టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితుడైన నేపథ్యంలో హరీష్‌రావు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని హరీష్‌రావు సంచలన ఆరోపణ చేశారు. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి హరీష్‌రావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని హెచ్చరించారు.
తన మనుషులను కాంగ్రెస్‌లోకి పంపి తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు అడుగు పెడుతున్నారన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే.. ఆంధ్రాబాబు అని చంద్రబాబును ప్రజలు తరిమేశారని హరీష్‌రావు గుర్తు చేశారు.
చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో తన వాళ్లకు పదవులు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని అందరికీ తెలిసిందే అన్నారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్‌గా వచ్చాడు అని హరీష్ రావు పేర్కొన్నారు. హరీష్‌రావు తాజా ఆరోపణలతో టీఆర్ఎస్ మరో సారి సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురానుందని స్పష్టమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.