ఓటీటీ రూల్ కు సురేష్ బాబు నో?

టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు చిన్న జ‌ర్క్ తప్పేలా లేదు. ఎనిమిది వారాల వరకు ఓటీటీకి సినిమాలు ఇవ్వకూడదన్న నిబంధనకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్ఙిబిటర్ సురేష్ బాబు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు…

టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు చిన్న జ‌ర్క్ తప్పేలా లేదు. ఎనిమిది వారాల వరకు ఓటీటీకి సినిమాలు ఇవ్వకూడదన్న నిబంధనకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్ఙిబిటర్ సురేష్ బాబు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు గిల్డ్ నుంచి అందరు నిర్మాతలకు పంపిస్తున్న లేఖ పై సంతకం చేసేందుకు సురేష్ బాబు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. 

మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలి తప్ప దానికి కళ్లాలు వేయడం అన్న ఆలోచన కరెక్ట్ కాదన్నది సురేష్ బాబు అభిప్రాయం అని తెలుస్తోంది. మరి ఇప్పుడు దీనికి గిల్డ్ ఏం చేస్తుదో చూడాలి.

సుప్రియ-అభిషేక్..ఢీ అంటే ఢీ

ఇదిలా వుంటే గిల్డ్ వాట్సాప్ గ్రూప్ లో మళ్లీ మరోసారి ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి నెలకొంది. హీరో నాని, నితిన్, నాగశౌర్యల మేనేజ‌ర్ వెంకటరత్నం ను గిల్డ్ నుంచి తొలగించారు. ఎగ్ఙిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన వెంకట్ ను తొలగించడం సరికాదని, నిర్మాతలు నాగవంశీ తదితరులు క్లియర్ గా సూచించినా గిల్డ్ మీద పట్టు వున్న సుప్రియ, దామోదర ప్రసాద్ అంగీకరించలేదని తెలుస్తోంది. దీని మీద మళ్లీ వాట్సాప్ గ్రూప్ లో వాదనలు జ‌రిగినట్లు బోగట్టా. మరి సుప్రియ ఎలా సభ్యురాలిగా వున్నారని నిర్మాత అభిషేక్ నామా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

దాంతో పలువురు సభ్యులు అభిషేక్ ను గ్రూప్ లో అటాక్ చేయడంతో ఆయన గ్రూపు నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది. నిజానికి అభిషేక్ కరెక్ట్ గానే అడిగారని కొందరు గిల్డ్ సభ్యులు అంటున్నారు. పలువురు ఎగ్ఙిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గిల్డ్ లో సభ్యులుగా వున్నారని, గిల్డ్ మీద పెత్తనం చెలాయిస్తున్నారని, అలాంటపుడు వెంకటరత్నాన్ని మాత్రం ఎందుకు తొలగించాలని అంటున్నారు.  

గిల్డ్ సమావేశాల్లో ఏమీ మాట్లాడడం లేదు కానీ పలువురు సభ్యులు ‘గ్రేట్ ఆంధ్ర’తో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ సుప్రియ, దామోదర ప్రసాద్ లను తప్పు పడుతున్నారు. నిర్మాత కాని సుప్రియ ఎలా సభ్యురాలిగా వున్నారని, గిల్డ్ మీద అధికారం చెలాయిస్తున్నారని వారు అంటున్నారు.అలాగే యాక్టివ్ ప్రొడ్యూసర్ కాని దామోదర ప్రసాద్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో ఎలా సభ్యుడిగా వున్నారని అంటున్నారు.

గిల్డ్ నేత దిల్ రాజు మాత్రం అంతా మీడియానే చేస్తోంది అస్సలు ఏమీ తకరారు లేదు అంటున్నారు. కానీ పలువురు సభ్యులు మాత్రం గ్రేట్ ఆంధ్ర కు ఫోన్ చేసి మరీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అసంతృప్తిని వార్తలుగా మార్చమని కోరుతున్నారు. ఇదో చిత్రమైన పరిస్థితి.