ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీరియస్‌గా ఉంటూనే కామెడీ చేస్తుంటారు. ఆయన భలే చిలిపి అని సోము వీర్రాజును నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తుంటారు. అదేంటోగానీ, ఏపీ బీజేపీ నేతలకు సొంత అభిప్రాయాలున్నట్టు కూడా కనిపించదు. ఇతర పార్టీల నేతలు ఏది మాట్లాడ్తారో, దాన్నే బీజేపీ నేతలు కూడా వాటినే పట్టుకుని విమర్శలు చేస్తుంటారు.
తాజాగా సోము వీర్రాజు విమర్శలను ఆ కోణంలోనే చూడొచ్చు. సంక్షేమ పథకాలకు సంబంధించి విరివిగా లబ్ధి చేకూర్చడంపై ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తామెక్కడ వెనుకపడి పోతామో అనే భయం కాబోలు సోము వీర్రాజు కూడా అదే నెత్తికెత్తుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ మీద చెయ్యి వేసి తియ్యడం లేదని విమర్శించారు.
కానుకల రూపంలో ప్రజలను మభ్య జగన్ మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, బటన్ ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని జనం ఎదురు చూస్తున్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఏపీలో నాలుగు ప్రాంతాల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో 173 నియోజకవర్గాల్లో యాత్ర చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించామన్నారు. ఇంతకూ యువమోర్చా నేతలు ఎక్కడెక్కడ పర్యటించారో ఎవరికీ తెలియకుండానే కార్యక్రమాల్ని పూర్తి చేసినట్టున్నారు.
బటన్ నొక్కి జనానికి సంక్షేమ పథకాలకు డబ్బు వేస్తే… సోము వీర్రాజు తెగ బాధ పడిపోతున్నారు పాపం. అంతేకాదు, అది ప్రజల్ని ప్రలోభ పెట్టడమే అని ఆయన విమర్శిస్తున్నారు. ఇంతకూ ఎలాంటి కార్యకలాపాలు చేస్తే బాగుంటుందో సోము వీర్రాజు చెప్పడం లేదు. ఆ మాటేదో చెబితే బాగుంటుందని ప్రత్యర్థులు అడుగుతున్నారు.