టీడీపీతో 30 ఏళ్ల అనుబంధానికి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ గుడ్ బై చెప్పారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఎల్.రమణ పంపారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లినప్పటి నుంచి బీసీ సామాజికవర్గంలో బలమైన నేతను చేర్చుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఎల్.రమణను చేర్చుకునేందుకు టీఆర్ఎస్ నిర్ణయించుకుని పావులు కదిపింది.
మరో వైపు తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని గ్రహించిన ఎల్.రమణ, టీఆర్ఎస్‌లో చేరేందుకు ఇదే సరైన అవకాశంగా భావించారు. రమణతో తెలంగాణ మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావు జరిపిన చర్చలు ఫలించాయి.
టీఆర్ఎస్ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నిన్నరాత్రి (గురువారం) ఎల్.రమణ భేటీ అయ్యారు. అనంతరం ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ సామాజిక తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పాలనా సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు.
సీఎం కేసీఆర్‌తో చర్చించిన అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యం లో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు రమణ తెలిపారు. దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు.
గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు రమణ ధన్యవాదాలు తెలిపారు. మూడునాలుగు రోజుల్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు.