విక్రమ్ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో కమల్ హాసన్ తన సినిమాలను పట్టాలెక్కించడంపై శ్రద్ధ పెట్టినట్టుగా ఉన్నారు. ఇప్పటికే ఆగిపోయిందనుకున్న భారతీయుడు పార్ట్ టూ ను దాదాపు పట్టాలెక్కించారు.
భారతీయుడు పార్ట్ టూ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోగా.. శంకర్ కూడా తెలుగు సినిమాతో బిజీ అయ్యాడు. భారతీయుడు రెండో వెర్షన్ ను పక్కన పెట్టి కమల్ కూడా విక్రమ్ సినిమాను పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ఎలాగోలా ఆ సినిమాను పూర్తి చేసేలా ఉన్నారు ఆ దర్శకుడు, ఈ హీరో.
ఆ సంగతలా ఉంటే.. కమల్ హాసన్ కు సంబంధించి ప్రతిపాదనదశలో, పట్టాలెక్కి ఆగిపోయిన సినిమాలు కూడా బోలెడున్నాయి. ప్రతిపాదన దశలో, కథా చర్చలు జరిగి, ప్రకటనలు వచ్చి కూడా కమల్ సినిమాలను ఆపేశారు. కొన్నింటికి సంబంధించి కొంత షూటింగ్ కూడా జరిగి ఆగిపోయాయి.
అలాంటి వాటిల్లో ఒకటి శభాష్ నాయుడు. మూడు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా 2016లో ప్రకటించారు. తెలుగు, తమిళ వెర్షన్ లలో కమల్ తో పాటు బ్రహ్మానందం ప్రధాన పాత్రను పోషిస్తున్నట్టుగా పోస్టర్ కూడా విడుదల చేశారు.
దశావతారం సినిమాలో బలరాంనాయుడు పాత్రను ప్రధాన పాత్రగా మలిచి ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్, అక్షరలు కూడా నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
రాజీవన్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కాగా.. ఆ తర్వాత వివిధ పరిస్థితుల నేపథ్యంలో కమల్ స్వయంగా దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కింది. మరి విక్రమ్ ఉత్సాహంతో కమల్ బలరాం నాయుడు పాత్రపై ఉన్న ప్రేమతో చేపట్టిన ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఆరేళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కి గమ్యాన్ని చేరుకుంటుందో లేదో మరి!