ఆయనో మాజీ మంత్రి. జనంతో సంబంధం తెగిపోయి చాలా ఏళ్లైంది. ప్రత్యక్ష రాజకీయాల్లో జనం ఆదరించడం మానేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో కీలకపాత్ర పోషించిన నాటి ఆయన రుణాన్ని తీర్చుకునేందుకు చంద్రబాబు ఎప్పుడూ చంకలో పిల్లిలా పెట్టుకుని ఉంటాడు. టీడీపీ అధికారంలోకి వస్తే చాలు…ఆయనకు మాత్రం కేబినెట్‌లో బెర్త్ పక్కా. ఆ మంత్రి దంత వైద్యానికి ఇండియాలో రూ.10 వేలు లేదా రూ.15 వేలు పోయేదానికి…విదేశాల్లో చేయించేందుకు అక్షరాలా రూ.3 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు తిరిగి కేటాయించాల్సి వచ్చింది. సదరు మాజీ మంత్రి ఇపుడు సీఎం జగన్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడానికి కరోనా గురించి భయపడొద్దని సీఎం జగన్ సాంత్వన వచనాలు పలికితే…అవి ఆ మాజీ మంత్రికి కోపం తెప్పించాయి.
కరోనా వస్తుంది, పోతుంది అనడానికి అదేమైనా మీ చుట్టమా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించాడు. మరణాలు దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆ మాజీ మంత్రి చెప్పడం ద్వారా…ఏపీ ప్రజల చావులను కోరుకుంటున్నారని అర్థమైంది. తనకు తాను అపర మేధావి అని ఫోజు పెట్టే ఆ మాజీ మంత్రిని ప్రజలు తిరస్కరించినా గబ్బిలం మాదిరిగా రాష్ట్ర రాజకీయాలను సిగ్గు, మర్యాద లేకుండా పట్టుకుని వేలాడుతున్నాడు.
ప్రతిరోజూ ఏపీ సర్కార్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న సదరు మాజీ మంత్రివర్యులు…రాష్ట్రానికి ఖాళీ ఖజానా మిగిల్చిపోయిన ఘనత దక్కించుకున్నాడు. రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేసిన ఆ మాజీ మంత్రి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దుర్మార్గాలు గురించి చెబితే చాలు…ప్రజలు పేరు కనిపెట్టగల గుర్తింపు ఉన్న నాయకుడు కాని నాయకుడతను.