తనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తన ఇంట్లో కేసీఆర్-జగన్ రహస్యంగా సమావేశమయ్యారంటూ రేవంత్ చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు.
“రోజా ఇంట్లో జగన్-కేసీఆర్ మధ్య మంతనాలు జరిగాయని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు మా ఇంటికి జగన్ ఎప్పుడొచ్చారు. ఆయన రేవంత్ రెడ్డి కాదు, కోవర్టు రెడ్డి. తెలుగుదేశం కోవర్ట్ లా కాంగ్రెస్ లోకి వెళ్లి.. టీడీపీ గురువులైన రామోజీరావు, రాధాకృష్ణ లాంటివాళ్లను కలుస్తున్నారు. నా మీద నింద వేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోను.”
మరోవైపు ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శల్ని కూడా రోజా ఖండించారు. తన నివాసానికి జగన్ రాలేదన్న రోజా.. గతంలో కేసీఆర్ తన ఇంటికి ఎందుకొచ్చారనే విషయాన్ని స్పష్టం చేశారు.
“బీజేపీ నాయకులు కూడా మా ఇంట్లో జగన్-కేసీఆర్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని మాట్లాడ్డం బాధాకరం. తమిళనాడులో దేవుడి దర్శనానికి వెళ్తూ, మధ్యలో నా నియోజకవర్గం ఉండడంతో గౌరవార్థం కేసీఆర్ గారు మా ఇంటికొచ్చారు. అప్పుడు అక్కడ జగన్ లేరు. ఎలాంటి ఒప్పందాలు జరగలేదు.”
బీజేపీ నాయకులు ఇలాంటి విమర్శలు ఆపి.. పునర్విభజన చట్టం అమలు కోసం ప్రయత్నిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు రోజా. కేంద్రంలో ఉన్న తమ పార్టీ నాయకుల్ని, ప్రధాని మోదీని ప్రశ్నించడం చేతకాని బీజేపీ నాయకులు.. విభజన అంశాల్ని పక్కదోవ పట్టించడం కోసమే తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు రోజా.