కరోనా మహమ్మారి లీలలు అన్నీఇన్నీ కావు. కరోనా పుణ్యమా అని ప్రకృతి కాలుష్యానికి దూరమై ఆనందంగా ఉంటోంది. పశుపక్ష్యాదులు సంతోషంతో కేరింతలు కొడుతున్నాయి. వన్యమృగాలు తమ రాజ్యంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి.లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాల్సిన తప్పని పరిస్థితి. దీంతో కొత్త జంటలకు గృహమే స్వర్గసీమగా మారింది.
ఏకాంతంగా గడిపేందుకు దంపతులకు కావాల్సిన సమయం చిక్కింది. ఇంత కాలం బిజీ లైఫ్‌లో తామేం పోగొట్టుకున్నామో మానవాళికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వ వ్యాప్తంగా 70 లక్షల మంది మహిళలు గర్భధారణ చేసే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ) పరిశోధన వెల్లడించింది. అయితే ఇవి అవాంఛిత గర్భధారణలు అనడం గమనార్హం.
అవాంఛిత అంటే కుటుంబ నియంత్రణ, ఇతరత్రా ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడంతో చోటు చేసుకుంటున్న పరిణామాలుగా ఆ పరిశోధనలో తెలిపారు. అంతే కాదండోయ్…మరో ఆరు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మహిళల సంఖ్య 4.7 కోట్లకు చేరుతుందని ఆ సంస్థ వెల్లడించింది.