టీటీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎల్.రమణ రాజీనామాతో టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యిందనుకుంటే పొరపాటే అని, కొత్త అధ్యక్ష నియామకాన్ని చంద్రబాబు ఎప్పుడో పూర్తి చేశారనే సెటైర్లు పేలుతున్నాయి.
ఇంతకూ టీటీడీపీ నూతన అధ్యక్షుడెవరనే ప్రశ్న ఎదురు కావచ్చు. నెటిజన్లు చెబుతున్నట్టుగా టీటీడీపీ నూతన అధ్యక్షుడు మరెవరో కాదు… మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి. రెండు రోజుల క్రితం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.
మరి రేవంత్‌రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావడం ఏంటనే అనుమానాలు ఎవరికైనా రావచ్చు. చంద్రబాబుతో రేవంత్‌రెడ్డికి ఉన్న అనుబంధం కారణంగా సోషల్ మీడియాలో ఇలాంటి సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్‌రావు కూడా రేవంత్‌రెడ్డిపై ఘాటు విమర్శలు చేయడాన్ని కొట్టి పారేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు. కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని హరీష్‌రావు సంచలన ఆరోపణ చేయడం కొత్త ఆలోచనకు తెరలేపింది.
అలాగే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి కాదు కోవర్ట్‌రెడ్డి అని ఆమె సెటైర్లు వేశారు. తెలుగుదేశం కోవర్ట్‌లా కాంగ్రెస్‌లోకి వెళ్లారని రేవంత్‌రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. అంతెందుకు రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన వెంటనే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డిని చంద్రబాబు మనిషి గానే కాంగ్రెస్ నేతలు గుర్తిస్తుండడం గమనార్హం. ఇలా మాట్లాడని నేతలు మరెంతో మంది ఉన్నారు.
ఏ రకంగా చూసినా రేవంత్‌రెడ్డిలో చంద్రబాబే కనిపిస్తుండడం విశేషం. నిన్నమొన్నటి వరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడిన రేవంత్‌రెడ్డి …మారిన రాజకీయ పరిస్థితుల్లో వైఎస్సార్‌పై ప్రేమను కురిపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రేవంత్‌రెడ్డి దివంగత నేతపై ప్రదర్శిస్తున్న గౌరవం కృత్రిమమైందని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి ఆడుతున్న డ్రామాగా కొట్టి పారేసే వాళ్ల సంఖ్య ఎక్కువే.
ప్రధానంగా రేవంత్‌రెడ్డి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే… తాను చంద్రబాబుకు మరో రూపమనే అభిప్రాయం నుంచి బయట పడితే తప్ప రాజకీయంగా పుట్టగతులుండవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై టీడీపీ శ్రేణుల ఆనందం చూస్తే… మంత్రి హరీష్‌రావు ఆరోపించినట్టుగా చంద్రబాబు మరోసారి తెలంగాణలో వస్తున్నారనే ఎవరైనా నమ్ముతారు.
ఈ ప్రచారం బలపడితే కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి నష్టం తప్పదు. ఆ నేపథ్యంలోనే ఇటు టీపీసీసీ, అటు టీటీడీపీ రెండింటికీ రేవంత్‌రెడ్డే అధ్యక్షుడనే ప్రచారం తెరపైకి రావడాన్ని రేవంత్‌రెడ్డి గ్రహించాలి. దీని నుంచి రేవంత్‌రెడ్డి ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదని చెప్పక తప్పదు.