సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అది కూడా సీఎం జగన్‌తో పోల్చి చెప్పడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో అధునాతన నూతన భవనాల ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎన్వీ రమణ మాట్లాడుతూ వక్తలంతా ఇంగ్లీష్‌లో మాట్లాడారన్నారు. సీఎం జగన్ తెలుగులో ప్రసంగించిన తర్వాత తాను మాట్లాడకపోతే బాగుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. (ఇంగ్లీష్ విద్యకు జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది) సీఎం, తానూ తెలుగులోనే ప్రసంగించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
పదేళ్ల క్రితం నూతన కోర్టు భవనాలకు తానే శంకుస్థాపన చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. కోర్టు భవన నిర్మాణాలు పూర్తి కావడానికి సీఎం జగన్ సహకరించారన్నారు. ఇప్పుడు వాటిని తానే ప్రారంభించడం ఆనందంగా వుందన్నారు. న్యాయ వ్యవస్థకు సహకరిస్తానన్న మాటకు జగన్ కట్టుబడి నిర్మాణాలకు సహకరించారన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం వుందన్నారు.
న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఎన్వీ రమణ హెచ్చరించారు. ఈ నెల 27న పదవీ విరమణ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. తన ఉన్నతికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేతుల మీదుగా నూతన భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 2013లో ఎన్వీ రమణ చేతుల మీదుగా భూమి పూజ, నేడు ప్రారంభం కావడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా జగన్ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థకు అన్ని విధాలా సహకరించడానికి తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.