కత్తి మహేష్ మరణించాడు. ఆ పేరుకు ముందు పెద్దగా విశేషణాలు తగిలించాల్సిన పని లేదు. పరిచయం చేయాల్సిన పని అంతకన్నా లేదు. బాగా చదవాడు. పుస్తకాలు. బాగా నేర్చుకున్నాడు విశ్లేషించడం. బాగా అలవరచుకున్నాడు. ధైర్యం. బాగా ఈదే వాడు. కానీ అంతా ఎదురీతే. చాలా విషయాలు చేతి వేళ్ల కొసనే వుండేవి. అన్నీ బాగానే వున్నాయి. అంతా బాగానే వుంది.
కానీ జనాలకు నచ్చలా. ఓ మనిషిని ఇంతగా ద్వేషిస్తారా? అన్నంతగా ద్వేషించారు. ఆఫ్ కోర్స్ ఒక మనిషిని ఎంతో కొంత అభిమానించేవాళ్లు వున్నట్లే అతనికీ అభిమానులు వున్నారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ద్వేషించేవారే ఎక్కువ.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో రగడ…హిందూ వాదులతో పోరు..సంప్రదాయ వాదులతో యుద్దం. అన్నింటికీ మించి తను నమ్మిన తన దళిత వాదం. ఇవన్నీ కలిసి, ప్లస్-మైనస్ లు లెక్కేసుకుంటే కత్తి మహేష్ ను ఒంటరిని చేసాయి. దాదాపుగా ఒంటరిపోరే సాగించాడు.
చావులో కూడా. చెన్నయ్ లో కత్తి మహేష్ పరిస్థితి ఎలా వుందీ అన్నది ఏ మీడియా రిపోర్ట్ చేయలేదు. అతన్ని అమితంగా ద్వేషించే సోషల్ మీడియా వీరులు కూడా పట్టించుకోలేదు.
ప్రమాదం జరిగిన మూడు రోజులు హడావుడి. ఆ తరవాత మరిచిపోయారు. 17లక్షలు ప్రభుత్వం ఇచ్చిన రెండు రోజులు మళ్లీ అలజడి. ఆ తరువాతా మరిచిపోయారు. ఇప్పుడు ఉన్నట్లుండి మరణ వార్త. దీన్ని మాత్రం అంతా రిపోర్ట్ చేసారు. చిత్రమేమిటంటే, సోషల్ మీడియాలో ఇంకా నెగిటివిటీ పోలేదు.
పోయినోళ్లందరూ మంచోళ్లు అన్నాడు ఆత్రేయ. కానీ పోయిన తరువాత కూడా సంప్రదాయ హిందూత్వ వాదుల దృష్టిలో మంచోడు కాలేకపోయాడు కత్తి మహేష్. బహుశా రాముడి మీద ఆయన చేసిన వాఖ్యలు అంతగా గాయపరిచి వుంటాయి వారిని. ఆ వాఖ్యలు చేసే ముందు కాస్తయినా ఆలోచించి వుండాల్సింది కత్తి మహేష్.
తను బతుకుతున్న సమాజం గురించి. ఆ సమాజంలో వున్న మెజారిటీ జనాల మనోభిప్రాయాలు, సెంటిమెంట్ల గురించి. అలా ఆలోచించి వుంటే వివాదాస్పద విమర్శకుడిగా ముద్ర పడేవాడే కాదు.
కత్తి మహేష్ మరణించాడు. వివాదాలకు, విశ్లేషణలకు ఇక సెలవంటూ లోకాన్ని వదిలిపోయాడు. ఇకనైనా ఎవ్వరూ ఏ వాదాలతో జనాల మనోభిప్రాయాలను అనవసరంగా కెలకకపోవడం ఉత్తమం.
సబబా? బేసబబా? సరైనిదా? లాజికల్ నా? కాదా? ఇవన్నీ కాదు పాయింట్…సమాజంలో బతుకుతూ దానికి ఎదురీదడం అంత సులువు కాదు. దానికి తెలివితేటలు వుంటే చాలదు. లౌక్యం కూడా కావాలి. కత్తి మహేష్ కు లేదు. అందుకే అతడు వివాదాస్పద విమర్శకుడు.