మునుగోడు ఉప ఎన్నికకు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తీవ్ర కసరత్తు మొదలు పెట్టాయి. ఇంకా ఉప ఎన్నికకు షెడ్యూల్ రాలేదు. అసలు ఎన్నిక ఎప్పుడు వుంటుందో కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడొచ్చినా దీటుగా ఎదుర్కోడానికి పార్టీలు సమాయత్తం కావడం ఆసక్తికర పరిణామం.
మునుగోడులో గెలుపు కోసం రాజకీయ పార్టీలు చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సీపీఐ మద్దతును అధికార టీఆర్ఎస్ పొందగలిగింది. ఇవాళ సీపీఐ కార్యవర్గ సమావేశం జరిగింది.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. అయితే ఇది కేవలం మునుగోడు ఉప ఎన్నికకే పరిమితం కాదని, భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్‌తో కలిసి నడుస్తామని చెప్పుకొచ్చారు.
బీజేపీకి వ్యతిరేకంగా తమ పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానించిందన్నారు. మునుగోడులో బీజేపీని టీఆర్ఎస్ మాత్రమే ఓడించగలదన్నారు. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభలో తమ నేతలు పాల్గొంటారన్నారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమను ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. తమ పార్టీకి ఇచ్చిన మూడు సీట్లలో కూడా కాంగ్రెస్ పోటీ చేసిందని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ వైఖరి వల్లే ఇబ్బంది పడ్డామన్నారు.