దేవుడి మీద భక్తితో గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి, అర్చన చేయించి, ప్రసాదంతో బైటకొస్తారు భక్తులు. చేసిన పాపాల భయంతో పరిహారం కోసం హుండీలో డబ్బులు వేస్తారు. కరోనా కష్టకాలంలో ప్రజల భయం, భక్తి రెండూ మారిపోయాయి. ఆలయాలు మూతపడ్డాయి, అట్టహాసంగా జరగాల్సిన పూజాదికాలన్నీ, కేవలం సంప్రదాయాలకు భంగం కలగకుండా నామమాత్రంగానే జరుగుతున్నాయి. భక్తులే రావట్లేదు, ఇక హుండీలను పట్టించుకునేవారెక్కడ. కోటానుకోట్ల ఆదాయం వచ్చే తిరుమల శ్రీనివాసుడి హుండీయే ఇప్పుడు ఖాళీ అయింది. బిజీబిజీగా ఉండే పరకామణిలో కాసుల గలగలలు లేవు. అసలిలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు.
ఇక లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఆలయాల పరిస్థితేంటి? ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందా? తగ్గుతుందా? ప్రార్థనా స్థలాలకు వెళ్లేవారు ఎక్కువవుతారా? లేక గణనీయంగా తగ్గిపోతారా? ఇంట్లో పూజలతో సరిపెట్టేవారి శాతం ఎక్కువ ఉంటుందా? రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు భక్తుల సంఖ్య తగ్గుతుందా?
ఇలా కరోనా వల్ల ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. అయితే భక్తి ముందు ఇవన్నీ బలాదూర్. ఇదంతా తాత్కాలికం. ప్రజలకు కరోనాపై ఉన్న భయం కంటే దేవుడిపై ఉన్న భక్తే ఎక్కువ. కాబట్టి ఆలయాలు కంగారుపడాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ ఎత్తేసి, సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఆలయాల్లో సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ముఖ్యం. ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా భక్తుల రాక మాత్రం ఆగదు. పోటు తగ్గదు.
ఓవైపు భక్తుల రాక తగ్గుతుందేమో అనే అనుమానంతో చాలా ఆలయాలు ఆన్ లైన్ సేవలు ప్రారంభించాయి. ఏపీ ప్రభుత్వం కూడా ప్రతి ఆలయానికీ అధికారిక వెబ్ సైట్, సోషల్ మీడియా అకౌంట్లు తప్పనిసరి అని ప్రకటించడంతో అధికారులంతా ముందు ఆ పని పూర్తి చేశారు. ఆన్ లైన్ సేవలకు రుసుములు వసూలు చేస్తున్నారు. టీటీడీ ఈ వ్యవస్థను ఇంకా అందుబాటులోకి తేలేదు కానీ, మిగతా ఆలయాలన్నీ ఆన్ లైన్లో పూజలు, ఇంటికే ప్రసాదం డెలివరీ అనేశాయి.
అయితే ఈ ఆన్ లైన్ పూజలకి డిమాండ్ ఇంకా ఊపందుకోలేదు. సామాన్య ప్రజలందరూ దూరప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్లడాన్ని తీర్థయాత్రలుగా భావిస్తారు. ప్రయాణం, శ్రమ అన్నీ వారికి దేవుడిపై ఉన్న భక్తిభావాన్ని చాటుతాయి. ఈ తేడా ఇప్పుడు ఆన్ లైన్ సేవల్లో కూడా కనిపిస్తుంది. మన గోత్రనామాలు మన కళ్లెదుటే దేవుడి ముందు పూజారి చదువుతుంటే అదో సంతోషం. అంతేకానీ వెబ్ సైట్లో లో పేర్లు ఎంటర్ చేసి, అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తే.. పుణ్యం వస్తుందో లేదోనని బెంగ. కాబట్టి సామాన్య భక్తులతో పాటు.. కార్పొరేట్ భక్తులు కూడా ఈ ఆన్ లైన్ పూజల జోలికి వెళ్లే అవకాశం చాలా తక్కువ.
కాబట్టి కరోనా తర్వాత భక్తిలో, భక్తుల రద్దీలో సమూల మార్పులు వచ్చేస్తాయని.. భక్తులు ఆలయాలకు ముఖం చాటేస్తారని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. కరోనా పని కరోనాది, భక్తుల పని భక్తులది. ఇలా ఉండబోతోంది వ్యవహారం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మనం ఇది కళ్లారా చూడబోతున్నాం.