీ కలిపి ఎల్లో మీడియా ఊదరగొట్టింది. అది కూడా చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి మరీ ఐదు నిమిషాలు ప్రధాని మాట్లాడారని గొప్పలు చెప్పుకున్నారు.
కాలం శరవేగంగా మార్పు తీసుకొచ్చింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమిత్‌షా-జూనియర్ ఎన్టీఆర్ అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకోవడం టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. చంద్రబాబుతో ఐదు నిమిషాలు ప్రధానితో మాట్లాడితే రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ రాజకీయాలపై మాట్లాడారని ఇదే ఎల్లో మీడియా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా కలయికను ఎలా అనుకూలంగా మలుచుకోవాలో ఎల్లో బ్యాచ్‌కు దిక్కుతోచడం లేదు. దీంతో వీళ్లిద్దరి భేటీపై టీడీపీ మౌనాన్ని ఆశ్రయించింది. కానీ ఆ పార్టీ అనుకూల మీడియా మాత్రం …అబ్బే రాజకీయ ప్రాధాన్యత లేదట అని సర్ది చెబుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్ర వేసిన ఎన్టీఆర్ నటనకు అమిత్ షా ముగ్ధుడయ్యారని, ఆయన్ను అభినందించడానికే అమిత్‌షా కలుసుకున్నారని ఎల్లో టీం సినిమా కథలు చెబుతోంది.
జూనియర్ ఎన్టీఆర్‌ను కేవలం అభినందించడానికే అయితే అర్ధగంట సేపు ఏకాంత చర్చలు ఎందుకు జరుపుతారనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. తనకెంతో ఇష్టమైన తాత దివంగత ఎన్టీఆర్, అలాగే తండ్రి హరికృష్ణతో పాటు నందమూరి వంశానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ఆవేదన జూనియర్ ఎన్టీఆర్‌లో ఉందని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ప్రతీకారం తీర్చుకోడానికి సమయం కూడా దెబ్బతిన్న పులిలా ఎన్టీఆర్ ఎదురు చూస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.
ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రాజకీయ అండ లభిస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కాదనుకుంటారనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఈ కలయిక రానున్న రోజుల్లో కీలక రాజకీయ మార్పునకు మలుపు అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌షా భేటీ అయ్యారంటే రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదే టీడీపీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.